ఇసుక సొసైటీల్లో బినామీల రాజ్యం

ABN , First Publish Date - 2021-01-25T04:38:09+05:30 IST

మణుగూరు మండలంలోని గిరిజన సొసైటీల్లో బినామీ ఇసుక కాంట్రాక్టర్‌ల హవా నడుస్తోంది.

ఇసుక సొసైటీల్లో బినామీల రాజ్యం
‘ఆంధ్రజ్యోతి’తో తమ ఆవేదన పంచుకుంటున్న కూలీలు

రూ. నాలుగు వేలిస్తేనే పనికి రావాలని హుకుం

పోలీసులను ఆశ్రయించిన కూలీలు

మణుగూరురూరల్‌, జనవరి 24 : మణుగూరు మండలంలోని గిరిజన సొసైటీల్లో బినామీ ఇసుక కాంట్రాక్టర్‌ల హవా నడుస్తోంది. గిరిజన సొసైటీ ర్యాంపుల్లో బినామీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇసుక దందాను నిర్వహస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు సొసైటీ పాలక వర్గంలోనూ వీరి జోక్యం ఎక్కువవతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా మండలంలోని సాంబాయిగూడెం పెద్దమ్మతల్లి గిరిజన సొసైటీలో సభ్యులు, బినామీలు కూలీల నుంచి రూ. నాలుగు వేలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సొసైటీ సభ్యుల అండతోనే బినామీలు కూలీలను డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాని, డబ్బులివ్వని వారిని పనిలోకి రావొద్దని హెచ్చరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు దమ్మక్కపేట, చిక్కుడుగుంటకు చెందిన సుమారు 40 మంది కూలీలు మణుగూరు పోలీసులను ఆశ్రయించారు. ఇసుక లారీకి టార్పాలిన్‌ కట్టే కూలీపనికి రావాలంటే రూ. నాలుగు వేలు చెల్లించాలని, లేని పక్షంలో రావాల్సిన పనిలేదని కొందరు సొసైటీ పేరుతో హుకుం జారీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. కూలీ పనిచేసేతాము రూ. నాలుగు వేలు చెల్లించలేమని సీఐ భానూప్రకా్‌షకు వారి ఆవేదనను తెలిపారు. దీంతో స్పందించిన సీఐ కూలీలకు న్యాయం చేస్తానని, వసూళ్లకు ప్పాలడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినట్లు తెలిసింది. అనంతరం కూలీలు ‘ఆంధ్రజ్యోతి’ ముందు తమ ఆవేదనను వెళ్ళబుచ్చారు. ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లోడుతో బయటకు వెళ్లే లారీకి టార్ఫాలిన్‌ కడితే వచ్చేది రూ.500లేనని, రోజుకు సుమారు 45 మంది చోప్పున మొత్తంగా సుమారు 95 నుంచి వంద మంది దాకా టార్పాలిన్‌ కట్టే కూలీలుగా పనిచేస్తుంటామని తెలిపారు. టార్పాలిన్‌ కట్టే కూలీ పనిచేసే తాము రూ. నాలుగు వేలు ఎలా చెల్లిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. 

రూ. నాలుగు వేలిస్తేనే పనిలోకి రావాలంటున్నారు: మునిగల తిరుపతయ్య,

ఇసుక ర్యాంపులో లారీలకు టార్పాలిన్‌ కట్టే పనిచేసే తమను రూ. నాలుగు వేలు ఇవ్వాలని సొసైటీ పేరుతో కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. డబ్బులివ్వకుంటే కూలీపనిరావోద్దని హెచ్చరించారు. కూలీ పనిచేసే తాము రూ. నాలుగు వేలు చెల్లించలేం. న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.

కూలీలకు ఉపాధి కల్పించాం: సొసైటీ ఛైర్మన్‌ చిడెం సునీత 

గిరిజన సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులను నిర్వహిస్తూ కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాం. కూలీల నుంచి సొసైటీ సభ్యులు ఎటువంటి వసూళ్లకు పాల్పడటం లేదు. సొసైటీ నిర్వహణలోనూ బినామీల పాత్ర లేదు. 


Updated Date - 2021-01-25T04:38:09+05:30 IST