ఇసుక.. దోపిడీ

ABN , First Publish Date - 2021-08-18T05:19:58+05:30 IST

సులభంగా.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇసుక పాలసీ అని ప్రభుత్వం ప్రవేశపెట్టినా.. ఎక్కడా ఇసుక దోపిడీ ఆగడంలేదు.

ఇసుక.. దోపిడీ
వేమూరు మార్కెట్‌ యార్డులో అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక

ఎక్కడికక్కడ యథేచ్ఛగా అక్రమాలు

నకిలీ బిల్లులతో అక్రమంగా తరలింపు

జేపీ సంస్థ పేరుతో అనధికార డంపింగ్‌

లారీకి రూ.2000 మామూళ్లు ఇస్తేనే ఇసుక

అక్రమంగా నిల్వలున్నా పట్టించుకోని అధికారులు 

ఏది సక్రమమో.. అక్రమమో తెలియక అధికారుల అయోమయం

 

ఇసుక.. నిర్మాణదారులను ఇసిగిస్తోంది. అక్రమార్కులకు కనక వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చినా అక్రమాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన రేటు కాకుండా మూడు రెట్లు అధికంగా దోచేస్తున్నారు. జేపీ సంస్థ ప్రతినిధులమంటూ రోజుకొకరు తెరపైకొచ్చి ఇష్టమొచ్చిన చోట భారీగా ఇసుకను డంప్‌చేసి అమ్మేసుకుంటున్నా అడిగే వారు లేరు.. ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నించినా సీఎం పేషీ నుంచి ఫోన్‌ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ హయాంలో రూ.4,500 నుంచి రూ.5 వేలకే లారీ ఇసుక దొరికితే ఇప్పుడు అదిరూ.25 వేలకు చేరింది. అదైనా సులభంగా వస్తుందా అంటే అందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. అక్రమాలను అడ్డుకోని అధికారులు సామాన్యులు తమకు అవసరమైన ఇసుకను తెచ్చుకుంటున్నా.. నిల్వ చేసుకున్నా.. కేసులు పేరుతో భయపెట్టి మామూళ్లు గుంజుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


