Advertisement
Advertisement
Abn logo
Advertisement

రుద్రవరానికి ఎంఈవో లేరు

అవును.. ఆ మండలానికి ఎంఈవో లేరు. రెగ్యులర్‌ ఎంఈవో పోస్టు మూడేళ్లుగా ఖాళీగా ఉంది. ఇన్‌చార్జి ఎంఈవో మెడికల్‌ లీవ్‌పై వెళ్లారు. అదనపు బాధ్యతలు అప్పగించిన మరో ఎంఈవో ఇంకా విధుల్లో చేరలేదు. ఇంతకూ రుద్రవరం మండలానికి ఎంఈవో ఉన్నట్లా? లేనట్లా? అధికారులే తేల్చాలి.


రుద్రవరం మండలంలో 58 పాఠశాలలు ఉన్నాయి. 138 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 5,716 మంది విద్యార్థులు ఉన్నారు. 2018 ఆగస్టులో అప్పటి విద్యాశాఖ అధికారి సాహెబ్‌హుసేన్‌ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి పాలనే కొనసాగుతోంది. దీంతో అధికారుల పర్యవేక్షణ కొరవడి విద్యావ్యవస్థ గాడి తప్పిందన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల భవిషత్తు అగమ్యగోచరంగా మారింది. 2018లో రెగ్యులర్‌ ఎంఈవో రిటైర్‌ అయిన తర్వాత శిరివెళ్ల ఎంఈవో మహబూబ్‌బాషాకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈయన కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత చాగలమర్రి ఎంఈవో అనూరాధకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఈమె నవంబరు 8 నుంచి మెడికల్‌ లీవ్‌పై వెళ్లారు. అనంతరం ఆళ్లగడ్డ ఎంఈవో శోభావివేకవర్ధినిని ఇన్‌చార్జిగా నియమిస్తూ కడప ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి నవంబరు 10న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు ఆమె బాధ్యతలు తీసుకోలేదు. గత 26 రోజులుగా రుద్రవరం మండలానికి ఎంఈవో లేరు. తాను రుద్రవరం మండల విద్యాశాఖ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోలేదని ఆళ్లగడ్డ ఎంఈవో శోభావివేకవర్ధిని తెలిపారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలోనే పని చేస్తున్నానన్నారు.                                                                                                                                                  - రుద్రవరం

Advertisement
Advertisement