సాగర్‌ లాంచీలు జాలీ ట్రిప్పులకే

ABN , First Publish Date - 2021-08-28T05:29:35+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల జగడం కొనసాగుతుండగా, నాగార్జునకొండకు లాంచీల అనుమతి నిరాకరణతో మరో వివాదం మొదలైంది.

సాగర్‌ లాంచీలు జాలీ ట్రిప్పులకే

 నాగార్జునకొండకు వెళ్లనీయకుండా ఏపీ మెలిక

 ఆదాయాన్ని కోల్పోతున్న పర్యాటకశాఖ

 రూ.5లక్షలు బకాయి చెల్లించనందుకే అనుమతి నిరాకరణ?

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల జగడం కొనసాగుతుండగా, నాగార్జునకొండకు లాంచీల అనుమతి నిరాకరణతో మరో వివాదం మొదలైంది. ఏపీ పర్యాటకశాఖ తీరుతో రాష్ట్ర పర్యాటకశాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. తెలంగాణ లాంచీలను నాగార్జునసాగర్‌ జలాశయం మధ్య లో ఉన్న నాగార్జునకొండకు వెళ్లనీయకుండా ఏపీ అడ్డుకుంటుండటంతో కేవలం జాలీ ట్రిప్పులకే పరిమితమయ్యాయి. జలాశ యం మధ్యలో ఉన్న నాగార్జున కొండకు ఏపీ పర్యాటకశాఖ, తెలంగా ణ పర్యాటకశాఖ లాంచీలు నడుపుతున్నాయి. సాగర్‌ హిల్‌కాలనీ నుంచి 18కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునకొండకు 45నిమిషాల లాంచీ ప్రయాణం సాగుతుంది. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్వంలో రోజుకు ఐదు లాంచీలు ఒక ట్రిప్పు, తెలంగా ణ నుంచి రెండు లాంచీలు నాలుగు ట్రిప్పులు నడిచేవి. తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు ఏపీ అటవీశాఖ అనుమతి ఇచ్చినా, ఏపీ పర్యాటకశాఖ మోకాలడ్డుతోంది.                

   - నాగార్జునసాగర్‌

ఏపీ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చలూరులో 2019 సెప్టెంబరులో గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పర్యాటకు లు మృతిచెందడంతో ఏపీలోని కృష్ణా, గోదావరి నదుల్లో లాంచీ ప్రయాణాలను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు అవతలి వైపున విజయపురిసౌత్‌ (రైట్‌ బ్యాంకు) వద్ద ఉన్న ఏపీ లాంచీస్టేషన్‌ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు ఏపీ పర్యాటకశాఖ లాంచీలు నిలిపివేసింది. నాగార్జునకొండ ఏపీ అటవీశాఖ పరిధిలో ఉండడంతో తెలంగాణ లాంచీలను కూడా వెళ్లనివ్వడం లేదు. దీంతో 22 నెలలు తెలంగాణ పర్యాటకశాఖ రూ.1.50కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.


ఏపీ అటవీశాఖ అనుమతి ఇచ్చినా..

తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏపీ అటవీశాఖ నుంచి రెం డు నెలల క్రితం అనుమతులు తీసుకున్నారు. అయినా ఏపీ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లకపోవడంతో తెలంగాణ లాంచీలను సైతం అనుమతించడంలేదు. తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లాలంటే నాగార్జునకొండకు పక్కనే టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉన్నందున అక్కడి అధికారుల అనుమతులు తీసుకోవాలని ఏపీ అధికారులు కొత్త మెలిక పెట్టారు. దీంతో తెలంగాణ లాంచీలు ఇప్పట్లో నాగార్జునకొండకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి తెలంగాణ లాంచీలు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్న ఏపీ అటవీశాఖ డివిజన్‌ కార్యాలయంలో తెలంగాణ పర్యాటకశాఖ అధికారులు దరఖాస్తు చేయగా, పరిశీలిస్తామని అక్కడి అధికారులు చెప్పినట్లు సమాచారం.


రూ.5లక్షలు బకాయిలు చెల్లించనందుకే..

నాగార్జునకొండ నిర్వహణకు ఏపీ అటవీశాఖకు రూ.5లక్షల బకాయి చెల్లించనందుకే తెలంగాణ లాంచీలకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ ఏపీ అటవీ ప్రాంతంలో ఉంది. దీంతో తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు ఏపీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ వైపు నుంచి నాగార్జునకొండకు వచ్చే లాంచీల్లో ప్రయాణానికి పెద్దలకు రూ.170, పిల్లలకు రూ.150 రుసుముగా వసూలు చేస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి నాగార్జునకొండకు వెళ్లే పర్యాటకులు చెల్లించే రుసుములో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.20 చొప్పున ఏపీ అటవీశాఖకు చెల్లించాలని అక్కడి అధికారులు పట్టుబడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఈ మేరకు అటవీశాఖకు టికెట్‌ రుసుములో కొంత భాగం చెల్లిస్తున్నారు. కచ్చలూరు బోటు ప్రమాదం అనంతరం లాంచీలను నడపకపోవడం, కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండేళ్లుగా రూ.5లక్షలు తెలంగాణ పర్యాటకశాఖ ఏపీ అటవీశాఖకు చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ లాంచీలకు అనుమతి ఇవ్వలేదని సమాచారం.


ఏపీ లాంచీలకు కాలం చెల్లడంతో..

సాగర్‌ ప్రాజెక్టుకు అవత లి వైపున ఉన్న విజయపురిసౌత్‌లో ఐదు లాంచీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కు రెండు లాంచీలు రావల్సి ఉన్నా, ఏపీ పర్యాటకశాఖ అధికారులు వాటిని ఇవ్వలేదు. ఏపీ పర్యాటకశాఖ ఆధీనంలో ఐదు లాంచీలను రూపొందించి మూడు దశాబ్దాలు అవుతుండటంతో వాటికి ఫిట్‌నెస్‌ లేదు. కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత ఆ లాంచీలకు జలాశయంలో ప్రయాణానికి, జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నడిపేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం రూ.3.50కోట్లతో రెండు కొత్త లాంచీలు, మూడు పాంటులను తయారు చేయించింది. తెలంగాణ లాంచీలకు ఫిట్‌నెస్‌ ఉన్నా వీటిని నాగార్జునకొండకు వెళ్లడానికి ఏపీ ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో ప్రస్తుతం జాలీ ట్రిప్పులే తిప్పతున్నారు. దీంతో 22నెలలుగా తెలంగాణ పర్యాటకశాఖ రూ.1.50కోట్ల ఆదాయం కోల్పోయిందని తెలంగాణ పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-08-28T05:29:35+05:30 IST