తెనాలి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సులభంగా.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇసుక పాలసీ అని ప్రభుత్వం ప్రవేశపెట్టినా.. ఎక్కడా ఇసుక దోపిడీ ఆగడంలేదు. జేపీ సంస్థకు రీచ్‌లను అప్పగించినా ఎక్కడికక్కడ దొంగల దోపిడీకి తెరతీస్తున్నారు. జిల్లాలో ఇసుకకు ప్రకాశం బ్యారేజికి ఎగువున ఒక రేటు ఉంటే, దిగువున మరో రేటు ఉంది. రేటు ఎంతైనా తప్పేదేముందని లారీలు మాట్లాడుకుని నిర్మాణదారులు వెళితే ఇసుక పోసినందుకు లారీకి రూ.1500 నుంచి రూ.2000 మామూళ్లు ఇవ్వాలంటూ జేపీ సంస్థ సిబ్బంది పేరుతో తమిళనాడుకు చెందిన వారు రీచ్‌లలో వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక లారీ ఇసుకకు రూ.వేలు చెల్లించి బయటకు వస్తే 18 టన్నులకు మించి ఉందంటూ అర టన్ను నుంచి టన్నుకు కూడా ఎస్‌ఈబీ అధికారులు కేసులు రాస్తున్నారు. అదే హౌసింగ్‌ కాలనీలపేరుతో 35 నుంచి 45 టన్నుల ఓవర్‌ లోడుతో వెళుతున్న లారీలను వదిలేస్తున్నారని నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికార నిల్వలపై ఎస్‌ఈబీ అధికారులు తాజాగా దాడులను ముమ్మరం చేశారు. అయితే ఏ నిల్వలకు అనుమతి ఉందో.. దేనికిలేదో.. ఏ బిల్లులు  అక్రమమో.. ఏవి సక్రమమో అంతుపట్టని గందరగోళ పరిస్థితి అధికారులకు ఎదురవుతుంది. కొన్నిచోట్ల జేపీ సంస్థ చేసుకున్న నిల్వలని చెబుతున్నా, వాటికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధుల నుంచి అనుమతి పత్రాలు లేవు. ప్రకాశం బ్యారేజికి దిగువున కొల్లిపర మండలంలోని అత్తలూరివారిపాలెం, పిడపర్తిపాలెం,  వేమూరు మార్కెట్‌ యార్డులో ఒక్కోచోట లక్ష నుంచి రెండున్నర లక్షల టన్నుల ఇసుకను ముందస్తు మాన్‌సూన్‌ ప్రణాళిక పేరుతో నిల్వ ఉంచారు. వేమూరు యార్డులోని అమ్మకాలు నేటికీ మొదలుపెట్టలేదు. పిడపర్తిపాలెం దగ్గర నది ఒడ్డునే ఇసుకను భారీగా నిల్వ ఉంచారు. వారు నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లకు ఏ అనుమతులు, ఆ నిల్వలను తరలించే లారీలకు వే బిల్లులూ ఉండవు. ఒకవేళ ఉన్నా అవి కొన్నిచోట్ల చెల్లుబాటైతే, మరికొన్ని చోట్ల చెల్లడంలేదు. వీటిలో మళ్లీ నకిలీ బిల్లులూ వచ్చేశాయి. ఆ డంప్‌లలో వేటికీ అనుమతి పత్రాలు లేవని, అమ్మకాలు ఆపాలని స్వయంగా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినా బేఖాతరంటూ యథేచ్ఛగా అమ్మకాలకు తెగబడుతున్నారు. వేమూరు మార్కెట్‌ యార్డులో ఇసుక తోలి నెలలు గడిచి పోతున్నా, నేటికీ లీజు ఒప్పందం పూర్తే కాలేదు. నెలకు ఎంత మొత్తంలో అద్దె చెల్లించాలనేది మార్కెటింగ్‌ శాఖ సంస్థ ప్రతినిధులకు వివరించినా వారి నుంచి స్పందనే లేదు. ఇంతకాలం అనుమతులూ లేకుండా నిల్వ ఉంచనిస్తే తమ ఉద్యోగాలు పోతాయంటూ మార్కెటింగ్‌ శాఖ అధికారులు లబోదిబో మంటున్నారు.   


