ఊరూ వాడా.. జన‘జాతర’

ABN , First Publish Date - 2021-01-16T05:50:24+05:30 IST

సంకాంత్రి వేళ.. ఊరూ వాడా జనజాతరను తలపించింది. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. బుధవారం భోగి మంటలతో ప్రారంభమైన సంబరాలు సంక్రాంతి, కనుమ రోజుల్లోను కొనసాగాయి. మహిళలు, రైతులు, కూలీలు కుటుంబ సభ్యులు, బంధువులతో ఉత్సాహంగా ఈ పెద్ద పండగను చేసుకున్నారు. సంక్రాంతి రోజున పూర్వికులకు ఆచరణ మేరకు కొత్త బట్టలు, నైవేద్యంతో పూజలు నిర్వహించారు.

ఊరూ వాడా.. జన‘జాతర’
జి.సిగడాం : ఏకశిలాపర్వతంపై భక్త జనసందోహం

- ఉత్సాహంగా సంక్రాంతి పండగ

- కళకళలాడిన పల్లెలు

(ఇచ్ఛాపురం రూరల్‌/పలాస/ఆమదాలవలస రూరల్‌/ జలుమూరు/ జి.సిగడాం)

సంకాంత్రి వేళ.. ఊరూ వాడా జనజాతరను తలపించింది. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. బుధవారం భోగి మంటలతో ప్రారంభమైన సంబరాలు సంక్రాంతి, కనుమ రోజుల్లోను కొనసాగాయి. మహిళలు, రైతులు, కూలీలు కుటుంబ సభ్యులు, బంధువులతో ఉత్సాహంగా ఈ పెద్ద పండగను  చేసుకున్నారు. సంక్రాంతి రోజున పూర్వికులకు ఆచరణ మేరకు కొత్త బట్టలు, నైవేద్యంతో పూజలు నిర్వహించారు. గ్రామాల్లో డూడూ బసవన్నలు సందడి చేశాయి. ప్రతి ఇంటా ముత్యాల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కనుమ సందర్భంగా రైతులు గోవులను, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు. అలాగే చికెన్‌, మటన్‌ దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులుదీరారు.  


డేకురుకొండ.. జనసంద్రం 


సంక్రాంతి పర్వదినం వేళ.. పలాస హడ్కోకాలనీ సమీపంలో ఉన్న డేకురుకొండ.. జన సంద్రమైంది. ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని ఈ కొండపై జాతర నిర్వహించడం ఆనవాయితీ. తర్లాకోట జమీందారుల పాలన నుంచి డేకురుకొండ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి జారుడు ప్రదేశంలో పిల్లలు లేని దంపతులు జారితే.. సంతానం సిద్ధిస్తుందని ప్రజల నమ్మకం. ఇందులో భాగంగా  గురువారం రాత్రి నిర్వహించిన జాతరలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మన రాష్ట్రంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. కొండపై కొలువైన నీలకంఠేశ్వరస్వామి, త్రినాధ మందిరం, సంతోషిమాత ఆలయాలను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సంక్రాంతి సందడి కనిపించింది. 


సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు


ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో సంగమేశ్వర ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సంగమేశ్వర జాతర రద్దు చేస్తున్నట్టు కమిటీ సభ్యులు ప్రకటించారు. అయినప్పటికీ సాయంత్రం వేళ అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 


పద్మనాభుని కొండపై..


జలుమూరు మండలం కరకవలస సమీపంలో పద్మనాభుని కొండపై శుక్రవారం ఘనంగా జాతర నిర్వహించారు. శ్రీముఖలింగేశ్వర క్షేత్ర పాలకుడు విష్ణుమూర్తి.. పద్మనాభుని కొండపై కొలువుదీరాడు. కనుమ సందర్భంగా ఏటా ఇక్కడ పద్మనాభుని జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం పద్మనాభుని జాతరకు భక్తులు పోటెత్తారు. జలుమూరుతో పాటు హిరమండలం, సారవకోట మండలాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. పద్మనాభుని కొండపై కొలువుదీరిన కృష్ణార్జునులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


ఏకశిలాపర్వతంపై..


జి.సిగడాం మండలం మెట్టవలసలో ఏకశిలాపర్వతం.. భక్తజన సంద్రంగా మారింది. గురువారం సంక్రాంతి సందర్భంగా యాత్ర మహోత్సవాలకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. మండలంతోపాటు పొందూరు, సంతకవిటి, రాజాం తదితర మండలాలనుంచి వేలాదిగా భక్తులు మల్లిఖార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యకపూజలు చేశారు. భక్తుల కోసం వినోద కార్యక్రమాలను మూడురోజుల పాటు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  

Updated Date - 2021-01-16T05:50:24+05:30 IST