ప్రభుత్వ బస్సుల్లో ఎమర్జెన్సీ బెల్‌, సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2021-12-15T14:17:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 2100 బస్సులలో ఎమర్జెన్సీ బెల్‌ సదుపాయం కల్పించనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాజకన్నప్పన్‌ ప్రకటించారు. సచివాలయ ప్రాంగణంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..

ప్రభుత్వ బస్సుల్లో ఎమర్జెన్సీ బెల్‌, సీసీ కెమెరాలు

                      - మంత్రి రాజకన్నప్పన్‌ వెల్లడి


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 2100 బస్సులలో ఎమర్జెన్సీ బెల్‌ సదుపాయం కల్పించనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాజకన్నప్పన్‌ ప్రకటించారు. సచివాలయ ప్రాంగణంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్భయ’ పథకం కింద ఒక్కో బస్సులో మూడు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా చేపట్టామన్నారు. అదేవిధంగా బస్సులో నాలుగుచోట్ల ఎమర్జెన్సీ బెల్లులు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా ప్రయాణికులు ఎప్పుడెలాంటి ఆపదను ఎదుర్కొన్నా తక్షణం వాటిని మోగించవచ్చన్నారు. ఒక్కో బస్సులో నాలుగు ఎమర్జెన్సీ  బెల్లులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా సంబంధిత బస్సుడిపోలకు ఆ బస్సు గురించిన సమాచారం వెంటనే అందుతుందని వివరించారు. ఈ పనులను కూడా వేగవంతంగా చేశామన్నారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఉచిత టోల్‌ఫ్రీ నంబర్లను కూడా అందిస్తామన్నారు. సీనియర్‌ సిటిజన్లు, మానసిక రోగులు, ప్రత్యేక ప్రతిభావంతులు, సంచార జాతి ప్రజల వంతున వివిధ వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, వారి పట్ల కండక్టర్లు విసుగు చూపరాదన్నారు. కండెక్టర్లెవరైనా ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు తెలిస్తే వారికి కౌన్సెలింగ్‌ అందిస్తామన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ బంగారు భవితను దృష్టిలో వుంచుకుని, ఫుట్‌బోర్డు ప్రయాణాన్ని మానుకోవాలని హితవు పలికారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా.. అవసరాన్ని బట్టి విద్యాలయాలు పనిచేసే సమయంలో అదనపు బస్సులు నడపడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫుట్‌బోర్డు ప్రయాణాన్ని పర్యవేక్షించేందుకు ఆర్టీవోలను నియమించామన్నారు. దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి తదితర పండుగల సీజన్లలో సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం ఎప్పటిలాగే అదనపు బస్సులు నడుపుతామన్నారు. 14వ వేతన ఒప్పందంపై ఈ నెల 29వ తేదీన ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తామని మంత్రి రాజకన్నప్పన్‌ తెలిపారు.

Updated Date - 2021-12-15T14:17:02+05:30 IST