Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

చిక్కితే తుక్కే

twitter-iconwatsapp-iconfb-icon

పోలీస్‌ స్టేషన్లలో తుప్పుపడుతున్న వాహనాలు

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పాడవుతున్న వైనం

 జిల్లా అంతటా ఇదే తీరు

- పోలీసులకు దొరక్కూడదు. రోడ్డు ఎలా ఉన్నా.. వేగంగా వెళ్లాలి. అందుకనే అక్రమ రవాణాకు మంచి కండిషన్‌ ఉన్న వాహనాలు ఉపయోగిస్తారు. ఇవి పోలీసులకు పట్టుబడే సమయంలోనూ కండిషన్‌లో ఉంటాయి. 

- ప్రమాదాలు కావచ్చు.. లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపటం కావచ్చు. కారణం ఏదైనా స్టేషన్లకు వచ్చిన వాహనాల కండిషనూ బాగానే ఉంటుంది. 


ఇలాంటి వాహనాలు ఏ కారణంతోనైనా ఒకసారి పోలీసు స్టేషన్‌కు వస్తే చాలు. అనుమతుల్లేక, కేసులు తెమలక ఏళ్లతరబడి ఉండటంతో తుప్పుపట్టి.. శిథిలమవుతున్నాయి. వీటన్నింటినీ సకాలంలో వేలం వేయగలిగేలా చర్యలు చేపడితే మంచి ధర పలికి, ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. లేదంటే తుప్పు పట్టిన వాహనాలను పాత ఇనుము సామాన్ల వ్యాపారులకు తూకానికి వేయాల్సిందే. రోడ్డు ప్రమాదాలు ఒకవైపు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ మద్యం, ఇసుక, గ్రానైట్‌, ఎర్రచందనం, గంజాయి తదితర అక్రమ రవాణా మరోవైపు. ఇలాంటి ఘటనల్లో పట్టుబడిన.. పోలీసులను చూసి నిందితులు వదిలేసి పారిపోయిన.. దొంగతనాల్లో దొరికిన ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, లారీలు పోలీస్‌ స్టేషన్లకు తీసుకొస్తారు. చిన్న చిన్న ప్రమాదాలకు సంబంధించి రాజీ మార్గాల ద్వారా వాహనాలను యజమానులు తీసుకెళ్లిపోతుంటారు. మిగిలిన కేసుల్లో వాహనాలు స్టేషన్లకు చేరుతున్నాయి. ఆ తర్వాత ఏళ్ల తరబడి కేసులు నడుస్తుండటంతో ఇవన్నీ స్టేషన్ల ఆవరణల్లోనే తుప్పు పట్టి పోతున్నాయి. మరి కొన్ని కేసులకు సంబంధించి ఆయా వాహనాల యజమానులకు కోర్టులు జరిమానా విధిస్తుంటాయి. జరిమానా కట్టేంత కూడా ఈ వాహనాలు ధరలు పలకవన్న కారణంగా యజమానులు వదిలేస్తున్నారు. కేసులు పరిష్కారం కానందున వాహనాలు అలా ఉండిపోతున్నాయన్నది పోలీసుల మాట. కేసులు పరిష్కారమయ్యే వరకు మద్యం కేసుల్లో వాహనాలను వేలం వేసే అవకాశం లేదని అంటున్నారు. పట్టుబడిన వాహనాలను సకాలంలో వేలం వేసేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టసవరణ చేయాల్సిన అవసరముంది. అప్పుడైతే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం లభిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏళ్ల తరబడి తుక్కు పట్టిన తరువాత వేలం వేస్తే తుప్పు పట్టిన వాహనాలను కేవలం పాత ఇనుము కొనే వ్యాపారులే కొంటారు. వాళ్లూ నామమాత్రపు ధరకే వేలంలో పాడుకుంటారు. చిత్తూరులోని వన్‌ టౌన్‌, టూ టౌన్‌, ట్రాఫిక్‌, ఎక్సైజ్‌, క్రైమ్‌ పోలీసు స్టేషన్లలో వందల సంఖ్యలో వాహనాలు స్టేషన్ల ఆవరణాల్లో దర్శనమిస్తున్నాయి. 


మాయమవుతున్న విడిభాగాలు

పోలీస్‌ స్టేషన్లకు వచ్చిన వాహనాల్లోని విడిభాగాలు చాలా వరకు మాయమవుతున్నాయి. స్టేషన్ల ఆవరణలోని దూరంగా ఇలాంటి వాహనాలను ఉంచుతున్నారు. స్టేషన్లకు నిత్యం ఎంతో మంది కేసులు, ఇతర పనులపై వచ్చి వెళుతుంటారు. పగటి పూట వాహనాలను చూసిన వారు రాత్రపూట విడి భాగాలను తీసుకెళ్లిపోగా మిగిలిన భాగం మట్టిలో కలిసిపోతున్నాయి. 


