జీతాలు మహాప్రభో..!

ABN , First Publish Date - 2022-04-18T05:39:14+05:30 IST

కొత్త జిల్లాలు ఏర్పాటైతే పరిపాలన సులభంగా సాగుతుందని అంతా అనుకున్నారు.

జీతాలు మహాప్రభో..!

ఏపీవీపీ ఉద్యోగులకు అందని వేతనాలు

సగం నెల గడిచినా రాకపోవడంతో గగ్గోలు

పిల్లల ఫీజులు, అద్దెలకు  ఇబ్బంది పడుతున్న వైనం


నంద్యాల, ఆంధ్రజ్యోతి


కొత్త జిల్లాలు ఏర్పాటైతే పరిపాలన సులభంగా సాగుతుందని అంతా అనుకున్నారు. సకల సౌకర్యాలతో పాటు, జీత భత్యాలకు ఎలాంటి లోటు  ఉండదని  ఉద్యోగులు భావించారు. కొత్త జిల్లా మురిపెం అయితే తీరింది గాని కొంత మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. ప్రత్యేకించి అత్యవసర సేవలందించే ఏపీవీపీ(ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌) ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సగం నెల గడిచినా జీతం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


ఎదురు చూపులు..


ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కింద మూడు విభాగాలు పని చేస్తుండేవి. ఇవి డీఎంహెచ్‌వో, వైద్య విధాన పరిషత్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ. ఇందులో   ఏపీవీపీ కిందికి బనగానపల్లె, ఎమ్మిగనూరు, ఆదోని వంటి మూడు ఏరియా ఆస్పత్రులు, నంద్యాల జిల్లా ఆస్పత్రి,  18 సీహెచ్‌సీలు వస్తాయి. ఏపీవీపీ కింద అన్ని ఆస్పత్రుల్లో దాదాపు 50కి పైగా శాఖలకు చెందిన రెగ్యులర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తారు. వీరిలో రెగ్యులర్‌ ఉద్యోగులు 347 మంది, కాంట్రాక్టు ఉద్యోగులు 160 మంది, అవుట్‌ సోర్సింగ్‌ వారు 84 మంది ఉన్నారు. వీరందరికీ మార్చి నెల జీతం ఇంకా రాలేదు.  దాదాపు రూ.3.30 కోట్లు ఏప్రిల్‌ ఒకటో తారీకుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ రాలేదు.  ఇప్పటికైనా వారికి జీతాలకు సంబంధించిన వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఈ నెల 25 లోపు వచ్చే అవకాశం ఉంది. కానీ సీఎఫ్‌ఎంఎస్‌ లో దీనికి బడ్జెట్‌ లేనట్లు సమాచారం. అందువల్ల   ఈ నెల ఏపీవీపీ ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 


డీసీహెచ్‌ఎస్‌ నుంచి..


ఏపీవీపీలో డీసీహెచ్‌ఎస్‌ స్థాయి నుంచి నాల్గో తరగతి ఉద్యోగుల వరకు ఎవరికీ జీతాలు రాలేదు. నెల వచ్చిందంటే చాలు ఎవరి జీతానికి తగ్గట్టు వారికి ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకుంటూ జీతం రాక అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందనా బాధపడుతున్నారు.  జిల్లాకు సంబంధించి ఏపీవీపీలో దాదాపు కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 160 మంది ఉన్నారు. ఏపీవీపీకి సంబంధించి వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. వీరికి దాదాపు డిసెంబరు నుంచి జీతాలు రాకపోవడంతో గగ్గోలు పెడు తున్నారు. సంబంధిత శాఖకు చెందిన వారిని అడిగితే జీతాలు రాకపోవడంలో తమ పాత్ర ఏమీ లేదన్న సమాధానం వస్తోంది. 


జీతాలు నిల్‌.. ఇబ్బందుల్లో ఉద్యోగులు


బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని వైద్య విధాన పరిషత్‌ వైద్యశాల సిబ్బందికి, ఉద్యోగులకు నేటికీ జీతాలు అందలేదు. బనగానపల్లె వైద్యశాలలో డాక్టర్లతో కలిసి 90 మంది సిబ్బంది ఉన్నారు. 14 మంది డాక్టర్లు, ఐదుగురు హెడ్‌ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఫార్మాసిస్టులు, రక్త పరీక్ష, బ్లడ్‌ బ్యాంక్‌, ఆప్తాలమిస్ట్‌ తదితర సిబ్బంది 54 మంది అవుట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టు బేసిక్‌పై 12 మంది శానిటరీ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. అయితే రెగ్యులర్‌ ఉద్యోగులైన డాక్టర్లకు, ఇతర అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 16వ తేదీ నాటి వరకు జీతాలు ఇవ్వలేదు. ఇక శానిటరీ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు.


పై నుంచి రావాల్సి ఉంది


ఏపీవీపీ ఉద్యోగులకు ఎవరికీ జీతాలు పడలేదు. ఈ విషయం  అధికారులకు కూడా చెప్పాం. బిల్లులు పంపడం వరకే మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌లో వేసే బిల్లులు క్లియర్‌ అయితే వెంటనే వచ్చేస్తాయి. ఆర్థిక సంవత్సరం చివరి నెల కాబట్టి సీఎఫ్‌ఎంఎస్‌లో ఏమైనా సమస్య ఉండి ఉండవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇదే సమస్య. అది పరిష్కారమవగానే అందరికీ జీతాలు వస్తాయి.


 - రాంజీ నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌, కర్నూలు


ప్రొబేషన్‌ పీరియడ్‌ తగ్గించాలి


వైద్యుల ప్రొబేషన్‌ పీరియడ్‌ తగ్గించాలి. వైద్య విద్య పూర్తి చేసుకున్నవారి ప్రొబేషన్‌ పీరియడ్‌ మూడేళ్లకు పెంచింది. ఈ నెల జీతాలు ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచారే తప్ప మా వేతనాలు పెంచలేదు.


-డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, సీహెచ్‌సీ, పాణ్యం 


నాలుగు నెలలుగా జీతాలు అందలేదు


నాలుగు నెలలుగా వేతనాలు అందలేదు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. పెరిగిన నూనె, కూరగాయలు. తదితర నిత్యావసర ధరలకు తోడు జీతాలు అందకపోవడంతో అప్పు చేయాల్సి వస్తోంది.


 - లక్ష్మమ్మ, కాంట్రాక్టు సిబ్బంది, పాణ్యం 


కాంట్రాక్టు ఉద్యోగులు ఎలా బతకాలి?


వైద్యఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులు జీతాల మీదనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నాం. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగిపోయాయి. జీతాలు లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఎలా బతకాలో దిక్కు తోచడం లేదు.           


 - చెన్నయ్య గౌడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, డోన్‌ తాలుకా అధ్యక్షుడు

Updated Date - 2022-04-18T05:39:14+05:30 IST