రూటుమార్చి దోపిడీ లేదా అక్రమానికి రైటరైట్‌

ABN , First Publish Date - 2020-10-20T08:03:11+05:30 IST

ఇసుక దందా తారస్థాయికి చేరింది. తెలంగాణ రాష్ర్టానికి రవాణా పేరుతో సిలికా ఇసుక కనిగిరి మీదుగా జోరుగా సాగుతోంది. ఆన్‌లైన్‌ కాదని, మాన్యువల్‌ బిల్లులు చేయించి పెద్ద ఎత్తున

రూటుమార్చి దోపిడీ లేదా అక్రమానికి రైటరైట్‌

సిలికా మాటున లోకల్‌ మస్కా

ఇసుక రవాణాలో నయా దందా

తెలంగాణ పేరుతో జిల్లాలో అమ్మకం

పర్మిట్లు ఒక చోటుకి, తరలించేది మరో చోటుకి 

నిత్యం జిల్లాలకు జిల్లాలు దాటుతున్న లారీలు

నెల్లూరు నుంచి అక్రమ రవాణా

కనిగిరి నియోజకవర్గంలోనూ భారీగా ఇసుక దందా 

అన్ని స్థాయిల్లో, అన్ని శాఖల్లో మామూళ్లు

ముట్టచెబుతూ యథేచ్ఛగా దోపిడీ

ఇసుకాసురులు రూటుమార్చారు. సిలికా ఇసుక రవాణా పేరుతో మామూలు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. సిలికా స్థానికంగా పనికిరాదు.. అంతా తెలంగాణకు ఇతర అవసరాలకు తరలిస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తూ స్థానికంగా డంప్‌ చేసి గుట్టుగా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ ఇసుక నెల్లూరు, సంఘం, కడప ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లాకు రవాణా అవుతోంది. మామూళ్లు ముట్టజెబుతూ నిత్యం ఇసుక తరలిస్తున్నారు. టోల్‌గేట్‌ల నుంచి తప్పించుకునేందుకు కనిగిరి గుండా అర్ధరాత్రి లారీలను తిప్పుతుంటారు. బిల్లు పర్మిట్‌లో, తూకాల్లో తేడాలను గుర్తించి స్థానిక ఎక్సైజ్‌ సీఐ ఇటీవల 5 లారీలను కనిగిరిలో పట్టుకున్నారు. మంగళవారం మరో రెండు లారీలను పట్టుకున్నారు. పనిలోపనిగా స్థానికంగా లభించే ఇసుకను తవ్వి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ ఇసుక అక్రమ వ్యవహారం అధికారపార్టీ నేతల కనుసన్నల్లో మూడు లారీలు, ఆరుట్రాక్టర్లుగా సాగుతోంది. 

కనిగిరి, అక్టోబరు 19 : ఇసుక దందా తారస్థాయికి చేరింది. తెలంగాణ రాష్ర్టానికి రవాణా పేరుతో సిలికా ఇసుక కనిగిరి మీదుగా జోరుగా సాగుతోంది. ఆన్‌లైన్‌ కాదని, మాన్యువల్‌ బిల్లులు చేయించి పెద్ద ఎత్తున లారీల ద్వారా టన్నులకు టన్నులు తరలిస్తున్నారు. పనిలోపనిగా కొందరు ఆ ముసుగులో స్థానికంగా కూడా డంప్‌ చేసి అమ్ముకుంటున్నారు. బడా నాయకులు, పదవుల్లో ఉన్న నేతల కనుసన్నల్లో ఇసుక దందా కొనసాగుతోంది.


నెల్లూరు జిల్లా గూడూరు సమీపాన చింతవరం నుంచి సిలికా ఇసుక పేరుతో అక్రమ రవాణా సాగుతోంది. అన్ని స్థాయిల్లో, అన్ని శాఖల్లో భారీగా మామూళ్లు ముట్టజెబుతుండటంతో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. రోడ్ల మీద తనిఖీలు, టోల్‌గేట్ల వద్ద కాకుండా వారానికి శాఖల వారీ అమ్యామ్యాలు అందుతున్నాయి.


