రోడ్డు టెర్రర్‌

ABN , First Publish Date - 2021-11-28T05:12:51+05:30 IST

జిల్లాలోని రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. ఒక్క క్షణం ఏమరుపాటు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నది.

రోడ్డు టెర్రర్‌

 - ప్రాణాలను హరిస్తున్న అతివేగం

- నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు

- ఐదేళ్లలో 951 మంది మృత్యువాత

కరీంనగర్‌ క్రైం, నవంబరు 27:  జిల్లాలోని రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. ఒక్క క్షణం ఏమరుపాటు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నది. మానకొండూర్‌ పోలీసు ఠాణా సమీపంలో కరీంనగర్‌-వరంగల్‌ రహదారిపై శుక్రవారం వేకువజామున జరిగిన ప్రమాదం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఉదయం 3:30 గంటల సమయంలో డ్రైవర్‌ నిద్రలేమి, అతివేగం నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట  ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధిక శాతం ప్రమాదాలు మద్యం మత్తులో డ్రైవింగ్‌ వల్ల సంభవిస్తున్నాయి. జిల్లాలో రాజీవ్‌రహదారి, కరీంనగర్‌-వరంగల్‌ రహదారి, జిల్లాపరిషత్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లపై ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో కుటుంబ పెద్ద మరణించిన సందర్భాల్లో ఆయా కుటుంబాలు వీదినపడుతున్నాయి. మానకొండూర్‌ వద్ద ప్రమాదంలో నలుగురు మృత్యువాతకు కారు 120 కీలోమీటర్ల వేగమే కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా పగిలిపోవడం ప్రమాద తీవ్రతను వెల్లడిస్తున్నది. డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా మైనర్లు, లైసెన్స్‌లేని వ్యక్తులు ఆటో, ఇతర వాహనాలను నడుపుతూ తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా వచ్చే వాహనాల వేగాన్ని అంచనా వేయలేరని, వాహనాలదూరాన్ని కూడా గమనించలేరని, ఆ వాహనాలు సమీపంలోకి వచ్చేసరికి హైరానాతో నిస్సహాయస్థితిలో కి వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు విశ్లేసిస్తున్నారు. ట్రాఫిక్‌ కూడళ్లలో సిగ్నల్‌ లైట్లు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా గుర్తించలేని విధంగా మద్యం మత్తు మెదడుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

- పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు

రాజీవ్‌రహదారితో పాటు కరీంనగర్‌-వరంగల్‌ రహదారి, జిల్లాలోని ప్రధాన రహదారులు, రోడ్లను ఆనుకుని పుట్టగొడుగుల్లా బెల్ట్‌ షాపులు, మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తున్న దాబాలు, హోటళ్లు కొనసాగుతున్నాయి. రోడ్లపై అందుబాటులో మద్యం లభిస్తుండడంతో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. దీంతో మద్యం మత్తులో వాహనాలపై అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. బెల్ట్‌ షాపులు, మద్యం సిట్టింగ్‌లపై అటు ఎక్సైజ్‌ శాఖ, ఇటు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించక పోవడంతో మద్యం సిట్టింగ్‌లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ముఖ్యంగా రాజీవ్‌రహదారి, వరంగల్‌ రహదారిపై హోటళ్లు, దాబాలు బార్లను మరపించే విధంగా అన్ని హంగులతో సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. అవగాహన సమావేశాలు, ర్యాలీలతో సరిపెడుతుండడంతో రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు కనిపించటంలేదు. 

ఫప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1.  ప్రయాణంలో అప్నమత్తంగా ఉండాలి.
  2. దూరప్రయాణ సమయంలో రాత్రివేళ నిదుర పోవాలి.
  3. ప్రయాణానికి ముందు ఆహారం తీసుకోవాలి. ఆకలితో వాహనాలు నడపవద్దు.
  4. డ్రైవింగ్‌ సమయంలో మెళకువగా ఉండేందుకు మత్తు పానీయాలు తీసుకోవద్దు
  5. డ్రైవింగ్‌లో ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకోవాలి.
  6. దూరప్రయాణాలు చేసే సందర్భంలో డ్రైవింగ్‌కు మరొకరి సహాయం తీసుకోవాలి.
  7. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయవద్దు.
  8. వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  9. గాలి, వర్షం, రాత్రి సమయం తదితర కారణాలతో వాతావరణం అనుకూలంగా లేనప్పడు వాహనం వేగాన్ని తగ్గించడం లేదా ప్రయాణం నిలిపివేయడం మంచిది.
  10. ప్రయాణం చేసే ముందుగా వాహనం కండిషన్‌ను తనిఖీ చేయాలి.
  11. ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి.

- ప్రమాదాలకు కారణాలు.......

  1.  వాహనదారుల అతివేగం, గంటకు 100 కిలోమీటర్లపైగా నడపడం.
  2. రోడ్డుపై ఉన్న మూలమలుపులను ముందుగా గమనించక పోవడం.
  3. రాత్రి సమయాల్లో కనిపించని హెచ్చరిక బోర్డులు.
  4.  రోడ్డుపైనే వాహనాలు పార్క్‌ చేయడం.
  5. జాతీయ రహదారులపై సర్వీసు రోడ్లు లేక పోవడం.
  6. మద్యం మత్తులో, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం.
  7. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం.
  8. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించకుండా ఓవర్‌టేక్‌ చేయడం.

- గత ఐదేళ్లలో ప్రమాదాలు, మృతుల వివరాలు

-------------------------------------------------------------

సంవత్సరం              ప్రమాదాలు     మరణాలు     క్షతగాత్రులు 

------------------------------------------------------------- 

2017                    672           207          471

2018                    592           213          482 

2019                    557           197          546

2020                    533           183          617

2021 (అక్టోబరు31)    466           151          471 

------------------------------------------------------------- 

 మొత్తం                2,820          951          2,587

------------------------------------------------------------- 

Updated Date - 2021-11-28T05:12:51+05:30 IST