రోడ్డు వేసి నెల.. అంతలోనే ఇలా!

ABN , First Publish Date - 2022-06-27T05:36:36+05:30 IST

మేనెలలో రహదారిని ప్రారంభించారు.. జూన్‌లో ఆ రోడ్డు గోతులు పడటమే కాకుండా రివిట్‌మెంట్‌ కొట్టుకుపోయింది. అధికారులు పర్యవేక్షణలేని కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది.

రోడ్డు వేసి నెల.. అంతలోనే ఇలా!
వర్షానికి కోతకు గురై సగానికి తెగిపోయిన రోడ్డు,

పినపాక, జూన్‌26: మేనెలలో రహదారిని ప్రారంభించారు.. జూన్‌లో ఆ రోడ్డు గోతులు పడటమే కాకుండా రివిట్‌మెంట్‌ కొట్టుకుపోయింది. అధికారులు పర్యవేక్షణలేని కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. రహదారి నాణ్యతపై స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న అధికారులు లేరంటే పరిస్థితి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు...   మండలంలోని పాతరెడ్డిపాలెం గ్రామానికి, చుట్టు పక్కల ఉన్న వెంకట్రావుపేట, ఎల్చిరెడ్డిపల్లి, చింతలబయ్యారం, జగ్గారం, సింగిరెడ్డిపల్లి, మద్దులగూడెం, వెంకటేశ్వరపురం గ్రామాలకు రహదారి లేక దశాబ్ధాలుగా అక్కడి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో  ఏడూళ్లబయ్యారం నుంచి వెంకటేశ్వరపురం వరకు రహదారి నిర్మాణానికి రూ.3.11కోట్లు కేటాయించారు. దీంతో వారి బాధలు పోయాయని ఆనందించారు. సరిగ్గా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, మే నెలలో ప్రారంభించారు. జూన్‌ రానే వచ్చింది. అడపాదడపా తొలకరి చిరుజల్లులు పడ్డాయి. కానీ ఈ రోడ్డు వేశాక గత రాత్రి (శనివారం)కురిసిన ఓ మోస్తరు వర్షానికి రహదారి గుంతలుగా మారింది.  రోడ్డుకిరువైపులా తీసిన భారీ గోతలతో మట్టి నిలవడం కష్టంగా మారింది. బయటి నుంచి తెచ్చిన ఎర్రమట్టి లేదా కంకర పోసి రెండువైపులా రివిటింగ్‌ చేస్తే రోడ్డు పటిష్టంగా ఉంటుందని, అలా కాకుండా అక్కడి మట్టిని అక్కడే యంత్రాల ద్వారా తీసి అక్కడే పోయడం వల్ల నిర్మాణం నాసిరకంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పర్యవేక్షించి ఎలా ఊరకున్నరో వారికే తెలియాలి. ప్రభుత్వ పనుల నిర్వాహణలో కాంట్రాక్టర్ల అలసత్వం, భాద్యతారాహిత్యం ప్రజలకు ప్రమాదాలను తెచ్చి పెడుతోంది. 

 హెచ్చరించినా పట్టించుకోలేదు

  పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ 

 పాతరెడ్డిపాలెం నుంచి వెంకటేశ్వరపురం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పూర్తి నాసిరకంగా ఉందని ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. అక్కడకు వెళ్లి రోడ్డును పరిశీలించాము. వానాకాలం వస్తే ఈ రోడ్డు ఆగదని ముందే చెప్పాం. అధికారులకు కూడా తెలియజేశాం. కాని అధికారులు వచ్చి చూసిన నాధుడే లేడు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగింది. అధికారులు, గుత్తేదారు భాద్యత వహించాలి. చర్యలు చేపట్టాలి. 


Updated Date - 2022-06-27T05:36:36+05:30 IST