Abn logo
Aug 12 2020 @ 02:35AM

రూ. వంద కోట్లకు టోకరా!

 పరారీలో పప్పుశనగల వ్యాపారులు..

 రైతులు, చోటా వ్యాపారులకు కుచ్చుటోపీ..

 అనామతు లెక్కలతో..

ఆధారాలు లేక బాధితుల ఆవేదన..


గుంతకల్లు, ఆగస్టు11: 

రైతులు, చిరు వ్యాపారులను పప్పుశనగ వ్యాపారులు నిలువునా ముంచేశారు. ఏకంగా వంద కోట్ల రూపాయలకు టోకరా వేశారు. డబ్బు ఇవ్వకుండా పరారయ్యారు. పట్టణానికి చెందిన ఇద్దరు పప్పుశనగల వ్యాపారులు దాదాపు వంద కోట్లమేర రైతులు, చోటా వ్యాపారులకు శఠగోపం పెట్టారు. వీరిలో ఒకరు నెల రోజులుగా కనిపించకుండా పోయాడు. మరొకరు 20 రోజులుగా అడ్రస్‌ లేడు. వీరు చట్ట ప్రకారం దివాలా ప్రకటించకుండా అదృశ్యమవటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.


ఆధారాలు లేకుండా అనామతుగా సరుకు అమ్మిన చిన్న వ్యాపారులు, రైతులు కోర్టుకు కూడా వెళ్లలేని స్థితిలో ఉండిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఆరుగాలం శ్రమించి, పండించిన పంటను వ్యాపారుల చేతుల్లో పెట్టి, కన్నీటి పర్యంతమౌతున్నారు అన్నదాతలు. పోలీసు స్టేషన్లకు వెళితే సివిల్‌ కేసనీ, కోర్టులో చూసుకోండంటూ వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారంటూ రైతులు వాపోతున్నారు.


అర్థంలేని కారణాలు

పప్పుశనగ వ్యాపారులు మేడా ప్రహ్లాద, ప్రభాకర్‌ డబ్బు చెల్లించలేకపోవటానికి పొంతనలేని కారణాలు చెప్పి, రైతులకు దొరక్కుండా అదృశ్యమయ్యారు. ప్రహ్లాద తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ ముఖం చాటేశాడు. అనామతుగా సరుకు ఇచ్చిన రైతులు, చిన్న వ్యాపారులు అతడి కోసం రెండు నెలలుగా వెతుకుతున్నారు. పెద్దల పంచాయితీకి అతడి సోదరులు వచ్చి, బకాయిదారులతో మంతనాలు సాగించినా చెల్లింపులు మాత్రం చేయలేదు. రూ.50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల దాకా ఇతడు బకాయిపడినట్లు సమాచారం.


పట్టణ శివారులో శీతల గిడ్డంగి నిర్వహిస్తున్న ప్రభాకర్‌ను నమ్మి విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, చిప్పగిరి తదితర మండలాల రైతులు, చోటా వ్యాపారులు పప్పుశనగలు అమ్మారు. ఇతడు 20 రోజుల కిందట కనిపించకుండా పోయాడు. ప్రహ్లాద కంటే ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్నట్లు సమాచారం. పెనుకొండ వద్ద కియా పరిశ్రమకు ఆనుకుని భూములు కొనగా, వాటిని అమ్మలేని పరిస్థితి ఏర్పడిందంటూ ప్రభాకర్‌ డబ్బు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చినట్లు తెలిసింది.


ఈ నేపథ్యంలో మూడు వారాలుగా కనిపించకుండాపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభాకర్‌ బకాయిలు చెల్లించట్లేదనీ, కనిపించట్లేదనీ తెలియటంతో అనామతుగా కాకుండా గిడ్డంగిలో సరుకు ఉంచి, రసీదు తీసుకున్న రైతులు ఆందోళన బాట పట్టారు. 


రైతుల స్టాక్‌పై బ్యాంకులో అప్పు

రైతులు తమ పేర్లపైనే గిడ్డంగిలో నిల్వ చేసిన సరుకుపై కూడా ప్రైవేటు బ్యాంకుల్లో వ్యాపారి ప్రభాకర్‌ అప్పులు తీసుకున్నాడు. దీంతో బ్యాంకర్లు.. రైతులు సరుకు తీసుకెళ్లకుండా అభ్యంతరం తెలిపారు. గోదాముుకు తాళాలు వేశారు. దీంతో తమ సరుకుపై గిడ్డంగి యజమానికి రుణమెలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో గిడ్డంగిలోని సరుకును తీసుకెళ్లారు. గిడ్డంగిలోని సరుకుపై ఎన్‌సీఎంసీ అనే మధ్యవర్థిత్వ సంస్థ సిఫార్సుల మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. గిడ్డంగిలోని సరుకును రైతులు తీసుకెళ్లగా, స్టాక్‌పై అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితి అయోమయంలో పడింది.


దాదాపు రూ.6 కోట్లు బ్యాంకులో అప్పు ఉన్నట్లు తెలిసింది. మేడా ప్రహ్లాద బకాయిపడ్డ రైతులు చిప్పగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకెళ్లారు. సివిల్‌ కేసు అనీ, కోర్టులో చూసుకోండంటూ చేతులు దులుపుకున్నారనీ, వ్యాపారులకే అనుకూలంగా మాట్లాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహించిన రైతులు ప్రహ్లాద సంబంధీకులపై చేయిచేసుకున్నట్లు సమాచారం. రైతుల నుంచి సరుకు తెచ్చి, బడా వ్యాపారులకు అనామతుగా ఇచ్చిన చిన్న వ్యాపారుల పరిస్థితి కూడా సంకటంలో పడింది. ఆస్తులను అమ్మి, రైతులకు అప్పులు చెల్లించటమో, వారు కూడా ఎగవేయటమో చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

Advertisement
Advertisement
Advertisement