గుంటూరు: పోలీసు వర్గాలను సైతం షాక్‌కు గురి చేసిన.. భారీ చోరీ

ABN , First Publish Date - 2021-08-17T05:43:48+05:30 IST

గుంటూరు నగరంలో..

గుంటూరు: పోలీసు వర్గాలను సైతం షాక్‌కు గురి చేసిన.. భారీ చోరీ
లాకర్‌ను పరిశీలిస్తున్న లాలాపేట సీఐ ప్రభాకర్‌

హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.23 లక్షలు అపహరణ

నగరం నడిబొడ్డున కలకలం రేపిన ఘటన 


గుంటూరు: గుంటూరు నగరంలో జరిగిన భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. ఏకంగా నగరం నడిబోడ్డున ఉన్న బ్యాంకులో గ్యాస్‌కట్టర్‌ సాయంతో ఓ అగంతకుడు సులువుగా చోరీకి పాల్పడటం పోలీసు వర్గాలను సైతం షాక్‌కు గురి చేసింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.23 లక్షల నగదు చోరీకి గురైంది. సంచలనం సృష్టించిన బ్యాంకు చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల పక్కనే ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గాంధీపార్కు బ్రాంచిలో ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి 6.30 గంటల మధ్య భారీ చోరీ జరిగింది. ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించిన సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న అగంతకుడు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో బ్యాంకు ప్రధాన షట్టర్‌కు ఉన్న తాళాన్ని కట్‌చేసి లోనికి ప్రవేశించాడు.


బ్యాంకులో చెక్కతో ఏర్పాటు చేసిన లాకర్‌ రూం గడియను కూడా గ్యాస్‌ కట్టర్‌ సాయంతో తొలగించి లోనికి వెళ్లాడు. ఆ గదిలో లాకర్‌ ఉన్నప్పటికీ నిందితుడికి దానిని తెరిచేందుకు ప్రయత్నించాల్సిన అవసరం రాలేదు. ఆ గదిలో ఉన్న ట్రంకు పెట్టెల్లోని ఓ పెట్టెను గ్యాస్‌ కట్టర్‌ సాయంతో తెరిచాడు. ఆ పెట్టె నిండా రూ.100 నోట్ల కట్టలు పేర్చి ఉండగా ఓ లేయర్‌ కట్టలను తనతోపాటు తెచ్చిన సంచిలో వేసుకున్నాడు. అంనంతరం దర్జాగా వచ్చిన దారినే వెళ్లిపోయాడు. బ్యాంకులోని మిగతా ట్రంకు పెట్టెల్లో ఉన్న నగదు రూ.4 కోట్ల 20 లక్షలకు పైగానే ఉంటుందని బ్యాంకు అధికారులు పోలీసులకు వివరించారు. అయితే నగదును లాకర్‌లో భద్రపరచుకోకుండా ట్రంకు పెట్టెల్లో పెట్టటం అధికారుల నిర్లక్ష్యంగా పోలీసు అధికారులు తేల్చారు. బ్యాంకు మేనేజర్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు లాలాపేట సీఐ ప్రభాకర్‌ బ్యాంకును పరిశీలించారు.


కాగా బ్యాంకు లోపల, వెలుపల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడి కదలికలు స్పష్టంగా కనిపించాయి. అయితే ముఖానికి మాస్కు ధరించి ఉండటంతో నిందితుడిని గుర్తించటం కష్టంగా మారింది. చోరీ జరిగిన సమయంలోనూ సెక్యూరిటీ గార్డు గేటు బయట విధుల్లో ఉండటం గమనార్హం. సాధ్యమైనంత త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని లాలాపేట సీఐ ప్రభాకర్‌ తెలిపారు.


Updated Date - 2021-08-17T05:43:48+05:30 IST