నేటి నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-14T05:29:08+05:30 IST

ఉమ్మడి జిల్లాలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 (ఎస్‌ఏ-1) పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు
పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు

భువనగిరిటౌన్‌: ఉమ్మడి జిల్లాలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 (ఎస్‌ఏ-1) పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 3,637 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించనుండగా, మిగతా తరగతుల విద్యార్థులకు ఒకే పేపర్‌ ఉండనుంది. దీం తో ఉన్నతపాఠశాలల్లో రెండు పూటల పరీక్షలు కొనసాగనున్నాయి.                             


ఉమ్మడి జిల్లాలో 3,637 పాఠశాలలు

ఉమ్మడి జిల్లాలో 3,637 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. యాదాద్రి జిల్లాలో 876 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉం డగా, 1,04,244 మంది విద్యార్థులు ఉన్నారు. 720 ప్రభుత్వ, ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల్లో 66,916 మంది విద్యార్థులకు జిల్లా పరీక్షల విభాగం తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దు మీడియంలో రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 156ప్రైవేటు పాఠశాలలు ఉండగా, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు 16,034 మందికి ప్రభుత్వ ప్రశ్నాపత్రాలతో పరీక్ష నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 21,294 పాఠశాలల యాజమాన్యాలు రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 2046 పాఠశాలలు ఉన్నాయి. అందులో 1483 ప్రభుత్వ పాఠశాలలు, 563 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 2,50,995 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 1278 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో 979 ప్రభుత్వ పాఠశాలలు, 253 ప్రైవేటు పాఠశాలలు, 19 ఎయిడెడ్‌ పాఠశాలలు, 27 సోషల్‌ వెల్పేర్‌ పాఠశాలలు ఉన్నాయి.


పరీక్షల పేరుతో ఫీజుల వసూళ్లు

ఎస్‌ఏ-1 పరీక్ష పేరుతో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల కోసం ఇబ్బందులు పెడుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌ టికెట్‌ ఇస్తామని, పరీక్షకు హాజ రు కానిచ్చేది లేదని యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. ఈ పరీక్షలకు హాల్‌ టికెట్‌ అవసరం లేకున్నా సొంతంగా తయారుచేసిన హాల్‌టికెట్‌ను ఫీజు చెల్లించిన వారికే జారీ చేస్తూ, చెల్లించని వారి కి నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఫీజులు వసూలు కాకుంటే పాఠశాలను ఎలా నిర్వహించగలమని, విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఫీజు చెల్లించని తల్లిదండ్రులు కూడా ఉన్నార ని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే ఫీజుల పేరుతో పరీక్ష రాయకుండా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి కె.నర్సయ్య హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేయడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించలేమని, విడతలవారీగా చెల్లిస్తామని చెప్పినా యాజమాన్యం కనికరించడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈవిషయమై ఎంఈవో శాంతయ్యను వివరణ కోరగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-12-14T05:29:08+05:30 IST