ఇసుక సరఫరా బంద్‌

ABN , First Publish Date - 2021-05-18T06:27:55+05:30 IST

జిల్లాలో ఇసుక కష్టాలు పరిపూర్ణమయ్యాయి. ఇదివరకు ఇసుక కోసం జిల్లావాసులు నానా అవస్థలు పడ్డారు. ఇసుక దొరక్క నిర్మాణాలను ఆపేశారు కూడా. బుక్‌ చేసుకుంటే ఇసుక ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టమే. అయినా.. వేచివుండి పలువురు పనులు సాగించారు.

ఇసుక సరఫరా బంద్‌

వారం రోజులుగా సమస్యతో సతమతం

ప్రైవేటు కంపెనీకి రీచల అప్పగింతతో అలసత్వం

తొలిరోజు ఒక రీచ నుంచే విక్రయాలు


అనంతపురం కార్పొరేషన, మే17: జిల్లాలో ఇసుక కష్టాలు పరిపూర్ణమయ్యాయి. ఇదివరకు ఇసుక కోసం జిల్లావాసులు నానా అవస్థలు పడ్డారు. ఇసుక దొరక్క నిర్మాణాలను ఆపేశారు కూడా. బుక్‌ చేసుకుంటే ఇసుక ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టమే. అయినా.. వేచివుండి పలువురు పనులు సాగించారు. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేదు. ఇసుక సరఫరా పూర్తిగా బంద్‌ అయిపోయింది. ఏకంగా వారం రోజుల పాటు ఇసుక పూర్తిస్థాయిలో బంద్‌ కావడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. ఆ తరువాత కొత్త విధానంలో ఇసుకను రీచల నుంచి స్టాక్‌పాయింట్లకు మార్చారు. కాంట్రాక్టర్లకు రవాణా చేసుకునే వెసలుబాటు ఇచ్చి, సొమ్ము చేసుకునే అవకాశం కల్పించారన్న ఆరోపణలున్నా యి. ఆ తరువాత మూడో దఫా ఏకంగా ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించేశారు. రాష్ట్రవ్యాప్తంగా జయప్రకాష్‌ వెంచర్స్‌ కంపెనీకి కట్టబెట్టారు. ఈ క్ర మంలోనే ఆ కంపెనీకి జిల్లాలవారీగా ఇసుక రీచలు, స్టాక్‌పాయింట్లు ఎక్క డ ఎంత నిల్వ ఉంది తదితర వివరాలు,  పనిచేసే సిబ్బందిని అప్పగించా రు. వారం రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఇసుక సరఫరా చేయలేకపోయా రు. అప్పగింతల వ్యవహారంతోనే ఇసుకను పంపడం లేదని తెలుస్తోంది.


ఒక్క వాహనమూ సరఫరా చేయని వైనం

కొత్త కంపెనీకి ఇసుక బాధ్యతలు అప్పగించి ఇప్పటికే రెండునెలలు కావస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఆ కంపెనీ పరిధిలోకి వస్తాయన్నారు. అవేమీ నిజం కాలేదు. రీచలు, స్టాక్‌పాయింట్లు అప్పగించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తూ వచ్చారు కానీ... ఇసుక సరఫరా విషయంలో మాత్రం చొరవ చూపలేకపోయారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈనెల 10వ వతేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క వాహనం కూడా ఇసుకను సరఫరా చేసిన పాపానపోలేదు. అప్పటివరకు ఆనలైనలో బుక్‌ చేసుకున్న వాటిని కూడా తిరస్కరించడం గమనార్హం. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని చెప్పుకొచ్చినా అది కూడా నిజం కాలేకపోయింది. ఒకే ఒక్క రీచ నుంచే ఇసుకను విక్రయించారు. కొత్త కంపెనీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజు తాడిపత్రి పరిధిలోని లక్షుంపల్లి నుంచి 20 వాహనాల వరకు ఇసుకను సరఫరా చేశారు. 


ఇంకెన్ని రోజులో...?

జిల్లాలో ప్రైవేటు కంపెనీ ఎన్ని రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఇసుకను సరఫరా చేస్తుందనే...? ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం ఇసుకను రీచలలోనే విక్రయిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టాక్‌పాయింట్లు ఉండవనీ, రీచలలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కంపెనీ ఎన్ని రోజుల్లో వాటిని సిద్ధం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు, మూడురోజుల్లో మూడు రీచల నుంచి ఇసుక విక్రయాలకు అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొన్నటి వరకు పీసీ రేవు, సీసీ రేవులలో నీటి నిల్వ అధికంగా  ఉందని తవ్వకాలు చేపట్టలేకపోయారు. వాటిలో తవ్వకాలు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేదు. ఉప్పలపాడులో గనుల శాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారని రెండురోజుల క్రితం అధికారులు చెప్పుకొచ్చారు. ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజులు ఇసుక దొరక్క ఇబ్బందులు తప్పవనటంలో సందేహం లేదు.

Updated Date - 2021-05-18T06:27:55+05:30 IST