Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆశించిన మేర పెరగని ఆశాల జీతాలు

twitter-iconwatsapp-iconfb-icon
ఆశించిన మేర పెరగని ఆశాల జీతాలుకనీస వేతనం కోసం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశలు(ఫైల్‌)

- ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా జీతాలు అంతంతే..

- ప్రతీ పనికి వారే.. రోజుకు 12 గంటల పని భారం

- కనీస వేతనం అమలు ఎప్పుడని ఆవేదన

- కనీస వేతనం రూ.21వేలు అందించాలని డిమాండ్‌


కామారెడ్డి టౌన్‌, జనవరి 21: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్లలోపు చిన్నారుల వరకు టీకాలు వేయించడం.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. క్షయ బాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషి చేయడం.. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బాధితుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, వారికి తగిన వైద్యసేవలు అందేలా చూడడం ఇలా ఒక్కటేమిటి వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఆశ కార్యకర్తలే. ఎన్నికలు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు టీకాలు, వ్యాక్సిన్‌లు, ఐసీడీఎస్‌లో వారి సేవలు తప్పని సరి, ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో వారి భాగస్వామ్యం ఉంటుంది. ఇన్ని సేవలందిస్తున్న ఆశ కార్యకర్తలను ప్రభుత్వం మాత్రం విస్మరిస్తోంది. వారికి చెల్లించాల్సిన పారితోషికాలను అంతంత మాత్రంగానే పెంచుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా వేతనాల కోసం పోరాడుతున్న వారికి ఇచ్చే పారితోషకంను 30శాతంను ఇటీవల ప్రభుత్వం పెంచడంతో రూ.7,500 నుంచి రూ.9,750కి చేరింది. అయితే వారితో చేయించుకుంటున్న పనికి, ఇచ్చే వేతనాలకు అసలు సంబంధం లేదని, ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో ఆశలను రోజుకు 12 గంటల పాటు పని చేయించుకుంటున్నారని ఆయా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలని కనీస వేతనం రూ.21వేలు అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

అసలు ఎవరీ ఆశ వర్కర్లు

2005లో కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దేశంలోని మహిళలకు వైద్యసేవలు అందించాలని నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా వీరిని నియమించారు. ఆశా అంటే ఏఎస్‌హెచ్‌ఏ(అక్రిడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌) లేదా సామాజిక ఆరోగ్య కార్యకర్తల అని పిలుస్తారు. గ్రామాల్లో గర్భిణులను గుర్తించి నమోదు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకునేలా అవగాహన కల్పించడం వీరి విధులు. పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్‌ వేయించడం వీరి బాధ్యతే. అందుకు ప్రతీ ప్రసవానికి రూ.600, బిడ్డ వ్యాక్సినేషన్‌కు రూ.150 చొప్పున చెల్లించాలి. కానీ ఆశ వర్కర్లకు నియమిత పని వేళలంటూ ఏమీ లేవు. వైద్యఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో జరిగే ఏ సర్వేకైనా వీరే ఆధారం. తమకు షరతులతో కూడిన వేతనాలు ఇస్తారని, వారు చెప్పిన టార్గెట్‌లను ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే అందుకుంటామని ఆవేదన చెందుతున్నారు. నెలలో 30 రోజులు, రోజుకు 12 గంటల చొప్పున కష్టపడినా పూర్తిస్థాయి వేతనం రాదని వాపోతున్నారు.

ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు కరువు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్‌ మహమ్మారికి ప్రతి ఒక్కరూ గడగడలాడారు. వైరస్‌ భారినపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యఆరోగ్యశాఖ అఽధికారుల సూచనల మేరకు ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రచారంలో పాల్గొన్న చుట్టు పక్కల వారితో పాటు ఇతరులు దూరం పెట్టినా ఎలాంటి ఇబ్బందులు పడకుండా విధులు నిర్వహించినా తమకు గుర్తింపే లేదని ఆశ కార్యకర్తలు వాపోతున్నారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి కుటుంబసభ్యులే పట్టించుకోని సమయంలో తాము ధైర్యంగా వెళ్లి నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తూ మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నా తమను మాత్రం ప్రభుత్వం ప్రతీసారి విస్మరిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఇంట్లో హడావిడిగా పనులు ముగించుకుని విధులలో చేరుతూ ఏ రాత్రికో ఇంటికి చేరుతున్న తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించాలని, పని భారం తగ్గించాలని కోరుతున్నారు.

కనీస వేతనం ఏదీ?

ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ 2018 ప్రకారం కనీస వేతనం రూ.21వేలు ఉండాలని కేంద్రం తెలిపింది. కానీ ఇప్పటికీ వేతన స్థిరీకరణ లేదు. పక్క రాష్ట్రంలో వేతన స్థిరీకరణ జరిగి అక్కడి ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున చెల్లిస్తోంది. ఇక్కడ ఆశలకు కనీసం పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు కూడా లేవు. ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ సూచించిన విధంగా కనీస వేతనాలు అమలు చేయాలని ఇప్పటికీ అనేక సార్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వర్తిస్తున్న ఆశలకు గుడ్డిలో మెల్లిలా ప్రభుత్వం ఇటీవల 30శాతం వేతనాలు పెంచినప్పటికీ కనీస వేతనం రూ.21వేలు అమలు చేస్తేనే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని సీఐటీయూ నాయకులు పేర్కొంటున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.