తెలంగాణలో సిలికాకు భలే డిమాండ్‌ 

తెలంగాణలో సిలికా శ్యాండ్‌కు భారీ డిమాండ్‌ ఉంది. ఆ ఇసుకను నల్గొండ, మిర్యాలగూడలోని గ్లాసుల తయారీ కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి. సిలికా శాండ్‌ అంటే కట్టడాలకు పనికిరాదని చెబుతుంటారు. ఆ సాకునే అక్రమార్కులు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. తెలంగాణ కంపెనీలకు తరలిస్తున్నామనే పేరుతో మామూలు ఇసుకను తోడేసి అమ్ముతున్నారు. ఇంకొందరు సిలికా ఇసుక పేరుతోనే బిల్లు చేయించి నెల్లూరు, గూడూరు, కడప నుంచి కట్టుబడి ఇసుకను రవాణా చేస్తూ అధికారుల కళ్లు గప్పుతూ లక్షలు ఆర్జిస్తున్నారు.


మాన్యువల్‌ బిల్లుతో మాయాజాలం

నెల్లూరు సమీపంలోని గూడూరు చింతవరం తోపుల్లో మూడు పొరల్లో మూడు రకాల ఇసుక ఉంటుంది. అందులో రెడ్‌ శాండ్‌కు మంచి గిరాకీ ఉంది. ఇలాంటి ఇసుకను తెలంగాణ పేరుతో మార్గమధ్యలోనే కనిగిరితో పాటు జిల్లాలో ఇతర చోట్లా అమ్ముకుంటున్నారు. సిలికాలో ఒకరకం ఇసుకను పూతపనికి వాడతారు. చింతవరంలోని స్టాక్‌ యార్డుల్లో టన్ను రూ.670 అయితే ఇసుక రీచ్‌లలో కేవలం రూ.375లకే ఆన్‌లైన్‌ బిల్లుతో లభిస్తుంది.


ఇదే ఇసుకను టన్ను రూ.2,500 వంతున ఒక ట్రాక్టరులో మూడు టన్నులు రూ.7,500కు అమ్ముతున్నారు. ఒక్కో లారీకి రీచ్‌ల్లో బిల్లు ప్రకారం చెల్లించేది కాకుండా ఇంచుమించు రూ.లక్ష ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ బిల్లు కాదని.. మాన్యువల్‌ బిల్లులు తయారు చేయించి అక్రమ రవాణాకు భారీఎత్తున తెరదీశారు. మాన్యువల్‌ బిల్లుపై తేదీ కాలాన్ని ఖాళీగా ఉంచుతారు. రవాణాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అప్పటికప్పుడు తేదీని వేసి బిల్లును చూపించి తప్పించుకుంటున్నారు. 


ఇసుక లోడింగ్‌ తూకాల్లోనూ మోసాలే

ఇసుక తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారు. 12 టైర్ల టర్బో లారీలో కేవలం 25 టన్నుల మాత్రమే రవాణా చేయాలనేది నిబంధన. అక్రమార్కులు 45 టన్నుల నుంచి 50 టన్నుల వరకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా 14 టైర్ల బండికి 31 టన్నులకు మాత్రమే అనుమతి ఉండగా 60 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు.


ఇటీవల కనిగిరిలో పట్టుకున్న ఇసుక లారీల్లో కూడా తూకాల్లో లెక్కలకు మించి రవాణా చేస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. మాన్యువల్‌ బిల్‌ ద్వారా అన్‌లోడ్‌ కూలీ సహా టన్ను రూ.750 ఉండగా, తెలంగాణకు తరలించకుండానే మార్గమధ్యంలో టన్ను రూ.2వేల లెక్కన అమ్ముకుంటున్నారు. ఈ రకంగా ఒక్కో లారీకి అదనంగా రూ.50వేలు ఆదాయాన్ని పొందుతున్నారు. 


