రష్యాలో ఒక్క రోజే 38 వేల కేసులు!

ABN , First Publish Date - 2021-10-26T07:58:02+05:30 IST

రష్యాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 37,930 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

రష్యాలో ఒక్క రోజే 38 వేల కేసులు!

ఇప్పటివరకు ఇవే రికార్డు.. మరో 1,064 మంది మృతి

చైనాలో డెల్టా దడ.. 11 ప్రావిన్సులకు వ్యాప్తి


బీజింగ్‌, అక్టోబరు 25: రష్యాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 37,930 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. మరో 1,064 మంది చనిపోయారు. మొత్తం 85 ప్రాంతాలకు గాను కొన్నింట్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. గురువారం నుంచి నవంబరు 7 వరకు మొత్తం 11 రోజుల పాటు ఆంక్షలు కొనసాగించాలని  ముందుగా భావించినా.. కొవిడ్‌ తీవ్రతతో ప్రారంభ తేదీని ముందుకు జరిపే వీలుందని, నవంబరు 7 తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉందని అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ఇక, డెల్టా వేరియంట్‌ ప్రభావంతో చైనాలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఒకసారి, జూలై, ఆగస్టుల్లో ఓసారి డెల్టాతో కలవరపడిన చైనాలో.. మళ్లీ  అదే పరిస్థితి తలెత్తింది.


వారం రోజుల్లోనే 11 ప్రావిన్సులకు వైరస్‌ వ్యాపించింది. దీంతో పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించాలని చైనా నిర్ణయించింది. మూడేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దేశంలో స్థానిక వ్యాప్తి ద్వారా సోమవారం 38 కేసులు నమోదైనట్లు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పేర్కొంది. ఇన్నర్‌ మంగోలియాలోనే 19 నమోదయ్యాయి. ఇక ఘాన్సులో నాలుగు కేసులు రికార్డయ్యాయి. పర్యాటకానికి పేరుగాంచిన ఈ ప్రావిన్సులో మొత్తం విహార కేంద్రాలను మూసివేశారు. కాగా, ఈ ప్రాంతం నుంచి వచ్చినవారితో కొద్ది రోజుల్లోనే 12 పైగా కేసులు రికార్డవడంతో బీజింగ్‌ అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి విస్తృతం అవుతుండడంతో చైనావ్యాప్తంగా పర్యాటక రైళ్లను నిలిపివేశారు.


17ఏళ్ల వారికి టీకా.. కేంద్రం చెప్పింది: అసోం సీఎం

రాష్ట్రంలో 17 ఏళ్ల వయసు పిల్లలకు కొవిడ్‌ టీకా పంపిణీ చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించిందని.. దీనికి ప్రజలు సహకరించాలని అసోం సీఎం హిమంత విశ్వశర్మ వ్యాఖ్యానించారు. సోమవారం ఉప ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ‘‘కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. 17 ఏళ్లు దాటినవారు ఇకనుంచి కరోనా టీకా తీసుకోవచ్చని వాటిలో ఉంది. 17-18 ఏళ్ల వయసున్న మీ పిల్లలను తప్పక టీకా ఇప్పించండి’’ అని ప్రజలను కోరారు. దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు దాటినవారికే కొవిడ్‌ టీకా ఇస్తున్న నేపథ్యంలో అసోం సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


రెగ్యులర్‌ మార్కెటింగ్‌కు అనుమతివ్వండి: సీరం 

కొవిషీల్డ్‌ ఉత్పత్తిదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. తమ టీకా రెగ్యులర్‌ మార్కెటింగ్‌కు అనుమతులు ఇవ్వాలని డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సోమవారం లేఖ రాసింది. ఇందుకు సంబంధించి తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను ఇదివరకే సమర్పించినట్లు పేర్కొంది. కాగా, కొవిడ్‌ టీకా ఉత్పత్తి సంస్థలతో ప్రధాని మోదీ సమావేశమైన రెండు రోజుల వ్యవధిలో సీరం లేఖ రాయడం గమనార్హం. ప్రస్తుతం కొవిషీల్డ్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్నాయి. డీసీజీఐ నుంచి రెగ్యులర్‌ మార్కెటింగ్‌ అనుమతులూ లభిస్తే.. ఫైజర్‌ తర్వాత ప్రపంచంలో ఈ అనుమతులు పొందిన రెండో టీకా కానుంది.

Updated Date - 2021-10-26T07:58:02+05:30 IST