గదుల కాషన్‌ డిపాజిట్ల చెల్లింపుల్లో స్కాం

ABN , First Publish Date - 2021-10-20T07:52:05+05:30 IST

శ్రీవారి భక్తులు వసతి గదుల కోసం చెల్లిస్తున్న కాషన్‌ డిపాజిట్ల చెల్లింపుల్లో భారీ స్కాం జరుగుతున్నదని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్‌రాయల్‌ ఆరోపించారు.

గదుల కాషన్‌ డిపాజిట్ల చెల్లింపుల్లో స్కాం
మీడియాతో మాట్లాడుతున్న కిరణ్‌రాయల్‌

జనసేన నేత కిరణ్‌రాయల్‌ ఆరోపణ


తిరుపతి(తిలక్‌రోడ్డు), అక్టోబరు 19: శ్రీవారి భక్తులు వసతి గదుల కోసం చెల్లిస్తున్న కాషన్‌ డిపాజిట్ల చెల్లింపుల్లో భారీ స్కాం జరుగుతున్నదని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్‌రాయల్‌ ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన జనసేన నాయకులు పగడాల మురళి, రాజారెడ్డి, సుమన్‌రాయల్‌, మనోజ్‌, బలరాం, శేషు, రమేష్‌, రాజేష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాషన్‌ డిపాజిట్‌ నగదును టీటీడీ భక్తులకు చెల్లించకుండా సీఎం జగన్‌ ఖజానాకు జమ చేస్తోందని ఆరోపించారు. గతంలో టీటీడీ వసతిగదులకోసం చెల్లిస్తున్న కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని రద్దుచేసిందని, మళ్లీ ఎందుకు ప్రవేశపెట్టిందని ఆయన ప్రశ్నించారు. కాషన్‌ డిపాజిట్‌ విధానం తిరిగి ప్రవేశ పెట్కా భక్తుల నుంచి ఎంత నగదు డిపాజిట్‌ చేయించుకున్నారు..? ఎంత మేరకు తిరిగి భక్తులకు చెల్లించారనే బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను బహిర్గతం చేయాలని ఆయన టీటీడీని డిమాండు చేశారు. టీటీడీలో రోజుకు సూమారు రూ.15లక్షలు భక్తులనుంచి దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. గదుల కాషన్‌ డిపాజిట్‌ సొమ్మును వారం రోజుల్లో భక్తుల ఖాతాకు జమ చేయాలన్నారు. లేదంటే అలిపిరి పాదాలమండపం వద్ద అని పార్టీలు, భక్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని టీటీడీ పాలకమండలి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 


బురదచల్లితే చట్టప్రకారం చర్యలు: టీటీడీ 

కాషన్‌ డిపాజిట్‌ ప్రక్రియపై అవాస్తవ ఆరోపణలు చేసిన తిరుపతి జనసేన నేత కిరణ్‌ రాయల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ‘కాషన్‌ డిపాజిట్‌ నగదు రూపంలో చెల్లించిన వారికి గది ఖాళీ చేసిన వెంటనే అప్పటికప్పుడు నగదు రూపంలో తిరిగి చెల్లిస్తున్నాం. కార్డు ద్వారా చెల్లించిన వారికి బ్యాంకు ఖాతాల జమ చేస్తున్నాం. ఈ విధానంలో భక్తుడు గది ఖాళీ చేసిన 12 గంటల్లో టీటీడీ ప్రాసెస్‌ చేసి ఫెడరల్‌ బ్యాంకుకు సదరు వివరాలు పంపిస్తున్నాం. అదే రోజు ఫెడరల్‌ బ్యాంక్‌ రీఫండ్‌ ప్రాసెస్‌ చేస్తారు. దీనిపై భక్తుల మొబైల్‌కు టీటీడీ నుంచి అదేరోజు మెసెజ్‌ వెళుతుంది. ప్రాసెస్‌ తర్వాత నగదు భక్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాకు జమవుతుంది. బ్యాంక్‌ ఖాతా నుంచి భక్తుల ఖాతాకు నగదు వేయడానికి బ్యాంక్‌ కొంత సమయం తీసుకుంటోంది. అయినా శ్రీవారి భక్తులకు రీఫండ్‌ పొందడంలో ఎలాంటి ఆలస్యం, అసౌకర్యం కలగరాదనే ఉద్దేశంతో ప్రతి పన్నెండు గంటల వ్యవధిలో ప్రాసెస్‌  చేస్తున్నాం. ఒకవేళ భక్తులు తమ కాషన్‌ డిపాజిట్‌ నేరుగా ఇవ్వాలని కోరితే అప్పటికప్పుడు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాం. వాస్తవాలు ఇలా ఉండగా, ఆధార రహితమైన ఆరోపణలు చేసి, సంస్థపై బురదజల్లేలా వ్యవహరించి మీడియాలో ప్రచారం కోసం ప్రయత్నించిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని టీటీడీ హెచ్చరించింది. 

Updated Date - 2021-10-20T07:52:05+05:30 IST