రూ.32 లక్షలతో రహదారులకు మరమ్మతులు

ABN , First Publish Date - 2021-12-27T05:30:00+05:30 IST

రహదారుల మరమ్మతులకు మోక్షం లభించింది. అడుగులోతు గుంతలతో ప్రజలకు నరకం చూపిస్తున్న రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం డీఎంఎ్‌ఫటీ(జిల్లా మినరల్‌ ఫండ్‌) నిధులు రూ.32 లక్షలు విడుదల చేసింది.

రూ.32 లక్షలతో రహదారులకు మరమ్మతులు
నడిగూడెం-రామచంద్రాపురం రహదారిలో కొనసాగుతున్న పనులు

మినరల్‌ ఫండ్‌ నిధులు విడుదల 

నడిగూడెం, డిసెంబరు 27 :  రహదారుల మరమ్మతులకు మోక్షం లభించింది. అడుగులోతు గుంతలతో ప్రజలకు నరకం చూపిస్తున్న రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం డీఎంఎ్‌ఫటీ(జిల్లా మినరల్‌ ఫండ్‌) నిధులు రూ.32 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులతో ఆర్‌అండ్‌బీ అధికారులు కొద్దిరోజులుగా పనులను చేపడుతున్నారు. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు కోతకు గురై ధ్వంసమయ్యాయి. సాంకేతిక అనుమతి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన ఆర్‌అండ్‌బీ శాఖ పనులను వేగవంతం చేసింది. నడిగూడెం నుంచి కాగితరామచంద్రాపురం వరకు 9.5కిలోమీటర్ల ప్రధానరహదారి మరమ్మతులకు రూ.7లక్షలు మంజూరు చేసింది. మట్టితీసి కంకరవేసి వేట్‌మిక్స్‌తో లెవల్‌ చేసి పైనతారుతో మరమ్మతుల పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఆకుపాముల నుంచి తెల్లబెల్లి మీదిగా రత్నవరం వరకు 7.4 కిలోమీటర్లకు రూ.10లక్షలు, తెల్లబెల్లి నుంచి రామపురం, శ్రీరంగాపురం మీదుగా త్రిపురవరం వరకు 11 కిలోమీటర్ల రహదారి మరమ్మతు పనులను రూ.5లక్షలతో చేపడుతున్నారు. వరద కోతకు గురై కొట్టుకుపోయిన చాకిరాల వంతెన మరమ్మతులకు రూ.10లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. పనులను చేపట్టేందుకు ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, సర్పంచ్‌ యాతాకుల వీరస్వామి, ఆర్‌అండ్‌బీ ఏఈ బుడిగే సత్యనారాయణలు ఇప్పటికే పరిశీలించారు. మరమ్మతుల పనులను పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చేపడుతున్నట్లు ఏఈ తెలిపారు.

రూ.24కోట్లతో ప్రతిపాదనలు

ప్రసుత్తం తాత్కాలిక మరమ్మతులు చేపడుతూనే శాశ్వత నిర్మాణాలు పూర్తి చేసేలా వంతెనలు, రహదారుల నిర్మాణానికి రూ22.80కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏఈ బి.సత్యనారాయణ తెలిపారు. వరదలకు కొట్టుకుపోయిన చాకిరాల కల్వర్టు స్థానంలో హైలెవల్‌ వంతెన(హెచ్‌ఎల్‌బీ) నిర్మాణానికి రూ.2.70కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. రత్నవరం వంతెన నిర్మాణానికి రూ.2.60కోట్లు, రత్నవరం నుంచి నడిగూడెం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి రూ.1.50 కోట్లు, 65వ జాతీయరహదారిపై గల బరాఖత్‌గూడెం నుంచి నడిగూడెం మీదుగా కాగిత రామచంద్రాపురం వరకు సుమారు 16కిలోమీటర్ల డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.15కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఏఈ తెలిపారు. ఇదే మార్గాల్లో ప్రస్తుతం మరమ్మతు పనుల కోసం రూ.2.5కోట్లతో ప్రతిపాదించామన్నారు. 

Updated Date - 2021-12-27T05:30:00+05:30 IST