పోలీసులు ఏం చేయాలంటే...

ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తీసుకొచ్చిన వాహనాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేయాలి. అలా చేసిన వాహనాలను ఆరు నెలలకు ఒకసారి బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలి. ఇలా ఎక్కడా జరగడం లేదని తెలుస్తోంది. వాహనాలకు వేసిన జరిమానాలను కట్టి తీసుకెళ్లని వాహనాలనైనా గుర్తించి వేలం ద్వారా విక్రయిస్తే ప్రభుత్వానికైనా కొంత ఆదాయం వచ్చేది. పోలీస్‌ శాఖ ఆ చర్యలు చేపట్టకపోవడంతో వందలాది వాహనాలు స్టేషన్ల ఆవరణలో మగ్గుతున్నాయి. పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు ఇలాంటి వాహనాలను వేలం వేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- చిత్తూరు


ఒకచోటే వేలం 

కార్వేటినగరం పోలీసు స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన వాహనాలను ఇటీవల వేలం వేశారు. అక్కడ తుప్పుపట్టే దశలో వాహనాలేవీ లేవు. పాలసముద్రంలో 32 బైక్‌లు, ఓ కారు, మూడు ఆటోలు, ఒక ట్రాక్టర్‌ ఉన్నాయి. ఎస్‌ఆర్‌పురంలో నాటుసారా రవాణా, రోడ్డు ప్రమాదాల్లో 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వెదురుకుప్పంలో 36 బైక్‌లు, 4 ఆటోలను సారా కేసుల్లోను.. గంగాధరనెల్లూరులో సారా.. రోడ్డు ప్రమాద కేసుల్లో 37 ద్విచక్ర వాహనాలు.. సారా కేసుల్లో పది బైక్‌లను పెనుమూరు పోలీసులు పట్టుకున్నారు. కోర్టు.. ఆర్టీఏ అనుమతులు, రికార్డులు సరిగా లేకపోవడం వంటి కారణాలతో వీటిని వేలం వేయడానికి వీల్లేకుండా ఉందని పోలీసులు చెబుతున్నారు. రికార్డులు లేని వాహనాలను ఛేదించడం కూడా కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బైక్‌ నెంబరుకు.. ఆ బైక్‌ చేస్‌, ఇంజన్‌ నెంబర్లకు సంబంధం ఉండటంలేదంటే ఇవి దొంగ వాహనాలని అర్థం. దీంతో వీటి యజమానుల పేర్లు గుర్తించలేని పరిస్థితి. కోర్టు అనుమతిచ్చినా వాహనాలను తూకం వేయాల్సిందే. 

- వెదురుకుప్పం


తుప్పు పడుతున్నాయ్‌ 

అక్రమ మద్యం, ఎర్రచందనం, చౌక బియ్యం, నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను కొన్నేళ్లుగా పోలీసులు పట్టుకున్నారు. కేసులుపెట్టి నిందితులను అరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచి.. వాహనాలను సీజ్‌ చేశారు. ఇలా పలమనేరు నియోజకవర్గంలో సుమారు 500కు పైగా ద్విచక్రవాహనాలు, పదుల సంఖ్యలో ఆటోలు, కార్లు, మినీలారీలు, లారీలున్నాయి. పలమనేరు పోలీసు స్టేషన్‌ వద్ద వీటిని నిలిపే వీల్లేకపోవడంతో ఆర్టీసీ డిపో ఆవరణలో ఓ మూలన పడేశారు. గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె, వి.కోట పోలీసు స్టేషన్ల చుట్టూ పట్టుబడిన వాహనాలే ఉన్నాయి. కేసులు పరిష్కారం కానందున అలా ఉండిపోతున్నాయని పోలీసులు తెలిపారు. కేసులు పరిష్కారమయ్యే వరకు మద్యం కేసుల్లో వాహనాలను వేలం వేసే అవకాశం లేదని తెలిసింది. వాహనాలు కండిషన్‌లో ఉన్నప్పుడే వేలం వేయగలిగితే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. లేదంటే నామమాత్రపు ధరలకు పాత ఇనుప సామాన్ల వాళ్లకు వేయాల్సిందే. ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

