మినీ గోకులాలపై శీతకన్ను

ABN , First Publish Date - 2021-10-25T05:24:25+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన మినీ గోకులాల బిల్లుల చెల్లింపులు ఎప్పుడు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.22.63 కోట్ల బకాయిలు ఉన్నాయి.

మినీ గోకులాలపై శీతకన్ను

రూ.22.63 కోట్ల బకాయిలు

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పాలకులు

ఆందోళనకు సన్నద్ధమవుతున్న రైతులు

కడప రూరల్‌, అక్టోబరు 24 : తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన మినీ గోకులాల బిల్లుల చెల్లింపులు ఎప్పుడు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.22.63 కోట్ల బకాయిలు ఉన్నాయి. మినీ గోకులాలపై ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో మినీ గోకులాల బిల్లులను చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలోని మినీ గోకులాలకు మాత్రమే అడపాదడపా చెల్లించి మిగిలిన రైతులకు చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. దీంతో బాధిత రైతులు పలుమార్లు అధికారులను కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నా ప్రయోజనం లేదు. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతు సంఘాల నేతల మద్దతుతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 


3002 మినీ గోకులాలు మంజూరు 

పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా పాడి పశువుల సంరక్షణకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా 2018-19లో జిల్లాకు దాదాపు రూ.57.6 కోట్ల విలువతో 3002 మినీ గోకులాలను మంజూరు చేసింది. ఇందులో జమ్మలమడుగు డివిజన్‌లో 529 గోకులాలు, కడప డివిజన్‌లో 718 గోకులాలు, పులివెందుల డివిజన్‌లో 260 గోకులాలు, రాజంపేట డివిజన్‌లో 639 గోకులాలు, రాయచోటి డివిజన్‌లో 883 గోకులాల ఏర్పాటుకు అర్హులైన రైతులను అధికారులు ఎంపిక చేసి పనులను చేపట్టారు. వీటిలో ఆరు పశువుల మినీ గోకులాలు 2138 (ఒక్కొక్కటి రూ.1.80 లక్షలు ఇందులో వేజ్‌ కాంపొనేంట్‌ రూ.14,400) అలాగే నాలుగు పశువుల మినీ గోకులాలు 706 (ఒక్కొక్కటి రూ.1.50 లక్షలు ఇందులో వేజ్‌ కాంపోనేంట్‌ రూ.12,400), అలాగే రెండు పశువుల మినీ గోకులాలు 147 (ఒక్కొక్కటి రూ. లక్ష ఇందులో వేజ్‌ కాంపొనేంట్‌ రూ.10 వేలు), అలాగే గ్రామ యూనిట్‌గా ఇరవై పశువుల గోకులాలు 11 (ఒక్కొక్కటి 21 లక్షలు) మేర మంజూరయ్యాయి. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం మినీ గోకులాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలను చేపట్టింది. దీంతో బిల్లులు సకాలంలో వస్తాయిలే అని కొందరు రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి, మరి కొందరు రైతులు వడ్డీలకు డబ్బులు తెచ్చి నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మినీ గోకులాలను పట్టించుకోలేదు. వీటికి సంబంధించిన బిల్లులను కూడా చెల్లించలేదు. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించంతో అడపాదడపా చెల్లింపులను చేపట్టి తరువాత పట్టించుకోలేదని పలువురు వాపోతున్నారు.


రూ. 22.63 కోట్ల బకాయిలు

రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా మినీ గోకులాల రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ.22.63 కోట్ల చెల్లింపును గాలికి వదిలేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం జిల్లాకు 3002 మినీ గోకులాలు మంజూరు చేసి  చకచకా  పనులను చేపట్టింది. ఈ మేరకు ఇప్పటి వరకు 28 కోట్ల 39 లక్షల, 86 వేల 500 బిల్లులను సంబంధిత రైతులకు చెల్లించారు. ఇంకా రైతులకు చెల్లించాల్సిన రూ.22.63 కోట్ల బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించలేదు. ఇంకా 580 గోకులాల నిర్మాణాలకు ఎం.బుక్‌ రికార్డింగ్‌నే పూర్తి చేయలేదని ఆరోపణలున్నాయి. ఎం.బుక్‌ చేయకుండా బిల్లులు చెల్లించడానికి వీలులేదు.  దీంతో బాధిత రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రైతు సంఘాల మద్దతుతో అందోళనకు సన్నద్ధమవుతున్నారు.


బిల్లుల చెల్లింపునకు చర్యలు 

- డాక్టర్‌ సత్యప్రకాష్‌, జిల్లా సంయుక్త సంచాలకులు, పశుసంవర్థక శాఖ

ప్రభుత్వ ఆదేశాల మేరకు మినీ గోకులాలకు సంబంధించిన బిల్లులను త్వరలో రైతుల అకౌంట్‌కు జమ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన ఎం.బుక్‌ రికారింగ్‌ పనులను పూర్తి చేస్తున్నాం.  బాధిత రైతులు అధైర్యపడవద్దు. నిధుల కొరత లేదు.  


కాలయాపన చేయడం సరికాదు 

- జి.చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం

మినీ గోకులాల బిల్లులను చెల్లించకుండా కాలయాపన చేయడం సరికాదు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు చాలా పనులకు ఎం.బుక్‌ చేయలేదు. అలాంటప్పుడు బిల్లులను ఎలా చెల్లిస్తారు. బంగారాన్ని తాకట్టు పెట్టి, వడ్డీలకు తెచ్చి మినీ గోకులాలను నిర్మించుకున్నారు. రైతుల బాధను అర్థం చేసుకొని హైకోర్టు ఆదేశాల మేరకు వడ్డీతో సహా బిల్లులను చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తన రైతు ఉద్యమాలను చేపడతాము. 


Updated Date - 2021-10-25T05:24:25+05:30 IST