చంద్రగిరిలో రూ.25 కోట్ల భూ ఆక్రమణ

ABN , First Publish Date - 2021-07-28T06:50:10+05:30 IST

చంద్రగిరిలో రూ.25 కోట్ల భూ ఆక్రమణ

చంద్రగిరిలో రూ.25 కోట్ల భూ ఆక్రమణ
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న పులివర్తి నాని

అధికార పార్టీ పనేనంటూ పులివర్తి నాని ఆరోపణ 


బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ధర్నా 


చంద్రగిరి, జూలై 27: చంద్రగిరి నియోజక వర్గంలో వైసీపీ నాయకులు రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమించారని టీడీపీ ఇన్‌చార్జి పులివర్తి నానీ ఆరోపించారు. భూ ఆక్రమణలను నిరసిస్తూ మంగళవారం చంద్రగిరిలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో నాని మాట్లాడారు. చంద్రగిరిలోనే ఇలా పరిస్థితి ఉంటే, జిల్లాలో భూ కబ్జాలు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. భూ కబ్జాలతో పాటు మట్టి, ఇసుక మాఫియాగా ఏర్పడి వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆక్రమణదారులకు సహకరించకుండా ప్రభుత్వ భూమిని కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం తహసీల్దార్‌ చిన్న వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో టీడీపీ చంద్రగిరి మండల కమిటీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా, మాజీ జడ్పీటీసీ రమేష్‌రెడ్డి, కుమార్‌రాజారెడ్డి, మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, తిరుపతి రూరల్‌ నాయకుడు ఈశ్వర్‌రెడ్డి, కందులవారిపల్లె ఉప సర్పంచ్‌ రాఖేష్‌ చౌదరి, మండల తెలుగు యువత అధ్యక్షుడు భానుప్రకాష్‌, ప్రవీణ్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శంకర్‌, మాజీ ఎంపీటీసీ గురవయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


భూ ఆక్రమణలపై నానీ చేసిన ఆరోపణలివీ.. 


చంద్రగిరిలోని సర్వే నెంబరు-1548 లో  4.28 ఎకరాలకు 1982లో ప్రభుత్వం పరిహారం చెల్లించి చెరువు తవ్వింది. ఇందులో 90 సెంట్లు తన మామకు చెందిందని రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి వైసీపీ నాయకులు రిజిస్టర్‌ చేసుకున్నారు. రూ.4 కోట్ల విలువైన ఈ భూమిలో 15 మందికి పట్టాలు ఇచ్చారు. 

చంద్రగిరిలోని నాయీ బ్రాహ్మణ కాలనీలోని సర్వే నెంబర్‌-1479లో రూ.3 కోట్ల విలువైన భూమిని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఆక్రమించి దర్జాగా చదును చేస్తున్నారు. 

చంద్రగిరి ఇందిరమ్మ కాలనీకి తూర్పున ప్రభుత్వ భూమిని  కబ్జా చేసి వైసీపీ నాయకులు చదును చేస్తున్నారని తెలిపారు. 

తొండవాడలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేసిన అగ్రవర్ణాలకు చెందిన నాయకులు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. 

చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ సమీపంలోని ప్రభుత్వ భూమికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి మూడు కమర్షియల్‌ రూములు కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

Updated Date - 2021-07-28T06:50:10+05:30 IST