ఇళ్లలో ఉంటేనే సురక్షితం

ABN , First Publish Date - 2020-03-30T10:35:46+05:30 IST

కరోనా నేపథ్యంలో జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండటం సురక్షితమని కలెక్టర్‌ నివాస్‌

ఇళ్లలో ఉంటేనే సురక్షితం

లాక్‌డౌన్‌ శిక్షగా భావించొద్దు

 కలెక్టర్‌ నివాస్‌  


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 29 :  కరోనా నేపథ్యంలో జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండటం సురక్షితమని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆదివారం ఒక సందేశాన్ని విడుదల చేశారు. లాక్‌డౌన్‌ను శాపంగా, శిక్షగా భావించరాదని కోరారు. ఈ 21 రోజులపాటు కుటుంబ సభ్యులతో గడిపే ఒక గొప్ప అవకాశంగా గుర్తించాలన్నారు. ఈ సమయంలో బోర్‌గా భావించకుండా, మంచి విషయాలు నేర్చుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లో పలు కోర్సులు లభ్యమవుతున్నాయని, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి వాటిలో సభ్యులుగా చేరి వాటి సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. మంచి పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో పుస్తక పఠనం అలవాటు తక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనేనని అని వివరించారు.


  నెట్‌లో ఉచితంగా పుస్తకాలు డౌన్‌లోడ్‌ చేసే సౌకర్యం కూడా ఎన్‌బీటీ వంటి సంస్థలు కల్పించినట్లు ఆయన చెప్పారు. తాను సివిల్స్‌కు సిద్ధమయ్యే రోజుల్లో రాబిన్సన్‌ రచించిన పుస్తకం ‘హు విల్‌ క్రై- వెన్‌ యు డై’ అనే పుస్తకంతోపాటు మరిన్ని పుస్తకాలను చదివినట్లు చెప్పారు. మంచి పుస్తకాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. రోజూ యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని సాధన చేయాలని సూచించారు. 21 రోజులపాటు ఒక విషయాన్ని సాధన చేస్తే అది అలవాటుగా మారి భవిష్యత్తులో దాని ప్రతిఫలం ఉంటుందని పరిశోధనల ద్వారా వెల్లడైనట్లు వివరించారు. ఇండోర్‌ గేమ్స్‌ ఆడవచ్చని చెప్పారు.  తోటపని చేయవచ్చని.. దీనివల్ల మంచి అనుభూతి, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. స్నేహి తులు, బంధువులతో ఫోన్‌లో మాట్లాడటం వల్ల బంధాలు బలపడతాయని తెలిపారు. 

Updated Date - 2020-03-30T10:35:46+05:30 IST