ఇసుక దందా!

ABN , First Publish Date - 2020-08-08T08:02:39+05:30 IST

ఇసుక సరఫరా అవినీతిమయం అయింది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా సులువుగా నిర్మాణదారులకు ఇసుక లభించడంలేదు.

ఇసుక దందా!

రూ.3 వేలు అదనంగా చెల్లిస్తేనే సరఫరా

మూతపడిన నరసరావుపేట ఇసుక యార్డు

బ్లాక్‌లో లారీ ఇసుక ధర రూ.30 వేలు

 

ఇసుక సరఫరా అవినీతిమయం అయింది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా సులువుగా నిర్మాణదారులకు ఇసుక లభించడంలేదు. లారీకి రూ.3 వేలు లంచం చెల్లిస్తేనే దరఖాస్తుదారునికి ఇసుక సరఫరా అవుతోంది. కొందరు నేతల కనుసన్నల్లో పెద్దఎత్తున ఇసుక దందా కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


పట్టణానికి చెందిన ఓ వ్యక్తి జూన్‌ 23న ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. డిపో నుంచి ఫోన్‌ చేస్తున్నాం.. మీకు ఇసుక తెస్తాం రూ.3 వేలు ఇచ్చి పంపించండి అని చెప్పారు. ఇందుకు సదరు వ్యక్తి అంగీకరించలేదు. దీంతో ఇసుక సరఫరా కాలేదు. 


మరో వ్యక్తి ఇలానే ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇతను జూన్‌ 24న, 30న ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. రెండు లారీలు తెస్తున్నాం రూ.6 వేలు ఇవ్వాలి అని చెప్పారు. ఇందుకు అంగీకరించడంతో రెండు లారీల ఇసుకను సదరు వ్యక్తికి సరఫరా చేశారు.


నరసరావుపేట, ఆగస్టు 7:  నరసరావుపేటలోని ఇసుక యార్డును మూసివేశారు. ఈ యార్డుకు దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి కోనూరు డిపోకు దరఖాస్తులను బదిలీ చేశారు. ఈ క్రమంలో మీకు ఇసుక తీసుకొస్తాం లారీ వ్యక్తికి రూ.3 వేలు ఇవ్వండి అంటూ కొందరు ఫోన్‌ చేసి  డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. వారు అడిగిన లంచం చెల్లించేందుకు అంగీకరించని పక్షంలో ఇసుక సరఫరా అయ్యే పరిస్థితి లేదు.


 నరసరావుపేట ఇస్సపాలెం యార్డుకు ఇసుక కోసం జూన్‌, జూలై నెలలో నిర్మాణ దారులు వందల సంఖ్యలో దరఖాస్తు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 14,000 టన్నుల ఇసుక దరఖాస్తుదారులకు సరఫరా చేయాల్సి ఉంది. రూ.3 వేలు లంచం ఇవ్వడానికి  అంగీకరించిన వారికి మాత్రమే ఇసుక సరఫరా చేస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నరసరావుపేట నుంచి కోనూరు మార్చడం వలన లారీ కిరాయి కింది రూ.3 వేలు వసూలు చేస్తున్నట్టు  చెబుతున్నారు. 


అదనపు భారం

ఇక్కడి యార్డు మూసివేయడంతో నరసరావుపేట ప్రాంతం వారు చిలకలూరిపేట, వినుకొండ, పల్నాడు ఇసుక యార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో లారీ కిరాయి రూ..3 వేలు నుంచి రూ.4,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. నేరుగా ఇసుక రీచ్‌ల వద్ద ఉన్న డిపోల ద్వారా సరఫరా చేసే ఈ అదన పు భారం తగ్గే అవకాశం ఉంది. 


బ్లాక్‌లో ఎంతకావాలంటే అంత..

 ఇక బ్లాక్‌ మార్కెట్‌లో మాత్రం ఎంత కావాలంటే అంత ఇసుక చాలా సులభంగా లభిస్తున్నది. నరసరావుపేటకు చెందిన ఒక నిర్మాణదారుడు రెండు లారీల ఇసుకకు రూ.71 వేలు చెల్లించి బ్లాక్‌లో కొనుగోలు చేశాడు. గంట వ్యవధిలోనే బ్లాక్‌ మార్కెట్‌ దారులు ఇసుక సరఫరా చేయడం గమనార్హం. 


అదనంగా చెల్లించవద్దు..

 దరఖాస్తు దారులు ఇసుక కోసం ఆన్‌లైన్‌లో చెల్లించిన దాని కన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించ వలసిన అవపరం లేదని జిల్లా ఇసుక అధికారి వెంకటేశ్వర్లురెడ్డి శుక్రవారం తెలిపారు. నరసరావుపేట యార్డును తాత్కాలికంగా మూసివేశామని ఈ యార్డుకు దరఖాస్తు చేసుకున్నవారికి కోనూరు డిపోకు కేటాయించడం జరిగిందని చెప్పారు. 

Updated Date - 2020-08-08T08:02:39+05:30 IST