తొడ కొట్టిన మంత్రి మల్లారెడ్డిపై RS Praveen సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-26T23:57:45+05:30 IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. టీపీసీసీ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తొడలు కొట్టుకుని సవాల్ చేసుకునే స్థాయికి వెళ్లింది..

తొడ కొట్టిన మంత్రి మల్లారెడ్డిపై RS Praveen సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తొడలు కొట్టుకుని సవాల్ చేసుకునే స్థాయికి వెళ్లింది. గత 24 గంటల నుంచి టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. మరోవైపు ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి వ్యవహారంపై బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. తాను నిర్వహించే సభలకు కేసీఆర్ సర్కార్ కరెంట్ కట్ చేస్తోందని.. తాను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌కి కరెంట్ చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలని కేసీఆర్ సర్కార్‌కు ప్రవీణ్ హితవు పలికారు.


ఇదేనా మీరు నేర్పించేది..!?

మల్లారెడ్డీ.. మంత్రి హోదాలో ఉండి తొడ గొట్టి మాట్లాడతారా..?. మీ కాలేజీల్లో విద్యార్థులకు నేర్పేది ఇదేనా మల్లారెడ్డి..?. మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బహిష్కరించాలి. కేసీఆర్ అసెంబ్లీని ఎప్పుడైనా రద్దు చేస్తారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు చేయాలి. బీజేపీ- టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. సీఎంవోలోకి దళిత అధికారి అని ఎందుకు రాస్తున్నారు..?. వాళ్లంతా భారతీయ అధికారులు అని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాగా.. ప్రవీణ్ కుమార్ బీస్పీ తీర్థం పుచ్చుకునే రోజు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజున కరెంట్, ఇంటర్నెట్ కట్ చేయడంతో పాటు.. పోలీసులతో సభకు వచ్చే జనాలను నానా ఇబ్బందులు పెట్టారని ఆ పార్టీ నాయకులు ఆ రోజు నుంచి ఇప్పటికీ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ కుమార్ రెండు మూడు సార్లు ‘కరెంట్ కట్’ విషయంపై మాట్లాడారు. తాజాగా పై విధంగా బీఎస్పీ నేత వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-08-26T23:57:45+05:30 IST