టన్ను ధర రూ.1000

రీచ్‌లలో ఇసుకను టన్నుకు రూ.475కే అమ్మాలని ప్రభుత్వం జేపీ సంస్థను ఆదేశించింది. రవాణా చార్జీలతో కలిపి ఎంతకు అమ్మాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ధరలు ఎక్కడా అమలు కావడంలేదు. జిల్లాలో కొన్నిచోట్ల టన్ను ఇసుకను రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు రేటు పెట్టారు.  పిడపర్తిపాలెంలో నది ఒడ్డునే నిల్వ చేసిన ఇసుకను కూడా టన్ను రూ.600 నుంచి రూ.800 వరకు, అవకాశం దొరికితే రూ.వెయ్యికి కూడా అమ్మేస్తున్నారు.  కొల్లిపరలో 18 టన్నుల ఇసుకకు రూ.18 వేలు చెల్లిస్తే, అది తెనాలి, మంగళగిరి వంటి పట్టణాలు చేరడానికి రవాణా చార్జీలు కలిపి రూ.25 వేలకుపైనే పలుకుతుంది. ఇదికూడా అన్ని వాతావరణ పరిస్థితులూ అనుకూలిస్తేనే. లేకుంటే మరో రూ.5 వేల వరకు అదనంగా చెల్లించాల్సిందే. జేపీ సంస్థ ప్రకాశం బ్యారేజికి ఎగువునున్న మల్లాదిలో ఐదు రోజుల క్రితం అమ్మకాలు మొదలుపెడితే టన్ను రూ.475 మాత్రమే. అదే బ్యారేజికి దిగువున జేపీ సంస్థ ప్రతినిధులమని చెప్పుకుంటున్న వ్యక్తులు, స్థానిక నేతలు నిర్ణయించిన రేట్లు మాత్రమే అమలవుతున్నాయి.  ప్రస్తుతం కృష్ణా నదిలో వరద నీరు తగ్గి ఇసుక బయటపడింది. పిడపర్తిపాలెం, అత్తలూరివారిపాలెం దగ్గర నది అంచునే పోసిన ఇసుకను వరదల సమయంలో అమ్మాల్సి ఉంటే, అప్పుడు అమ్మకుండా వరద తగ్గేవరకు ఆపేసి, ఇప్పుడు టన్ను రూ.600 నుంచి రూ.800 వరకు వారికిష్టమొచ్చిన ధరలు పెట్టి దోచేస్తున్నారు. పోనీ రవాణా ఖర్చులు అయ్యాయనుకుంటే నది నుంచి అర కిలోమీటరు దూరం కూడా లేదు. అక్కడ ఎత్తి, ఇక్కడ పోసినందుకే టన్నుకు రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అమ్మకాలపై దాడులు జరిపి, వాటిని అరికట్టాల్సిన మైనింగ్‌, ఎస్‌ఈబీ అధికారులు పూర్తిగా వదిలేశారు. ఇక జేపీ సంస్థకు సంబంధించిన దొంగ బిల్లుల వ్యవహారం కూడా ప్రస్తుతం హాట్‌హాట్‌గా మారింది. కొందరు వైసీపీ నాయకులే తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, మరికొన్నిచోట్ల దొంగ వే బిల్లులు ముద్రించి వాటితో అనఽధికార అమ్మకాలకు పాల్పడుతున్నారని సమాచారం. దీనిపై జేపీ సంస్థ సిబ్బంది దాడులు చేసి కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.





జేపీ సంస్థ ప్రతినిధి పేరుతో బెదిరింపులు

అనధికార డంపింగ్‌, విక్రయాలపై ప్రశ్నించే వారికి తాను జేపీ సంస్థ ప్రతినిధినని.. చెప్పినట్టు చేయకపోతే ఇబ్బందులు పడతారని.. అప్పటికీ మాట వినకుంటే సీఎం పేషీ నుంచి ఫోన్‌ వస్తుందంటూ ఓ వ్యక్తి బెదిరిస్తున్నట్లు సమాచా రం. ఈ పరిస్థితుల్లో తాము ఏమి చేయగలమని కొంతమంది అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎండీసీ ఇసుక అమ్మకాలు చేపట్టిన సమయంలో చౌడాయపాలెం డంపింగ్‌ కేంద్రం నుంచి భారీ మొత్తంలో ఇసుక మాయంపై ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఆ వ్యక్తే ఇప్పుడు జేపీ సంస్థ ప్రతినిధినంటూ తిరుగుతున్నాడని కొందరు చెప్తున్నారు.  గతంలో అధికారులతో ఉన్న సంబంధాలు, గత ఇసుక విధానంలో అక్రమదారులు తెలిసిన ఆ వ్యక్తి తెనాలిలో వలంటీరుగా కూడా పని చేసి, ప్రస్తుతం జేపీ సంస్థ ప్రతినిధినని చెప్పు కుంటున్నట్లు సమాచారం. తాజాగా అంగలకుదురు, కొలకలూరులలో ఇసుక నిల్వలను పట్టించడంతో కీలకంగా వ్యహరించాడని తెలిసింది. ప్రైవేటు పాలసీకి ముందు ఇసుక దొరుకుతుందో లేదో అన్న భయంతో కొందరు నిల్వ ఉంచుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులపై ఆ వ్యక్తి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తనకు ఇసుక అమ్మని వారిని, అధిక రేటు చెప్పినా అటువంటివారిని ఎస్‌ ఈబీ అధికారులకు పట్టించినట్టు తెలిసింది. కొలకలూరులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇల్లు కట్టుకునేందుకే మూడు లారీల ఇసుక పోయించుకుంటే, బిల్లులు లేవనే సాకుతో అత డ్ని పట్టించినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆ పార్టీనేతల్లోనే విభేదాలను రాజేసింది. అది చిలికిచిలికి పెద్దదై చివరకు ఆ వ్యక్తిపై గత అక్రమాలను వివరిస్తూ ఉన్నతాధికారులకు, సంస్థకు ఫిర్యాదు చేసే స్థితికి చేరిందని సమాచారం. ఇసుక డంప్‌లు పట్టించేవారూ, నిల్వ ఉంచుకున్న వారూ అధికార పార్టీవారే కావటంతో అధికారుల పరి స్థితి ఆడకత్తెరలో పోకచెక్క చందంగా మారింది.


