సాగర్ నుంచి శ్రీశైలం వెళ్తున్న లాంచీ
16 మంది పర్యాటకులతో ప్రయాణం
నాగార్జునసాగర్, నవంబరు 21: నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. 106కి.మీ మేర ఆహ్లాదకరంగా సాగే ఈ లాంచీ ప్రయాణాన్ని నందికొండ మునిసిపల్ చైర్‌పర్సన్ కర్ణ అనూషరెడ్డి, నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు, పెద్దవూర తహసీల్దార్ సైదులు శనివారం ఉదయం 9.30కు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రయాణానికి సాగర్ నుంచి ఒక వైపునకు 16మం ది పర్యాటకులు టికెట్లను బుక్ చేసుకోగా, హైదరాబాద్ నుంచి 13మంది పర్యాటకులు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ పర్యాటకులను పర్యాటకశాఖ బస్సులో సాగర్‌కు తీసుకు రాగా, లాంచిలో శ్రీశైలం చేరాక,శనివారం రాత్రి అక్కడ బస ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం స్వామి దర్శనం అనంతరం వారిని తిరిగి లాంచీలో సాగర్‌కు తీసుకొస్తారు. ఆదివారం సాయం త్రం సాగర్ నుంచి పర్యాటకులను పర్యాటకశాఖ బస్సులో హైదరాబాద్‌కు తీసుకెళ్తామని అఽధికారులు తెలిపారు. కార్యక్రమంలో లాంచీ యూనిట్ మేనేజర్ హరి, ఎఫ్‌డీవో సర్వేశ్వర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బ్రహ్మారెడ్డి, శరత్‌రెడ్డి పాల్గొన్నారు.