రూ. 4,687.92 కోట్లతో జిల్లా రుణ ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-27T05:29:56+05:30 IST

వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ జిల్లా రుణ ప్రణాళికను ఖరారు చేశారు.

రూ. 4,687.92 కోట్లతో జిల్లా రుణ ప్రణాళిక
వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 - ఆవిష్కరించిన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- వ్యవసాయరంగానికి పెద్దపీట.. 

- రూ. 3255 కోట్ల కేటాయింపు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ జిల్లా రుణ ప్రణాళికను ఖరారు చేశారు. 4,687 కోట్ల 92 లక్షల రూపాయలతో రూపొందించిన జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన  సమావేశంలో కలెక్టర్‌ రుణ ప్రణాళికను ఆవిష్కరించి మాట్లాడారు. 2023 మార్చి నెలాఖరు వరకు బ్యాంకులు ఈ ప్రణాళికను నూరుశాతం అమలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్యా, గృహరుణాలు, మౌళిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక రంగాలకు 4,423 కోట్ల 92 లక్షల రూపాయలు కేటాయించారు. ఇతర ప్రాధాన్యరంగాలకు 175 కోట్ల 81 లక్షలు, ప్రాధాన్యేతర రంగాలకు 264 కోట్ల రూపాయలు కేటాయించారు. 

- పంట రుణాలకు రూ. 2193.54 కోట్లు

పంట రుణాలు, పంటల నిర్వహణ, మార్కెటింగ్‌ సౌకర్యాల కోసం 2,193 కోట్ల 54 లక్షల రూపాయల రుణాలను ఇవ్వనున్నారు. ఈ పంట రుణాలతో 2,04,641 మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. వ్యవసాయ రంగంలో టర్మ్‌లోన్‌ విభాగం కింద 15,551 మంది రైతులకు 327 కోట్ల 31 లక్షల రూపాయల రుణాలు అందించనున్నారు. జిల్లా రుణ ప్రణాళికలో పంట రుణాలకే 46.79 శాతం నిధులు కేటాయించడంతో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలకు సంబంధించి 9,558 మంది రైతులకు 188.6 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు 972 మంది రైతులకు 74.35 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగంలో 3,372 మంది రైతులకు 471.81 కోట్ల రుపాయలు రూపాయలు రుణాలుగా అందించనున్నారు.జిల్లా రుణ ప్రణాళికలో 69.44 శాతం నిధులు వ్యవసాయరంగానికే కేటాయించారు. దీంతో వ్యవసాయ రంగానికి మొత్తం 3,255.61 కోట్ల రూపాయలు కేటాయించినట్లయింది. 

- మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలకు 361 కోట్ల 25 లక్షల రూపాయలు కేటాయించారు. దీంతో 18,063 యూనిట్ల స్థాపనకు అవకాశం కలుగుతుంది.

- స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు 579 కోట్ల 50 లక్షలు, మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థలకు 33.75 కోట్లు కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతో 13,273 చిన్న సంస్థల స్థాపనకు, 101 మధ్యతరహా సంస్థల స్థాపనకు రుణ సహాయం అందుతుంది. 

- 553 మందికి విద్యారుణలకుగాను 27 కోట్లు, 1299 మందికి గృహ రుణాల కింద 129 కోట్ల 17 లక్షల రూపాయలు రుణాలుగా అందించాలని ప్రణాళికలో నిర్దేశించారు.

- సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం 16 కోట్ల 50 లక్షలు, పునరుత్పాదక శక్తి విభాగంలో 173 యూనిట్లకు 3 కోట్ల 16 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. 

- ఇతర ప్రాధాన్యరంగాల్లో 2,443 యూనిట్లకు 175 కోట్ల 81 లక్షలు అందించాలని నిర్ణయించారు. 

- 2021-22 వార్షిక రుణ ప్రణాళికతో పోల్చితే ఈ సంవత్సర రుణ ప్రణాళికలో 16.02 శాతం నిధులు పెరిగాయి. 

రుణ ప్రణాళిక ఆవిష్కరణ సమావేశంలో లీడ్‌ డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ టీవీ సీతారామాంజనేయులు, నాబార్డు ఏజీఎం పి అనంత్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ రవీందర్‌, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మనోహర్‌రావు, వివిధ బ్యాంకుల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-27T05:29:56+05:30 IST