అమ్మో యాప్‌లు!

ABN , First Publish Date - 2020-11-16T09:40:02+05:30 IST

పంచాయతీరాజ్‌ శాఖలో యాప్‌లను అమల్లోకి తెచ్చారు. పల్లె ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుగాను ఈ యాప్‌లను రూపొందించారు.

అమ్మో యాప్‌లు!

పంచాయతీరాజ్‌లో అమల్లోకి రెండు యాప్‌లు 

 భారమంటున్న పంచాయతీ కార్యదర్శులు 

 పారదర్శకత కోసమే అంటున్న అధికారులు

 ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ 

 మానిటరింగ్‌కు ప్రత్యేక అధికారి నియామకం


తాండూరు : పంచాయతీరాజ్‌ శాఖలో యాప్‌లను అమల్లోకి తెచ్చారు. పల్లె ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుగాను ఈ యాప్‌లను రూపొందించారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయిలో జరుగుతున్న పనుల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుకునేందుకు రెండు యాప్‌లను పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన విషయం విదితమే.  


పంచాయతీల్లో చేపట్టే పనుల్లో పారదర్శకత, సమస్యల గుర్తింపు, పరిష్కరించడంలో వేగం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త యాప్‌లతో మరిన్ని కష్టాలు వచ్చాయని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఇప్పటికే పలురకాల పనిభారంతో ఇబ్బందులు పడుతున్న తాము కొత్త యాప్‌లతో మరిన్ని అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు కొత్త యాప్‌లను రద్దు చేయాలని కోరుతూ నిరసనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 12యాప్‌లు ఉండగా, ఇప్పుడు మరో కొత్తదాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడంపై పంచాయతీ కార్యదర్శులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో సరిపోను సిబ్బంది లేక పనులు చేస్తున్నామని, కొత్త యాప్‌ల విడుదలతో మరింత పనిభారం పెరిగిందని అంటున్నారు.     

          

కొత్త యాప్‌ల వివరాలు

పల్లె ప్రగతి-పీఎస్‌, పల్లె ప్రగతి-పర్యవేక్షణ యాప్‌(ఇన్‌స్పెక్షన్‌).. గ్రామ కార్యదర్శి మొదలు ఎంపీడీవో, ఎంపీవో, డీఎల్‌పీవో, డీపీవో, సీఈవోల వరకు యాప్‌ల ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఈనెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త యాప్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. రోజూ గ్రామంలో పాల్గొన్న కార్యక్రమాల వివరాలను ఈ యాప్‌ ద్వారా అధికారులకు చిత్రాలతోపాటు నివేదించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆధునిక, సాంకేతిక సహకారంతో దస్త్రాల నిర్వహణ, పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో పాలకులు పంచాయతీ కార్యదర్శులకు పలురకాల యాప్‌లను అందజేశారు.

 

డిమాండ్‌, అలకేషన్‌ యాప్‌, ఎస్‌బీఎన్‌జీటీఎస్‌, ఎంఎస్‌డీఎం, ఎల్‌వోసీ, టీఎస్‌ఎన్‌పీబీ, నరేగా, పీఎస్‌ యాప్‌, మిషన్‌ అంత్యోదయ వంటి యాప్‌లు ఉన్నాయి. 


పీఎస్‌ యాప్‌లలో రోజువారీ కార్యక్రమాలు

రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రపరచడం, వీధి దీపాల నిర్వహణ, ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, నెలవారి కార్యకలాపాల జాబితాలో భాగంగా పల్లెప్రగతి పనులు, నీటి ట్యాంకులను శుభ్రపరచడం, గ్రామసభ రికార్డుల నిర్వహణ, పంచాయతీ తీర్మానాలు, ధ్రువపత్రాలు, జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్లు, పంచాయతీ ఆదాయం, వ్యయం, ఆమోదించిన చెక్కులు, జీతాల రశీదు, గ్రామ తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల కమిటీ, బ్యాంకు ఖాతాల సమాచారం. 


ఇన్‌స్పెక్షన్‌ యాప్‌లో కార్యకలాపాలు

పారిశుధ్య పనులు, శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డ్‌ వినియోగం, నర్సరీ కార్యకలాపాలు, తోటల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు జారీ చేసిన చెక్కుల ధ్రువీకరణ, పంచాయతీ పరిపాలన, రికార్డుల నిర్వహణ, తనిఖీ నివేదిక.


యాప్‌ల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు

పల్లె ప్రగతి యాప్‌ల పర్యవేక్షణకుగాను వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఈ-గవర్నెన్స్‌ డిప్యూటీ కమిషనర్‌, పీజే.వెస్లీని నియమించారు. రోజువారీగా, నెలవారీగా చేపడుతున్న కార్యక్రమాలను యాప్‌ల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. 


ఫోన్లు, సిమ్‌కార్డులు ఏవీ..?

ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మెమోరీ సరిపోవడం లేదు. 8జీబీ ర్యామ్‌ ఉన్న చరవాణిలు అయితేనే సరిపోతాయి. చాలీచాలని జీతాలతో 8జీబీ ర్యామ్‌ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయలేకపోతున్నామని, ఉన్న ఫోన్లతో సమాచారాన్ని అందించలేకపోతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. ప్రభుత్వం చరవాణిలు, సిమ్‌కార్డులు ఇవ్వలేదు. వాటికి అయ్యే ఖర్చును నెలసరి వేతనం నుంచే భరిస్తున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-16T09:40:02+05:30 IST