అధికార పార్టీ నేతల హవా

ఇసుక వ్యవహారంలో అధికార పార్టీ నేతల హవా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా ఉండే ఒక నేత చెప్పిన నంబర్లు ఉన్న ఇసుక లారీలకు మాత్రమే అ నుమతి ఉంటుందని పోలీసు అధికారులే చెప్తున్నారంటే ఆశ్చర్యం కా దు. జేపీ సంస్థకు చెందిన బిల్లు ఉన్నా ఆ నేత చెప్పిన లారీ కాకపోతే పో లీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. సరేనని స్థానిక నేతల దగ్గర నుంచే ఇసుక కొనుగోలు చేస్తే, బిల్లులు లేవని ఎస్‌ఈబీ అధికారులు పట్టు కుంటుండటంతో నిర్మాణదారులు ఘొల్లుమంటున్నారు. పెదకొండూరు, వీర్లపా లెం, ప్రాతూరు, చిర్రావూరు ప్రాంతాల్లో కూడా స్థానిక నేతల హవానే నడుస్తున్న ట్లు సమాచారం. వారికి సంబంధించిన లారీలకు వెంటనే లోడ్‌ చేయటంతో పాటు ధర కూడా వారికిష్టమొచ్చినంత నిర్ణయిస్తారు. అయినా పట్టించుకునేవారు లేరు. ఒక రిద్దరు నాయకులైతే ఏకంగా సొంత లారీలు పెట్టుకుని జేపీ సంస్థ సిబ్బందితో లాలూచిపడి ఇసుకను బిల్లులు లేకుండానే తరలిస్తున్నారు. జేపీ సంస్థ తరపు న అన్ని వ్యవహారాలు చూస్తామంటూ మరో ఇద్దరు నాయకులు 12 చక్రా ల లారీలు తాజాగా 9 తీసుకొచ్చి ఇసుక అక్రమ తరలింపులకు విని యోగిస్తున్నారని తెలిసింది. జేపీ సంస్థ నుంచి ఇసుక కొనుగోలు చేసి, తీసుకువెళుతున్న లారీలను ఇటీవల నిజాంపట్నం లో పోలీసులు పట్టుకున్నారనే దానిపైనా ఆ సం స్థ సిబ్బంది గరంగరంగా ఉన్నారు.  


పరిమాణం మాత్రమే చూస్తాం 

జేపీ సంస్థకు ఒప్పందం ప్రకారం అప్పగించాం. వారికి కేటాయించిన క్యూబిక్‌ మీటర్ల ఇసుక పరిమాణం ప్రకారం తవ్వారా! లేదా అనేది మాత్రమే చూస్తాం. ప్రైవేటు సంస్థకు అప్పగించాక వే బిల్లులు కానీ, ఇతర వ్యవహారాలన్నీ ఆ సంస్థే చూసుకుంటుంది. అవేమీ మా పనులు కాదు. ఇచ్చిన క్వాంటిటీ అయిపోతే తిరిగి అదనపు కాంటిటీ కేటాయిస్తాం. 

-  సత్యనారాయణ, డీడీ మైనింగ్‌ శాఖ, గుంటూరు


Updated Date - 2021-08-18T05:19:58+05:30 IST