అధికారులకు మామూళ్లు ముట్టజెప్తూ..

నాలుగైదు లారీలు ఉన్నవారే ఇసుక అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. లారీలను తరలించే క్రమంలో 5కి.మీ దూరం ముందుగానే ఓ వ్యక్తి కారులో వస్తూ తనిఖీ అధికారులకు, టోల్‌గేట్‌ల దగ్గర మామూళ్లు ఇస్తారు. లారీల నంబర్లు చెబుతారు. ఆ వాహనాలు రాగానే అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తారు. అందుకుగాను ఐదు వాహనాలకు కలిపి రూ.లక్ష వరకు ముట్టజెబుతారు. ఇక మైనింగ్‌, విజిలెన్స్‌, పోలీస్‌ తదితర శాఖలతోపాటు చెక్‌పోస్టుల వద్ద ఎప్పుడూ ఎలాంటి సమస్య ఎదురవకుండా ఉండేందుకు ఒక్కో లారీకీ, సంబంధం ఉన్న శాఖలన్నింటికీ కలిపి వారానికి రూ.8వేల వంతున ముట్టజెబుతారు.


సిలికా ఇసుక ఇటీవల కనిగిరి ప్రాంతం నుంచి తరలిస్తూ కనిగిరి, పామూరు, కంభం, ఒంగోలు సమీప ప్రాంతాల్లో డంపింగ్‌ చేయించి ఆయా ప్రాంతాల ఇసుక దందాదారులు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఐదు లారీల ఇసుకను అమ్ముకుంటే దాదాపు రూ.5లక్షలు వస్తాయి. ఇందులో మామూళ్లు, ఇతర అన్నిరకాల ఖర్చులు రూ.2లక్షలు ఉంటాయి. అంటే ఒక్కో ట్రిప్పునకు కనీసం రూ.3లక్షలు మిగులుతాయన్న మాట.


కనిగిరి నియోజకవర్గంలోని తవ్వకాల్లోనూ ఇదే తంతు

కనిగిరి ప్రాంతంలోని బొమ్మిరెడ్డపల్లి, తాళ్లూరు, యడవల్లి, చల్లగిరిగల, పునుగోడు, వాగులు, వంకలు నుంచి పీసీపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నేరేళ్లవాగు, వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తూ ఒక్కో ట్రాక్టర్‌ రూ.5వేల లెక్కన అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఒకే బిల్లుపై లెక్కకు మిక్కిలి ట్రిప్పులు వేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అధికారులు ఇటీవల ఒకటి రెండు చోట్ల ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నప్పుడు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో మిన్నకుండిపోయారు.


ఇసుక అక్రమ రవాణాపై గట్టి నిఘా

-ఆర్‌ విజయభాస్కర్‌రావు, ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ కనిగిరి

ఇతర జిల్లాల నుంచి కనిగిరి ప్రాంతంగుండా వెళ్లే ఇసుక అక్రమ రవాణా లారీలపై గట్టి నిఘా ఉంచాం. ఇప్పటికే ఇసుక లారీలను తనిఖీ చేయడంతో తూకాల్లోనూ, అన్‌లోడ్‌ ప్రాంతంల్లోనూ తేడాలు ఉండటంతో వాటిపై కేసులు నమోదు చేశాం. సిలికా శ్యాండ్‌ పేరుతో ఇసుక రవాణా దారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. మైనింగ్‌ అధికారులు సిలికా శ్యాండ్‌కు, మామూలు ఇసుకకు తేడాలను తెలియజేయాలి. సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే రసీదుల్లో ప్రభుత్వం నిబంధనల ప్రకారం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రాంతాల వివరాలను పొందుపరిస్తే అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చు.



Updated Date - 2020-10-20T08:03:11+05:30 IST