నాగార్జున సాగర్‌.. నిండుకుండ

ABN , First Publish Date - 2022-08-11T05:17:46+05:30 IST

నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకు నీటి నిల్వలు పెరుగుతున్నాయి. సాగర్‌ నిండుకుండలా మారింది.

నాగార్జున సాగర్‌.. నిండుకుండ
నిండుకుండలా నాగార్జున సాగర్‌ జలాశయం

నేడు గేట్లు ఎత్తివేత

583 అడుగులకు చేరిన నీటిమట్టం   


నరసరావుపేట, విజయపురిసౌత్‌, ఆగస్టు10: నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకు నీటి నిల్వలు పెరుగుతున్నాయి. సాగర్‌ నిండుకుండలా మారింది. దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు డ్యాంకు వస్తోంది. నీటినిల్వలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. క్రస్ట్‌గేట్ల ద్వారా గురువారం ఉదయం 6.30 గంటలకు నీటి విడుదల చేయనున్నట్లు సూపరింటెండెంట్‌ ధర్మానాయక్‌ బుధవారం తెలిపారు. ఇందుకోసం జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని రెవెన్యూ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణమ్మ ఉప్పొంగుతుండుటంతో కుడికాలువ ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది.

సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం బుధవారం నాటికి 583.50 అడుగులు ఉంది. ఇది 293.39 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2,608, కుడికాలువ ద్వారా 2,799, వరద కాలువ ద్వారా 300, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,967 , మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 41,074 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,61,296 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగులుంది. ఇది 211.95 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 2,21,143 క్యూసెక్కులు, రోజా నుంచి 1,56,766 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 3,77,909 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌కు వరద నీటి ప్రవాహం ఇంకా పెరగనుంది. 

గత ఏడాది కంటే దాదాపు 20 రోజుల ముందే సాగర్‌ నిండుతుండటం విషేశం. గత నెల 31న కుడికాలువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో వరిసాగు పనులు ఊపందుకున్నాయి. నారుమళ్ళు పోసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాలలో పంటల సాగుకు 132 టీఎంసీల నీటి వినియోగం ఉంటుందని అంచనా వేశారు. నీటి ప్రణాళికను జలవనరుల శాఖ సిద్ధం చేసింది. సాగుకు నీరు ఇవ్వడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. 


 

Updated Date - 2022-08-11T05:17:46+05:30 IST