అమ్మకానికి.. బెజవాడ రైల్వేస్టేషన్!

ABN , First Publish Date - 2021-09-09T06:09:04+05:30 IST

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా..

అమ్మకానికి.. బెజవాడ రైల్వేస్టేషన్!

రైల్వే.. ఫర్‌ సేల్‌

మానిటైజేషన్‌ పేరుతో బెజవాడ రైల్వేస్టేషన్‌ అనధికార విక్రయం 

సత్యనారాయణపురం రైల్వే కాలనీ కూడా.. 

గోడౌన్లకు గూడ్స్‌ షెడ్లు.. బంపర్‌ ఆఫర్‌ 

భగ్గుమన్న రైల్వే ఉద్యోగులు

డివిజన్‌ పరిధిలో భారీగా ఆందోళనలు 

డీ ఆర్‌ఎంకు రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతల లేఖ 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ రానున్న రోజుల్లో పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇంతకుముందు పిలిచిన ప్రైవేటు టెండర్లకు ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అనధికారిక అమ్మకానికే పెట్టేసింది. సత్యనారాయణపురం రైల్వే కాలనీ, గూడ్స్‌ షెడ్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడ డివిజన్లోని రైల్వే కార్మికులు బుధవారం ఎక్కడికక్కడ మెరుపు ఆందోళనలు నిర్వహించారు.  


133 ఏళ్ల చరిత్ర గల విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మానిటైజేషన్‌ పేరు పెట్టి, లీజుకు ఇస్తున్నట్టు చూపుతూ అనధికారిక విక్రయానికి తెర తీసింది. ఒక్క రైల్వేస్టేషనే కాదు.. విజయవాడ డివిజన్‌లో ఉన్న రైల్వే ఆస్తులను కూడా అందులో చేర్చింది. మరీ ముఖ్యంగా సత్యనారాయణపురం రైల్వే కాలనీని కూడా ఈ జాబితాలో చేర్చింది. డివిజన్‌ పరిధిలోని గూడ్స్‌ షెడ్లను గోడౌన్లుగా ఉపయోగించుకోవచ్చునని ప్రైవేటువారికి ఆఫర్‌ ఇచ్చింది. రైల్వే బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బుధవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ) నేతలు ఇచ్చిన పిలుపుతో డివిజన్‌ పరిధిలోని కార్మికులు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మెరుపు ఆందోళనలకు దిగారు.


133 ఏళ్ల చరిత్ర  

విజయవాడ రైల్వేస్టేషన్‌ను 1888వ సంవత్సరంలో నిర్మించారు. అప్పట్లో మద్రాస్‌ దక్షిణ మహారత్తన్‌ (ఎంఎస్‌ఎం) స్వతంత్ర రైల్వేగా ఉండేది. ఆ రైల్వే ప్రధాన తూర్పు మార్గాన్ని విజయవాడ వెళ్లే మార్గాలతో అనుసంధానించేలా రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. 1889వ సంవత్సరంలో నిజాం హయాంలో సికింద్రాబాద్‌, విజయవాడ రైల్వేస్టేషన్ల మధ్య ఎక్స్‌టెన్షన్‌ లైన్‌ను నిర్మించారు. ఈ లైన్‌ ద్వారా విజయవాడ రైల్వే జంక్షన్‌గా మారింది. 1899, నవంబరు 1వ తేదీన విజయవాడ, చెన్నైల మధ్య బ్రాడ్‌గేజ్‌ లైన్‌ను నిర్మించారు. చెన్నై నుంచి ముంబయి, హౌరా, ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్య రైలు ప్రయాణం సాధ్యమైంది. స్వాతంత్ర్యానంతరం 1950లో భారత ప్రభుత్వం అన్ని స్వతంత్ర రైల్వేలను జాతీయం చేసింది. అప్పుడే మద్రాస్‌ దక్షిణ మహరత్తన్‌ కూడా దక్షిణ రైల్వేలో అంతర్భాగమైంది. విజయవాడ రైల్వేస్టేషన్‌ను దక్షిణ రైల్వేకు కేటాయించారు. ఏప్రిల్‌ 14, 1966న కొత్తగా ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో విజయవాడ డివిజన్‌ భాగమైంది. 


