పూర్తిగా దెబ్బతిన్న యనమలకుదురు మెయిన్ రోడ్డు
రహదారులకు ‘నివర్’ దెబ్బ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
నివర్ తుఫాను దెబ్బకు విజయవాడ నగరంలో అంతంత మాత్రంగా ఉన్న అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో గోతులతో ధ్వంసమైన రోడ్లను మట్టితో పూడ్చి, మమ అనిపించటంతో.. రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి కాస్తా కొట్టుకుపోయింది. పెద్ద పెద్ద గోతులతో రహదారులు మృత్యు కోరలు చాస్తున్నాయి. జవహర్ ఆటోనగర్‌లోని వంద అడుగుల రోడ్డు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు బల్లెంవారి వీధి, గుణదల ఈఎస్‌ఐ హాస్పిటల్ రోడ్డు, లబ్బీపేట, కృష్ణలంక, విద్యాధరపురం, కబేళా, పాయకా పురం, సింగ్‌నగర్‌లలోని పలు అంతర్గత రోడ్లు ఇప్పటికే దెబ్బతిన్నాయి. వీటికి శాశ్వత మరమ్మతులు చేయకుండా, గోతులను మట్టితో పూడ్చడంతో వర్షాలకు మళ్లీ అదే స్థితికి చేరుకున్నాయి. వీటికి తోడు నగరంలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, కారల్‌మార్క్స్ రోడ్డు, గాంధీనగర్‌లలోని పలు రహదారులు కుంగిపోయి ఉండటంతో వాటిలో నీరు చేరింది.