గ్రేటర్‌ RTCపై డీజిల్‌ పిడుగు.. నెలకు రూ. 2.5 కోట్లు అదనపు భారం!

ABN , First Publish Date - 2022-03-01T14:28:35+05:30 IST

గ్రేటర్‌ ఆర్టీసీపై డీజిల్‌ పిడుగు పడింది. బల్క్‌ బయ్యర్స్‌కు ధరలు పెంచడంలో రోజుకు సుమారు...

గ్రేటర్‌ RTCపై డీజిల్‌ పిడుగు.. నెలకు రూ. 2.5 కోట్లు అదనపు భారం!

  • బల్క్‌ బయర్స్‌కు ధర పెంపుతో బెంబేలు
  • రోజుకు 1.40 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం
  • లీటర్‌పై రూ.6 పెరుగుదల  
  • రిటైల్‌ పెట్రోల్‌ బంకులకు పరుగులు
  • నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసనలు

గ్రేటర్‌ ఆర్టీసీపై డీజిల్‌ పిడుగు పడింది. బల్క్‌ బయ్యర్స్‌కు  ధరలు పెంచడంలో రోజుకు సుమారు రూ. 8.40లక్షలు, నెలకు రూ.2.5 కోట్ల అదనపు భారం పడనుంది. ధరలు పెరగకముందు ఆర్టీసీకి లీటర్‌ డీజిల్‌కు రూ. 88 నుంచి రూ.89 ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. 94నుంచి రూ.95 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆర్టీసీ రోజువారి ఆదాయంలో సగం డీజిల్‌కే వెచ్చించాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్‌సిటీ : పెరుగుతున్న డీజిల్‌ ధరలు గ్రేటర్‌ ఆర్టీసీపై పెనుభారాన్ని మోపుతున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నష్టాలు రావడంతోపాటు డీజిల్‌ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. బల్క్‌ బయ్యర్స్‌కు గతంలో సాధారణం కంటే తక్కువ ధరకే డీజిల్‌ లభించేది. కానీ, ధరలు పెంచడంతో నేడు అధికారులు రిటైల్‌ పెట్రోల్‌ బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 


రిటైల్‌లోనే తక్కువ.. 

బీహెచ్‌ఈఎల్‌ డిపోకు నాలుగు రోజుల క్రితం వరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి నేరుగా డీజిల్‌ కొనుగోలు చేసేవారు. బల్క్‌ బయ్యర్స్‌కు ధరలు పెంచడంతో అధికభారం పడుతుందని డిపో అధికారులు రూటు మార్చారు. బల్క్‌లో కంటే రిటైల్‌లోనే రూ.2ల తగ్గుదలతో డీజిల్‌ లభిస్తుండడంతో పెట్రోల్‌ బంకులను ఆశ్రయిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌ డిపోకు సమీపంలో రామచంద్రాపురం పెట్రోల్‌ బంకు ఉండటంతో మూడురోజులపాటు డీజిల్‌ ట్యాంకర్‌ను అక్కడనుంచి తెప్పించారు. అయితే, డీజిల్‌ బిల్లులను మూడురోజులకోసారి చెల్లిస్తామనడంతో పెట్రోల్‌బంక్‌ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. దీంతో పటాన్‌చెరు ప్రాంతంలోని మరో బంకును ఆశ్రయించారు. రోజూ 8వేల లీటర్ల డీజిల్‌ అవసరమని, డిపోకు ప్రత్యేకంగా ట్యాంకర్‌ పంపించాలని కోరారు. తాము ట్యాంకర్‌ను పంపలేమని వారు చెప్పడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.


బంకుల వద్దకే బస్సులు..?

డీజిల్‌ కోసం బంక్‌ వద్దకు వెళ్లాల్సి వస్తే డిపోలోని 100 బస్సులనూ తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్రేటర్‌ పరిధిలోని 29డిపోల్లోని బస్సులు పెట్రోల్‌ బంకుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.


ఆదాయంలో సగం డీజిల్‌‌కు..

గ్రేటర్‌ ఆర్టీసీకి రోజువారి ఆదాయం రూ.2.8 కోట్ల నుంచి రూ.3 కోట్లు వస్తుండగా సగం ఆదాయం డీజిల్‌కే చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన డీజిల్‌ చార్జీలతో గత నాలుగేళ్లలో గ్రేటర్‌ ఆర్టీసీపై వంద కోట్లకు పైగా ఆర్థిక భారం పడిందని అధికారులు చెబుతున్నారు. పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా టికెట్ల చార్జీలు పెంచుకుంటే తప్ప గ్రేటర్‌ ఆర్టీసీని ముందుకుతీసుకువెళ్లే పరిస్థితులు లేవంటూ సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. కాగా, బల్క్‌ డీజిల్‌ ధరలను తక్షణం తగ్గించాలని, ఇందుకోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. 


ఉద్యోగుల నిరసనలు

పెంచిన డీజిల్‌ ధరలతో బల్క్‌ బయ్యర్స్‌పై తీవ్ర ఆర్థికభారం పడుతుందని ఆర్టీసీ వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ కార్యనిర్వాహక కమిటీ ఆరోపించింది. ధరలను తగ్గించాలని కార్మిక సంఘాలతో కలిసి సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బల్క్‌ బయ్యర్స్‌కు రేట్లు పెంచడంతో ఆర్టీసీపై రోజుకు రూ.40 లక్షల వరకు భారం పడుతుందన్నారు. రాణిగంజ్‌, జీడిమెట్ల, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్‌తోపాటు గ్రేటర్‌లోని 29 డిపోల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ధరల భారాన్ని తమిళనాడు తరహాలో రీయంబర్స్‌ చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-03-01T14:28:35+05:30 IST