చిన్న షెడ్డుతో మొదలై..

బెజవాడ రైల్వేస్టేషన్‌ ఒక చిన్న షెడ్డుతో మొదలైంది. జనవరి 19, 1979లో కొత్త రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. 1976లో ఈ స్టేషన్‌ కేంద్రంగా రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ క్యాబిన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఇలా ప్రస్థానం సాగించిన రైల్వేస్టేషన్‌ నేడు 10 ప్లాట్‌ఫామ్‌లతో దేశంలోనే బిజీ జంక్షన్‌గా పేరుగాంచింది. ప్రతి రోజూ 80 డైలీ ఎక్స్‌ప్రెస్‌లు, 47 నాన్‌ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లు, 133 డైలీ పాసింజర్‌, 11 నాన్‌ డైలీ పాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మొత్తం 275 పాసింజర్‌ రైళ్లు, 175 సరుకు రవాణా రైళ్లు విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. 


రైల్వే కాలనీ సైతం అమ్మకానికి!  

విజయవాడ రైల్వేకు నగరంలో అనేక విలువైన ఆస్తులున్నాయి. అలాంటి వాటిలో సత్యనారాయణపురంలోని రైల్వే కాలనీ ఒకటి. రైల్వే ఉద్యోగులకు ఇక్కడ గృహ సముదాయాన్ని నిర్మించారు. దాదాపు వెయ్యిమంది రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ నివాసాలకు ఆనుకుని మరో మూడెకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటినీ రైల్వేబోర్డు ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో పిలిచిన ప్రైవేటు టెండర్లకు ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. 


అంతా గుంభనం  

మానిటైజేషన్‌ వ్యవహారం గుంభనంగా నడుస్తోంది. ఎన్ని కోట్లకు చేయాలన్నది ఇంకా రహస్యంగానే ఉంది. దాదాపు అమ్మకమే అయినా, ఇది బయటకు కనిపించకుండా ఉండటానికి మానిటైజేషన్‌ పదాన్ని వాడుతున్నారు. మొత్తం స్టేషన్‌, ఇతర ఆస్తులన్నింటినీ లీజు పేరుతో 50 సంవత్సరాలకు బదలాయిస్తున్నా, ముందుగానే డబ్బు వసూలు చేస్తారు. ఒక రకంగా ఇది అమ్మకం కోవలోకే వస్తుంది. 


లాభాల డివిజన్‌

విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌.. దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌. విజయవాడ డివిజన్‌ దేశంలోనే అత్యంత లాభదాయక డివిజన్లలో ఒకటి. రవాణాలో దేశంలోనే వేళ్ల మీద లెక్క పెట్టే డివిజన్లలో ఒకటి. 2018లో దేశంలోనే అత్యంత ఎర్నింగ్‌ డివిజన్‌గా పేరుపొందింది. లాభాలను ఆర్జించి పెడుతున్న ఇలాంటి డివిజన్‌ ఆస్తులను కూడా కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేయాలని చూడటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.


భగ్గుమన్న రైల్వే కార్మికులు 

రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌ను విజయవాడ డివిజన్‌ వ్యాప్తంగా రైల్వే కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ) ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ రైల్వేస్టేషన్‌, రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌, కోచింగ్‌ డిపోలు, డీజిల్‌, లోకో షెడ్లు, వర్క్‌షాప్‌లు ఇలా ప్రతి చోట వందలాది మంది కార్మికులు రైల్వే బోర్డు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మెరుపు ధర్నాలు నిర్వహించారు. యూనియన్‌ విజయవాడ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి.ఎన్‌. శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు కార్మిక సంఘ నేతలు విజయవాడ డీఆర్‌ఎం శివేంద్ర చౌహాన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. మానిటైజేషన్‌ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, తమ నిర్ణయాన్ని రైల్వేబోర్డు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.



Updated Date - 2021-09-09T06:09:04+05:30 IST