పడిగాపులు

ABN , First Publish Date - 2022-07-10T05:15:19+05:30 IST

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ప్రాంగణంలో జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి పెద్ద్ఙఎత్తున ఆర్టీసీ బస్సులు తరలివెళ్ళటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

పడిగాపులు
నరసరావుపేట బస్టాండ్‌లో ప్రయాణీకులు

ఆర్టీసీ బస్సుకు వైసీపీ రెక్కలు.. 

ప్రయాణీకులకు చుక్కలు 

దాదాపు 500 బస్సులు వైసీపీ ప్లీనరీకి..

ఉన్న అరకొర బస్సులతో ప్రయాణీకుల ఇక్కట్లు


గుంటూరు, జూలై9: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ప్రాంగణంలో జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి పెద్ద్ఙఎత్తున ఆర్టీసీ బస్సులు తరలివెళ్ళటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.   రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు శనివారం ముగిశాయి. ఇందు కోసం ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే 500 బస్సులు పైగానే అధికార పార్టీ నేతలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఐదు డిపోలున్న గుంటూరు జిల్లాలో 210కిపైగానే బస్సులను ప్లీనరీకి కేటాయించినట్లు తెలిసింది. ఆరు డిపోలున్న పల్నాడు జిల్లా నుంచి 300 బస్సుల వరకు కేటాయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు డిపోలున్న బాపట్ల రీజియన్‌ నుంచి 100కు పైగానే బస్సులను ప్లీనరీకి ఏర్పాటు చేసినట్లు సమాచారం.  ప్రయాణీకుల కోసం అరకొర బస్సులను అందుబాటులో ఉంచారు. గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌లో ప్రయాణీకులు నరకయాతన పడ్డారు. ఉదయాన్నే గమ్యస్థానాలకు వెళ్ళేందుకు బస్టాండ్‌కు వచ్చిన వారు సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణీకులు ఎగబడటంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు అల్లాడిపోయారు. గుంటూరు నుంచి మాచర్ల, సత్తెనపల్లి, తెనాలి, నరసరావుపేట, విజయవాడ, అమరావతి, ఇతర దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లుపడ్డారు. ఇక గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణీకులు ప్రైవేటు ఆటోలు, టాటా మ్యాజిక్‌లను ఆశ్రయించి అదనపు ఛార్జీలు చెల్లించుకోవాల్సి వచ్చింది.


ఇతర జిల్లాల ఆర్టీసీ బస్సులు

వైసీపీ ప్లీనరీ సమావేశానికి ప్రజల్ని తరలించేందుకు ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను గుంటూరు నగరానికి తీసుకొచ్చారు. తణుకు, నరసాపురం, పాలకొల్లు డిపోలకు చెందిన బస్సులను గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలను, డ్వాక్రా మహిళలను ప్లీనరీ వేదిక ప్రాంగణానికి తరలించారు. జనసమీకరణ బాధ్యతలు కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు, డ్వాక్రా సంఘాల ఆర్పీలు తీసుకున్నారు. 


 పల్నాడు జిల్లా నుంచి.. 

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ళ, చిలకలూరిపేట డిపోల నుంచి ఉన్న వాటిలో 65 శాతం బస్సులు ప్లీనరీకి తరలివెళ్లాయి. ఆయా డిపోల్లో 460 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో 300 బస్సులు ప్లీనరీకి తరలివెళ్ళాయి.. ఇక మిగిలింది 160 బస్సులు. దీంతో జిల్లాలో ప్రయాణీకులు బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంటిపిల్లలతో తల్లులు, వృద్ధులు పడ్డ అవస్థలు చెప్పనలవికావు. పిడుగురాళ్ల డిపోలో 49 బస్సులు, మాచర్ల డిపోలో 60బస్సులు ప్లీనరీకి కేటాయించారు. వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి  70 బస్సులను ప్లీనరీకి పంపారు. దీంతో నియోజకవర్గంలో రెండురోజులపాటు పల్లెవెలుగు బస్సులే తిరగలేదు. కేవలం 15 బస్సులను మాత్రమే విజయవాడ సర్వీస్‌కు ఏర్పాటు చేయడంతో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వినుకొండకు వచ్చే భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ బస్సు డిపో నుంచి 56 బస్సులు కేటాయించారు. వీటికి తోడు నెల్లూరు, కందుకూరు డిపోల నుంచి కూడా అదనపు బస్సులను తీసుకు వచ్చారు. 60 శాతం బస్సు సర్వీసులు రద్దు కావటంతో చిలకలూరిపేట డిపో పరిధిలోని ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.  సత్తెనపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన 38 సర్వీసులను ప్లీనరీకి కేటాయించారు. 

 

  

బాపట్ల జిల్లా నుంచి..

ప్లీనరీకి ఒక్క బాపట్ల నియోజకవర్గం నుంచి 56 ఆర్టీసీ సర్వీసులు, వీటితో పాటు స్కూలు, ప్రైవేటు బస్సులు నడిపారు. బాపట్ల నుంచి కేవలం ఆరు సర్వీస్‌లు, రేపల్లెకు ఒక సర్వీస్‌, పెదనందిపాడుకు ఒక సర్వీస్‌, చీరాల-గుంటూరుకు ఒక సర్వీస్‌ చొప్పున మొత్తం 9బస్సులు మాత్రమే ప్రయాణీకుల అవసరాలకు ఉంచారు. తీర ప్రాంతంలో వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆర్టీసీ  బస్సులన్నీ తరలించటంతో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రేపల్లె ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సులన్నీ ప్లీనరీ సమావేశానికి వెళ్లటంతో ప్రయాణీకులు బస్టాండ్‌లో గంటల తరబడి వేచి చూశారు. అద్దంకి బస్టాండ్‌లో ప్రజలకు ప్రయాణ ఇక్కట్లు తప్పలేదు. వీటికి తోడు ట్రాఫిక్‌ కష్టాలు కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. పర్చూరులోని వైజంక్షన్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్‌ కారణంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


 

Updated Date - 2022-07-10T05:15:19+05:30 IST