- పలమనేరు


వేలం అనుమతికోసం నిరీక్షణ 

పుంగనూరు పోలీసు స్టేషన్‌లో 300 ద్విచక్ర వాహనాలు, ఎస్‌ఈబీ సర్కిల్‌ ఆఫీసు వద్ద 400 వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటో ఉన్నాయి. చౌడేపల్లెలో 23 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, ఒక ట్రాక్టర్‌, మూడు ఆటోలు.. సోమలలో 32 ద్విచక్ర వాహనాలు, ఒక కారు.. రొంపిచెర్లలో 8 ద్విచక్ర వాహనాలు వేలం అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిని సకాలంలో వేలం వేస్తే.. ద్విచక్ర వాహనాలు ఒక్కొక్కటి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతుందని అంచనా. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఇంకా ఆలస్యమైతే ఇవన్నీ తుప్పు పట్టి నామమాత్రపు ధరతో పాత సామాన్లకు తూకానికి వేయాల్సిందే. 

- పుంగనూరు


విడిభాగాలు రాలిపోతున్నాయ్‌ 

కుప్పం సర్కిల్‌ పరిధిలోని నాలుగు పోలీసు స్టేషన్లలో వందలకొద్దీ వాహనాలు తుప్పు పడుతున్నాయి. పట్టుకుంటే వీటి భాగాలు రాలుతున్నాయి. వివిధ కేసులలో సీజ్‌ చేసిన ఈ వాహనాలు ఉన్నతాధికారుల ఆదేశాలు రాకపోవడంవల్లే వేలం వేయకుండా ఉంచేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. కుప్పం పోలీసు స్టేషన్‌ పరిధిలో 200కు పైగా వాహనాలు శిథిల స్థితికి చేరుకున్నాయి. గుడుపల్లెలో 100, శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు పోలీసు స్టేషన్లో 150, రామకుప్పంలో 150కి పైగా వాహనాలు తుప్పు పట్టాయి. ఏళ్లతరబడి ఉన్న వీటిని ఇప్పుడు వేలం వేసినా ఎందుకూ పనికిరాని స్థితిలోకి వచ్చేశాయి. 

- కుప్పం


నాలుగేళ్లుగా ఇలా.. 

నగరి పోలీసు స్టేషన్‌ పరిధిలో సారాయి తరలిస్తున్న 84 వాహనాలను 2018లో సీజ్‌ చేశారు. క్రైమ్‌, గంజాయి డ్రగ్స్‌ కేసులకు సంబంధించి 46, ఇసుక కేసులకు సంబంధించి 21 వాహనాలను పట్టుకున్నారు. ఆ వాహనాల యజమానులకు షోకాజ్‌లు జారీ చేయగా ఎలాంటి సమాధానం రాలేదని సీఐ శ్రీనివాసంతి పేర్కొన్నారు. వీలైనంత త్వరలో వేలం వేయడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. కొన్ని వాహనాలకు కోర్టు నుంచి, మరికొన్నింటికి ఎస్పీ నుంచి అనుమతి రావల్సి ఉంది. ఈ వాహనాల విలువ రూ.20 లక్షలకుపైగా ఉండే అవకాశముంది. ఇక, విజయపురంలో ఎక్సైజ్‌కు సంబంధించి 29, కరోనా సమయంలో లిక్కర్‌ తరలిస్తున్న నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ భారతి తెలిపారు. ఆ యజమానుల నుంచి షోకాజ్‌ నోటీసులకు సమాధానం రాకపోవడంతో వాహనాలు అలాగే ఉన్నాయి. వీటి విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిండ్ర మండలంలో నాలుగు వాహనాలను 2018లో చేసి.. సంబంధిత యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎస్‌ఐ వెంకటసుబ్బమ్మ తెలిపారు. 

- నగరి


శిథిలావస్థకు చేరాయ్‌

పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 353 వాహనాలు ఆయా పోలీస్‌ స్టేషన్లలో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాలుగేళ్లుగా ఈ వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. బంగారుపాళ్యంలో 200 ద్విచక్ర వాహనాలు, 34 కార్లు ఉన్నాయి. యాదమరిలో 14 ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు.. తవణంపల్లెలో 18, పూతలపట్టు పరిధిలో 70 వాహనాలు ఉన్నాయి. కోర్టు అనుమతులు వచ్చాక వాహనాలను వేలం వేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- ఐరాల

చిక్కితే తుక్కేవిజయపురం పోలీ్‌సస్టేషన్‌లో తుప్పు పట్టిన వాహనాలు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.