భర్త హత్యకు రూ.లక్ష అడ్వాన్స్‌

ABN , First Publish Date - 2022-08-13T05:59:34+05:30 IST

వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం రూపొందించిన భార్యను, ఇందుకు సహకరించిన వారిని నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

భర్త హత్యకు రూ.లక్ష అడ్వాన్స్‌
సమావేశంలో కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెమారాజేశ్వరి

 12లక్షలకు సుపారీ.. రూ.5లక్షల చెల్లింపు 

‘మునుగోడు’ కాల్పుల ఘటనలో వీడిన మిస్టరీ 

వివాహేతర సంబంధమే కాల్పులకు కారణం 

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 12: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం రూపొందించిన భార్యను, ఇందుకు సహకరించిన వారిని నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారినుంచి ఒక పిస్టల్‌,  తొమ్మిది మొబైల్‌ ఫోన్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నారు. దీంతో ‘మునుగోడు’ కాల్పుల ఘటనపై మిస్టరీ వీడింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మర్రిగూడ మండలం తుమ్మడవల్లి గ్రామానికి చెందిన చింతపల్లి బాలకృష్ణ ప్రస్తుతం వనస్థలిపురంలో ఉంటూ నార్కట్‌ పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామంలోని జడ్పీహెచ్‌ఎ్‌సలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బాలకృష్ణ భార్య గతంలో మృతిచెందగా, అదే పాఠశాలలో మధ్యాహ్న బోజన కార్మికురాలిగా పనిచేస్తున్న నిమ్మల సంధ్యతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని సంధ్య భర్త నిమ్మల స్వామిని అడ్డు తొలగించుకునేందుకు వీరిద్దరూ పథకం వేశారు. దీని కోసం ముందుగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌కు చెందిన కనక రామస్వామితో బాలకృష్ణ రూ. 3లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.1.70లక్షలు ముందస్తుగా చెల్లించాడు. దీంతో రామస్వామి మునుగోడులో నిమ్మల స్వామి నడుపుతున్న దుకాణం పక్కన మడిగను అద్దెకు తీసుకొని స్వామి దుకాణంలో పనిచేస్తున్న మోహినుద్దీన్‌తో స్నేహం పెంచుకున్నాడు. అతనికి రెండు వేల రూపాయలు ఇచ్చి స్వామి కదలికలను తెలుసుకున్నాడు. 


మొదటిసారి విఫలమైన హత్యాయత్నం

చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన పోలే గిరి, రత్నాల వెంకటేశ్‌లతో కలిసి నిమ్మల స్వామిపై ఒకసారి హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. చెప్పిన పనిచేయనందకు గాను తను అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రామస్వామిపై బాలకృష్ణ ఒత్తిడి తెచ్చాడు. ఇచ్చిన నగదు మొత్తం ఖర్చు అయిందని రామస్వామి చెప్పగా బాలకృష్ణ అంగీకరించకపోవడంతో రామస్వామి ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. అయితే బాలకృష్ణ అంతటితో ఆగకుండా హైదరాబాద్‌లోని తన ఇంట్లో ప్లంబర్‌గా పనిచేస్తున్న యూసూ్‌ఫతో పధకం వేసి నిమ్మల స్వామిని హత్యచేసేందుకు రూ 12.లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.5 లక్షలు సుపారీ అందచేశాడు. నిమ్మల సంధ్య సమభావన సంఘం ద్వారా వచ్చిన మొత్తం రూ.లక్ష రూపాయలు తెచ్చి ఇచ్చింది. యూసూఫ్‌ తన స్నేహితుడు అబ్ధుల్‌ రహమాన్‌పాషా, ఆసీ్‌ఫఖాన్‌ లు, జహంగీర్‌ కలసి అప్పటికే బీహర్‌లో  కొనుగోలు చేసుకొన్న పిస్టల్‌తో స్వామిని చంపేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఈ నెల 4వతేదీన మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వస్తున్న నిమ్మల స్వామిపై అబ్ధుల్‌ రహమాన్‌పాషా, జహంగీర్‌లు కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దంతో స్థానికులు అప్రమత్తమై అక్కడికి రావటంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కామినేని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. నిమ్మల స్వామి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లను శస్త్రచికిత్స అనంతరం తొలగించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలకృష్ణ(ఏ1), సంధ్య(ఏ2),  అబ్ధుల్‌ రహమాన్‌పాషా(ఏ3), జహంగీర్‌(ఏ4), యూసు్‌ఫ(ఏ5), రామస్వామి(ఏ6), ఆసి్‌ఫఖాన్‌(ఏ7), పోలె గిరి(ఏ8), రత్నాల వెంకటేశ్‌(ఏ9), మొహినుద్దీన్‌(ఏ10)లపై కేసు నమోదుచేసి తొమ్మిదిమందిని అరెస్టు చేసి, ఒక పిస్టల్‌,  తొమ్మిది మొబైల్‌ ఫోన్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన యూసుఫ్‌ (ఏ5) పరారీలో ఉన్నట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ నరసింహారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మొగిలయ్య, సీఐలు రామారావు, శంకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-13T05:59:34+05:30 IST