వడివడిగా.. కృష్ణమ్మ

ABN , First Publish Date - 2022-07-25T05:30:00+05:30 IST

భారీ వర్షాలు.. వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టులు దాటుకుని దిగువకు ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నది.

వడివడిగా.. కృష్ణమ్మ
నాగార్జున సాగర్‌ జలాశయం

ప్రాజెక్టులను దాటుకుని పరవళ్లు 

సాగర్‌లో 546 అడుగులకు చేరిన నిల్వ

శ్రీశైలంలో గరిష్ఠ స్థాయిలో నీటి మట్టం

నిండుకుండలా పులిచింతల జలాశయం 

నీటి విడుదలపై ఇంకా స్పష్టత రాని వైనం


కృష్ణమ్మ.. వడివడిగా పరుగులిడుతోంది. ప్రాజెక్టుల జలశయాల్లో బంధీగా ఉన్న కృష్ణమ్మ గేట్లు దాటుకుని దిగువకు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పైన శ్రీశైలం.. దిగువన నాగార్జున సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజిల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగరం దిశగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

 

నరసరావుపేట, జూలై 25: భారీ వర్షాలు.. వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టులు దాటుకుని దిగువకు ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నది. జలాశయంలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 215.81 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ కాగా ఇప్పటికి 196.51 టీఎంసీలకు చేరింది. సాగర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.05 టీఎంసీలు కాగా సోమవారం అది 199.55 టీఎంసీలకు చేరింది. జలాశయంలో 63.95 శాతం నీరు నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. శ్రీశైలానికి వచ్చే వరద నీటి స్థాయిలోనే సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పులిచింతల జలాశయం నిండు కుండలా మారింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతలకు భారీగా వరదనీరు వస్తున్నది. ఈ జలాశయానికి 10,400 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా దిగువనకు 10,400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 


కుడి కాల్వ రైతుల్లో అయోమయం

జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉండటంతో సాగర్‌ ఆయకట్టు రైతులు వరి సాగుకు సమాయత్తమవుతున్నారు.  సాగర్‌ జలాశయం వరుసగా నాలుగో ఏడాది కూడా నిండనున్నది. ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 15న కుడి కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేకపోయింది. ప్రస్తుతం సాగర్‌లో  పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. పై నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. అయినా ఇంకా నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయకట్టు అన్నదాతల్లో అయోమయం నెలకొంది.   


సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజి వద్ద పరిస్థితి 

విజయపురిసౌత్‌, అచ్చంపేట, తాడేపల్లి టౌన్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం సోమవారం నాటికి 545.50 అడుగులు ఉంది. ఇది 199.97 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1000, ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో 59,778 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 881.40 అడుగులుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 19,501, రోజా నుంచి 8,414 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  శ్రీశైలం జలాశయానికి 27,915 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  

- పులిచింతల ప్రాజెక్టులో సోమవారం 40.07 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్‌ తెలిపారు.  పవర్‌ జనరేషన్‌ ద్వారా 10,000, లీకుల ద్వారా 400 క్యూసెక్కుల నీరు దిగువ కృష్ణకు విడుదల అవుతుంది. ఎగువ నుంచి 10,400 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుందన్నారు. 

- ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి కొనసాగుతోంది. కీసర, మున్నేరు, పాలేరు, మధిర తదితర వాగుల నుంచి సోమవారం సాయంత్రానికి 42వేల 25 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు జలవనరుల శాఖ జేఈ మహ్మద్‌ అజిముద్దీన్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 5వేల 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 50 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 36వేల 750 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. 


 


==========================================================================

Updated Date - 2022-07-25T05:30:00+05:30 IST