మా షరతులకు ఓకే అంటే సైనిక చర్య తక్షణం నిలిచిపోతుంది: రష్యా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-03-08T01:31:42+05:30 IST

ఉక్రెయిన్‌పై గత 12 రోజులుగా విరుచుకుపడుతున్న రష్యా నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా తన..

మా షరతులకు ఓకే అంటే సైనిక చర్య తక్షణం నిలిచిపోతుంది: రష్యా కీలక ప్రకటన

మాస్కో: ఉక్రెయిన్‌పై గత 12 రోజులుగా విరుచుకుపడుతున్న రష్యా నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను నిలిపివేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, అందుకు కొన్ని షరతులు కూడా విధించింది. యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రపంచదేశాలన్నీ ఏకమై మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టిన రష్యా తన దాడిని కొనసాగిస్తూ ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆర్థిక ఆంక్షలకు సైతం లెక్క చేయకుండా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి నేడు ఈ కీలక ప్రకటన వెలువడింది. 


తమ షరతులకు కనుక అంగీకరిస్తే తక్షణం సైనిక చర్య ఆపేస్తామన్నదే ఆ ప్రకటన. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరికాసేపట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడతల చర్చలు జరగనున్న వేళ రష్యా నుంచి ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


‘‘ఉక్రెయిన్‌పై తక్షణం సైనిక చర్యను ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే, అందుకు ఉక్రెయిన్ మా షరతులను అంగీకరించాల్సి ఉంటుంది’’ అని పెస్కోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని, ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరకుండా అది అడ్డుకునేలా ఉండాలని పెస్కోవ్ స్పష్టం చేశారు. ఈ షరతులకు కనుక ఉక్రెయిన్ అంగీకరిస్తే తక్షణం సైనిక చర్యను నిలిపేస్తామన్నారు.

Updated Date - 2022-03-08T01:31:42+05:30 IST