నేడే బడ్జెట్ : రైతులకు, మధ్యతరగతికి ఊరట..!

ABN , First Publish Date - 2022-02-01T07:17:25+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో మొత్తం నిధులు..

నేడే బడ్జెట్ : రైతులకు, మధ్యతరగతికి ఊరట..!

  • రూ.40 లక్షల కోట్ల బడ్జెట్‌..?
  • మౌలిక సదుపాయాలు, ఆరోగ్యరంగంలో భారీ వ్యయం

న్యూఢిల్లీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో మొత్తం నిధులు రూ.40 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్‌ కంటే మొత్తం నిధులు 14% పెరుగుతాయని భావిస్తున్నారు. బడ్జెట్‌లో అత్యధిక ప్రయోజనం ఉత్పాదక రంగానికే లభిస్తుందని.. ఆ తర్వాత సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని విశ్లేషిస్తున్నా రు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, రికార్డు స్థాయిలో మార్కెట్‌ రుణాలను కొనసాగించడం ద్వారా రూ.13 లక్షల కోట్ల మేరకు నిధుల సమీకరణ జరుగుతుందని వారి అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ లోటును 6.1 శాతానికి తగ్గించవచ్చునని భావిస్తున్నారు.


దేశంలోని 700 జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా ప్రకటించే అవకాశాలున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపునిచ్చే విధంగా పరిశ్రమ హోదా కల్పించడం, పన్ను రాయితీలు వంటి అనేక చర్యలు ఉండవచ్చునని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏడాది నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుని భారీ ఎత్తున ఆదాయ వనరులు సమకూరాయని ఆర్థిక సర్వే ప్రకటించడంతో ఆ మేరకు ప్రభుత్వ వ్యయాన్ని మరిం త పెంచడం ద్వారా వృద్ధి రేటును పెంచాలని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నా రు. వ్యయాన్ని పెంచడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందువల్ల బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ది, ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీలు, ఉపాధి కల్పనను పెంచేందుకు, మౌలిక సదుపాయాల రంగానికి భారీ కేటాయింపులు ప్రకటించడం వంటివి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆరోగ్యానికి జీడీపీలో 3ు కేటాయింపులు ఉండొచ్చని అంచనావేస్తున్నారు.


పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ

బడ్జెట్‌ను ప్రవేశపెట్టగానే అందులో పేర్కొన్న ప్రతిపాదనలతో పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వెళ్లాలని పార్టీ సీనియర్‌ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు పంపారు. బుధవారం తానే స్వయంగా పార్టీ కార్యకర్తలతో సంభాషించి బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రాధాన్యతను వివరించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. దీంతో మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధిం చే దిశగా బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించినట్లు పార్టీ నాయకుల్లో చర్చ ప్రారంభమైంది. సామాన్యులు, రైతులు, మధ్యతరగతి.. ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్‌లో శుభవార్తలుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక బడ్జెట్‌లో రాష్ట్రాల వారీగా ప్రతిపాదనలు ఉంటాయని, తద్వారా వివిధ రాష్ట్రాల్లో కార్యకర్తలు జనం ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుందని పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2022-02-01T07:17:25+05:30 IST