సంగమేశ్వరంలో దీపోత్సవం

ABN , First Publish Date - 2020-11-24T06:04:28+05:30 IST

సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో తుంగ భద్ర పుష్కరాలను పురస్కరించుకుని బెంగుళూరు సమీపం లోని చింతామణి ప్రాంతానికి చెందిన భక్తులు కోటి లక్ష ఒత్తుల దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

సంగమేశ్వరంలో దీపోత్సవం
సంగమేశ్వరానికి విచ్చేసిన డీఈవో సాయిరామ్‌ దంపతులు

ఆత్మకూరు/కొత్తపల్లి, నవంబరు 23: సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో తుంగ భద్ర పుష్కరాలను పురస్కరించుకుని బెంగుళూరు సమీపం లోని చింతామణి ప్రాంతానికి చెందిన భక్తులు కోటి లక్ష  ఒత్తుల దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తుంగభద్ర పుష్కరా లతో పాటు కార్తీక సోమవారం కావడంతో సంగమేశ్వర క్షేత్రంలో ఈ అఖండజ్యోతిని వెలిగించడానికి ఇక్కడి వచ్చినట్లు వారు తెలిపారు.

 

పుష్కర భక్తులకు అన్నదానం

సప్త నదీ సంగమ క్షేత్రంలో తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు కాశి రెడ్డి నాయన ఆశ్రమ కమిటీ నిర్వాహకులు కపిలేశ్వరం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్ర మం చేపట్టారు. నిర్వాహకులు మాట్లాడుతూ 12 రోజుల పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉదయం టిఫిన్‌, మధ్యా హ్నం సమయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

బాంబ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీ

సప్త నదీ సంగమ క్షేత్ర పరిసరాల్లో తుంగ భద్ర పుష్కరాలను పురస్కరించుకుని కర్నూలు డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టారు. సోమవారం సాయంత్రం ఉమామహహేశ్వర ఆలయ వెనుక భాగంలోని పర్యాటక కేంద్రం వద్ద, క్రిష్ణా తీరం వెంట ఈ బృందాలు డాగ్‌ స్క్వాడ్‌తో నిశితంగా పరిశీలించారు.

  

సంగమేశ్వరంలో ప్రముఖులు 

సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో  తుంగభద్ర పుష్కరాలకు సోమ వారం పలువురు ప్రము ఖులు విచ్చేశారు. దేవదాయశాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆజాద్‌, కర్నూలు జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఈవో సాయిరామ్‌, ఆత్మకూరు డీఎస్పీ శృతి దంపతులు పుష్కర వేడుకల్లో భాగమయ్యారు. ఆ తర్వాత ఉమామహేశ్వరాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. పుష్కర ఏర్పాట్ల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వారికి ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. వీరి వెంట స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌, డ్వామా పీడీ వెంగన్న, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎంఈవో శ్రీరాములు పాల్గొన్నారు.

 

సప్తనదీ జలాల్లో పర్యాటక విహారం 

సంగమేశ్వర క్షేత్రంలోని సప్తనదీజలాల్లో పర్యాటక విహారం మొదలైంది. తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని క్షేత్రానికి వస్తున్న భక్తుల కోసం ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ నిర్వాహకులు బోటు షికార్‌ను అందుబాటులో వుంచారు. నాలుగు సీట్లు కెపాసిటీ కలిగిన చిన్నబోటులో భక్తులను ఎక్కించి సుమారు ఐదు నిమిషాల పాటు నదీజలాలపై విహరించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ బోటు షికార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నదీజలాల్లో బోటు షికార్‌ నిర్వహణకు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, అడ్డుకోవడం సరికాదని రెస్టారెంట్‌ నిర్వాహకులు అంటున్నారు.  వార్షిక రుసుము చెల్లించి బోటు షికార్‌ అనుమతులు తీసుకున్న తాము పర్యాటకులు లేక ఇంతకాలం తీవ్రంగా నష్టపోయామని, కనీసం తుంగభద్ర పుష్కరాల సందర్భంలోనైనా బోట్లను నడిపేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-11-24T06:04:28+05:30 IST