అక్కసుతోనే ఇసుక దాడి!

ABN , First Publish Date - 2021-08-24T06:11:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో..

అక్కసుతోనే ఇసుక దాడి!

పైఅధికారులకు గౌరవం ఇవ్వరు

కింది స్థాయి ఉద్యోగులకు వేధింపులు

హుండీల లెక్కింపుల్లో నిబంధనలు తూచ్‌

దేవదాయ శాఖ ఏసీ శాంతిని తప్పుబట్టిన ఆర్‌జేసీ నివేదిక

క్రమ శిక్షణ చర్యలకు సిఫారసు

అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు!

హెచ్చరికలతో వివాదానికి ముగింపు

పైగా డీసీకి హెచ్చరికలు

చక్రం తిప్పిన వైసీపీ నేత?


అమరావతి(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిన్న చిన్న తప్పులు, అనుమానాలతో ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్న ప్రభుత్వం, ఓ అధికారి...తన పైఅధికారి ముఖంపై కార్యాలయంలోనే ఇసుక కొడితే దాన్ని అసలు తప్పే కాదని తేల్చేశారు! సదరు అధికారిని హెచ్చరించి వదిలేశారు. తప్పు చేసిన అధికారితో పాటు, బాధిత అధికారినీ హెచ్చరించడం ఇక్కడ మరో విశేషం. అయితే, ఘటనపై వచ్చిన నివేదికను పక్కనపెట్టి ఇసుక కొట్టిన అధికారిని సమర్థించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే...


ఈ నెల 5న దేవదాయ శాఖ అధికారుల మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఈవీ పుష్పవర్దన్‌పై అదే జిల్లాలో అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ)గా వున్న కె.శాంతి ఇసుకతో దాడి చేశారు. ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో నేరుగా ఆయన చాంబర్‌లోకి వెళ్లి తనతోపాటు తీసుకువెళ్లిన ఇసుకను ఆయన ముఖంపై కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీ మీడియాలో ప్రసారం కావడంతో ఉద్యోగ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పైఅధికారిపై ఏదైనా కోపం వుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయాలి తప్ప ఇలా ఇసుకతో దాడి చేయడం ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతోపాటు రాజమండ్రి రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ) సురేశ్‌బాబును విచారణాధికారిగా నియమించారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన ఆయన దేవదాయ శాఖకు నివేదిక సమర్పించారు.


ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా

అసిస్టెంట్‌ కమిషనర్‌గా తన విధులు నిర్వర్తించడంలో కె.శాంతి పూర్తిగా విఫలమయ్యారని ఆర్‌జేసీ తన నివేదికలో స్పష్టంచేశారు. తానే ఉన్నత స్థాయి అధికారినని భావిస్తూ జిల్లాలో పనిచేసే ఉద్యోగుల మధ్య ఆమె అలజడులు సృష్టిస్తున్నారని, తన పైఅధికారులను గౌరవించడం లేదని పేర్కొన్నారు. ఆర్థిక అక్రమాలకు పాల్పడే విషయంలో తన కింది యంత్రాంగాన్ని ప్రోత్సహిస్తున్నారనే సంచలన విషయాలను పొందుపరిచారు. ఆలయాల హుండీలు తెరిచే సమయంలో నిబంధనలు పాటించడం లేదని, లెక్కించాల్సిన ప్రదేశం నుంచి చాలా దూరం హుండీలు తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత ఆలయ ఈవో, సీఎఫ్‌వో లేకుండా అసలు సంబంధం లేని పక్క డివిజన్‌ దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా హుండీల లెక్కింపు చేపట్టారని వివరించారు. ఈ కారణాలతో ఇద్దరు అధికారుల మధ్య దూరం పెరిగిందని, ఈ క్రమంలో డీసీపై ఆమె ఇసుక కొట్టారని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా శాంతి క్రమశిక్షణ చర్యలకు అర్హురాలని స్పష్టంగా పేర్కొన్నారు.


హెచ్చరికలతో సరి!

సాధారణంగా విచారణాధికారి ఇలాంటి నివేదిక ఇస్తే ఏ శాఖ అయినా దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోదు. కానీ, ఆర్‌జేసీ నివేదిక సమర్పించిన తర్వాత దేవదాయ శాఖ ఉన్నతాధికారులు వివాదంలో వున్న డీసీ, ఏసీలను విజయవాడలోని కమిషనర్‌ కార్యాలయానికి పిలిపించారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే డిస్మిస్‌ చేస్తామని హెచ్చరించి వదిలేశారు. పైఅధికారిపై ఇసుక కొట్టిన శాంతిపై చిన్న చర్య కూడా తీసుకోకుండా హెచ్చరికలతో సరిపెట్టారు. పైగా ఏసీని ఇబ్బంది పెట్టొద్దంటూ డీసీనీ హెచ్చరించారు. అసలు నివేదికలో అంత స్పష్టంగా ఏసీ అనేక తప్పులు చేశారని పేర్కొంటే ప్రభుత్వం దాన్ని ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ప్రొబేషన్‌ కాలం కూడా పూర్తికాని ఏసీ శాంతి ఇలాంటి దాడికి పాల్పడితే కనీస చర్యలు కూడా లేకపోతే ఎలా? అని దేవదాయ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


అధికార పార్టీ నేత అండ

ఏసీ శాంతి తప్పుచేసినట్టు స్పష్టంగా విజువల్స్‌లో కనిపిస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదికలను బుట్టదాఖలు చేసేటప్పుడు అసలు విచారణాధికారులను నియమించడం, విచారణ చేపట్టడం వంటి ప్రక్రియలు ఎందుకని అంటున్నారు. కాగా, విశాఖకు చెందిన అధికార పార్టీకి చెందిన ఒక నేత అండదండలు పుష్కలంగా వుండడం వల్లే ఏసీ శాంతిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది.

Updated Date - 2021-08-24T06:11:46+05:30 IST