శాండ్‌ స్మగ్లింగ్‌ !!

ABN , First Publish Date - 2021-01-19T05:13:56+05:30 IST

పెన్నానదిలో ఒకవైపు ప్రభుత్వం అధికారికంగా తవ్వకాలు జరిపి ఇసుక అమ్ముతుంటే మరోవైపు కొందరు ఇసుకాసురులు అనధికారికంగా నదీమ తల్లిని కుళ్లబొడిచి కాసులు కూడబెట్టుకుంటున్నారు.

శాండ్‌ స్మగ్లింగ్‌ !!

పెన్నా నుంచి దర్జాగా దోపిడీ

సెబ్‌ కళ్లు కప్పి రవాణా

పదుల సంఖ్యలో ట్రాక్టర్ల పట్టివేత 

అయినా గమ్యానికి వందల ట్రక్కులు...

స్టేషన్ల వారీగా మామూళ్లు


పెన్నానదిలో ఒకవైపు ప్రభుత్వం అధికారికంగా తవ్వకాలు జరిపి ఇసుక అమ్ముతుంటే మరోవైపు కొందరు ఇసుకాసురులు అనధికారికంగా నదీమ తల్లిని కుళ్లబొడిచి కాసులు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి స్మగ్లింగ్‌ ముఠాలు సిండికేట్‌గా ఏర్పడి పెన్నా నుంచి ఇసుకను తరలిస్తున్నాయి. నిత్యం ఆకస్మిక దాడుల పేరిట స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పట్టుకుంటున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రోజూ వందల ట్రక్కుల ఇసుక గమ్యం చేరిపోతోంది. స్టేషన్ల వారీగా మామూళ్లు ఇచ్చుకుంటూ దర్జాగా ఈ దోపిడీ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు సమాచారం.


నెల్లూరు రూరల్‌, జనవరి 18 :  నిర్మాణాలకు మేలైనదిగా పేరుండటంతో పెన్నా నది ఇసుకకు ఎక్కడ లేని గిరాకీ ఉంది. బహిరంగ మార్కెట్లో పసిడికి పోటీనిచ్చే ధర పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. జిల్లాలోని ఇసుక లోడింగ్‌ పాయింట్లలో అధికంగా నెల్లూరు రూరల్‌ మండలంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దోపిడీ ముఠాలు సజ్జాపురం, దేవరపాళెం, పొట్టేపాళెం, ములుముడి గ్రామాల నుంచి రహస్య మార్గాలను ఏర్పాటు చేసుకున్నాయి. నవలాకులతోట, కోడూరుపాడు ప్రాంతాల్లోనూ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నాయి. ఇలా తవ్విన ఇసుకను ట్రాక్టర్‌ రూ.5వేల నుంచి రూ.5500కు నెల్లూరు నగరంలో విక్రయిస్తున్నారు. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి.


‘సెబ్‌’ కళ్లు గప్పి రవాణా

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో అధికారుల కళ్లు గప్పిమరీ స్మగ్లింగ్‌ ముఠాలు పెన్నా ఇసుకను దోచుకుంటున్నాయి. ఆ విభాగం అధికారులు నిత్యం ఆకస్మిక తనిఖీల పేరిట పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పట్టుకుంటుండగా, వందల సంఖ్యలో ట్రాక్టర్లు రహస్య మార్గాన చేరాల్సిన చోటికి చేరుతున్నాయి. సెబ్‌ అధికారులు దాడులకు సిద్ధమైన వెంటనే క్షణాల్లో స్మగ్లింగ్‌ ముఠాలకు సమాచారం అందుతున్నట్లు తెలిసింది. దీంతో నెల వారి లెక్కలున్న ట్రాక్టర్లన్నీ దారి మళ్లి రహస్య బాటపడుతున్నాయి. మామూళ్లు చెల్లించే జాబితాల్లో లేని ట్రాక్టర్లు మాత్రమే సెబ్‌ అధికారుల దాడుల్లో పట్టుబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

 

శ్రీరంగరాజపురం టూ నెల్లూరు 

బుచ్చి మండలం కాగులపాడు వద్దనున్న శ్రీరంగరాజపురం ఇసుక రీచ్‌ నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సెబ్‌ అధికారులు గుర్తించారు. దీంతో నెల్లూరు రూరల్‌లోని రాజగోపాలపురం, కొండ్లపూడి, పొట్టేపాళెం, కొమ్మరపూడి ప్రాంతాల్లో కాపుకాచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో వాహనాలను పట్టుకున్నారు. అయినా ఇసుక అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారు.  స్మగ్లింగ్‌ ముఠాలు నెల్లూరులోని పోలీసు స్టేషన్ల వారీగా మామూళ్లు కుదుర్చుకోవడంతో ఈ దోపిడీకి అడ్డుకట్టపడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ఎటు నుంచి ఎటు..?


సజ్జాపురం నుంచి లోడైన ట్రాక్టర్లు సౌత్‌మోపూరు మీదుగా ఆమంచర్ల నుంచి  నెల్లూరు, పొదలకూరు ప్రాంతాలకు చేరుతాయి.


ములుముడి, దేవరపాళెం గ్రామాల వద్ద లోడైన ట్రాక్టర్లు కొమ్మరపూడి మీదుగా నగరానికి తరలుతాయి.


పొట్టేపాళెంలో లోడైన ట్రాక్టర్లు కొండ్లపూడి నుంచి అంబాపురం మీదుగా నెల్లూరుకు చేరుతున్నాయి. 


మధ్యాహ్నం సమయంలో అయితే ఇరగాళమ్మ సంఘం మీదుగానే ప్రధాన రహదారిలో యథేచ్ఛగా నగరంలోకి వచ్చేస్తున్నాయి. 


ఇక నవలాకులతోట, కోడూరుపాడు ప్రాంతాల్లో లోడైన ట్రాక్టర్లు అయితే అల్లీపురం మీదుగా నెల్లూరులోని గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. 


ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రోజుకు పగటి పూట 10 - 15 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిపోతుండగా, రాత్రుళ్లు 20 - 30 ట్రాక్టర్లు లోడైవెళ్తున్నాయి. వీటిని తరలించేందుకు సిండికేటైన ముఠాలు ముందస్తు సమాచారంతో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దర్జాగా వ్యాపారం సాగిస్తున్నాయి.

Updated Date - 2021-01-19T05:13:56+05:30 IST