మీరు ఖర్చు చేయండి.. తర్వాత మేం చెల్లిస్తాం!

ABN , First Publish Date - 2022-08-09T01:02:38+05:30 IST

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందజేసే పారిశుధ్యం నిర్వహణ నిధులకు (శానిటేషన్‌, అన్‌టైడ్‌ ఫండ్స్‌) గ్రహణం పట్టింది.

మీరు ఖర్చు చేయండి..  తర్వాత మేం చెల్లిస్తాం!
ఉలవపాడు పంచాయతీలోని ఎస్సీ కాలనీలో రోడ్డుపై చెత్త

పారిశుధ్యం మెరుగు కోసం డీఎంహెచ్‌వో ఆదేశం

 ఖంగుతింటున్న వైద్యులు

 మూడేళ్లుగా అందని ఎన్‌హెచ్‌ఎం నిధులు

 కేంద్రం విడుదుల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మళ్లింపు

 ఇప్పటికి రూ.4.33 కోట్ల బకాయిలు

 


‘‘గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు కోసం మొదట మీ సొంత డబ్బులు ఖర్చు చేయండి. ఆ తర్వాత మీకు మేం చెల్లిస్తాం.’’ ఇలా జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో వైద్యులు బిక్కమొహం వేస్తున్నారు. వాస్తవంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తుంది. అయితే, మూడేళ్లుగా కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగునకు డబ్బుల్లేక ఇదిగో ఇలా వైద్యులకు ఉన్నతాధికారులు హుకూం జారీ చేశారు. 


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 8 : జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందజేసే పారిశుధ్యం నిర్వహణ నిధులకు (శానిటేషన్‌, అన్‌టైడ్‌ ఫండ్స్‌) గ్రహణం పట్టింది. ప్రతి సంవత్సరం కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకాలకు వాడేసుకుంటోంది. దీంతో గ్రామాలలో పారిశుధ్యం మెరుగు కోసం నిధులు లేక అవస్థలు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 722 గ్రామాలు ఉండగా, ఒక్కో గ్రామానికి పారిశుధ్యం, అన్‌టైడ్‌ ఫండ్స్‌ కింద రూ.20వేలు రావాల్సి ఉంది. ఈ నిధులతో ఆయా గ్రామాలలో పారిశుధ్య చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను పక్కదారి పట్టించి, సొంతానికి వాడేసుకుంది. మూడేళ్లుగా ఇదేతంతు జరుగుతుండటంతో శానిటేషన్‌, అన్‌టైడ్‌ నిధులు గ్రామాలకు అందని ద్రాక్షలాగే మారుతోంది. ఏడాదికి రూ.1.44 కోట్లు చొప్పున మూడేళ్లకు రూ.4.33 కోట్లు రావాల్సి ఉంది. . 


వైద్యాధికారులే ఆ నిధులు వెచ్చించాలి

మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) మాత్రం గ్రామాలలో పారిశుధ్యం నిర్వహణ నిధులను వైద్యాధికారులే సొంతగా ఖర్చు చేయాలని, నిధులు విడుదలైనప్పుడు చెల్లిస్తామని ఆదేశించారు. అయితే ఏ వైద్యాధికారి ఇందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఒక్కో పీహెచ్‌సీ వైద్యాధికారికి 14 గ్రామాలను కేటాయించాల్సి ఉండగా ఏడాదికి రూ.2.80 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన మూడేళ్లలో రూ.8.40 లక్షలు వెచ్చించాల్సి ఉంది. పోని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు ఖర్చు పెడదామన్నా అవి కూడా పూర్తిగా ఆరోగ్య కేంద్రాలకు చేరలేదు. ఈ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ నేపథ్యంలో పారిశుధ్య నిధులు అసలు ఎప్పుడు వస్తాయే అధికారులు కూడా చెప్పలేని  పరిస్థితి నెలకొంది. 


పారిశుధ్యం సమస్య 

నిధులలేమితో గ్రామాలలో పారిశుధ్యం వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మలేరియా విభాగం కొంతలో కొంత గ్రామాలలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నా అవి ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పారిశుధ్య సమస్యతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ఇది వర్షాకాలం కావడంతో సమస్య మరింత జటిల మవుతోంది. 


వైద్యాధికారులే ఖర్చు చేయాలని కోరాం

పారిశుధ్య నిధులకు ఆటంకం ఏర్పడటంతో వైద్యాధికారులే తాత్కాలికంగా ఆ ఖర్చు భరించాలని ఆదేశించాం. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులు వచ్చాక ఆ నిధులు చెల్లిస్తామని తెలిపాం. అయితే ఈ నిధులు ప్రభుత్వం విడుదల చేసి ఉంటే గ్రామాలలో కొంత వరకు పారిశుధ్యం మెరుగు పరిచే అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను త్వరలో విడుదల చేస్తుందని భావిస్తున్నాం.

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో

 



Updated Date - 2022-08-09T01:02:38+05:30 IST