నెత్తురోడిన రహదారులు

ABN , First Publish Date - 2022-05-28T07:05:45+05:30 IST

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు.

నెత్తురోడిన రహదారులు

అనకాపల్లి జిల్లాలో నాలుగు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

నర్సీపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం...చెట్టును ఢీకొన్న కారు

ముగ్గురు యువకులు మృతి

నక్కపల్లిలో రెండు ప్రమాదాలు...ముగ్గురు దుర్మరణం

అచ్యుతాపురంలో ఆటో నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి


నర్సీపట్నం/నక్కపల్లి, ఎలమంచిలి, మే 27:


అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 

మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన గెడ్డం లక్ష్మణ్‌, రాచూరి దుర్గాప్రసాద్‌ (22), మైచర్ల గౌరీనాథ్‌, మాకవరపాలెం బీసీ కాలనీకి చెందిన ఎల్లపు నాగేంద్ర (28), కన్నూరు రోహిత్‌ (25) స్నేహితులు. తూర్పు గోదావరి జిల్లా తునిలో స్నేహితుడి వివాహానికి వెళుతున్నామని ఇళ్ల వద్ద చెప్పి గురువారం రాత్రి 8.30 గంటలకు కారులో బయలుదేరారు. వివాహానికి వెళ్లకుండా రాత్రంతా నర్సీపట్నం, మాకవరపాలెం ప్రాంతాల్లోనే తిరిగారు. గౌరీనాథ్‌కు శుక్రవారం తెల్లవారుజామున తండ్రి ఫోన్‌ చేయడంలో ఇళ్లకు వెనుతిరిగారు. అయితే, గురువారం అర్ధరాత్రి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని అప్పన్నదొరపాలెం జంక్షన్‌ సమీపంలో భారీ వృక్షం ప్రధాన రహదారిపైకి ఒరిగింది. కారును నడుపుతున్న గౌరీనాథ్‌ దానిని దూరం నుంచి గమనించలేదు. దగ్గరకు వచ్చేసరికి చూసి కంగారులో వాహనాన్ని కుడి వైపునకు తిప్పగా అక్కడున్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు వెనుక సీట్లో కూర్చున్న నాగేంద్ర, దుర్గాప్రసాద్‌, రోహిత్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. కారుకు అమర్చిన సేఫ్టీ బెలూన్స్‌ తెరుచుకోవడంతో ముందు సీట్లో కూర్చున్న గెడ్డం లక్ష్మణ్‌, డ్రైవింగ్‌ చేస్తున్న మైచర్ల లోక్‌నాథ్‌ గాయాలతో బయటపడ్డారు.  


నక్కపల్లిలో రెండు ప్రమాదాలు

నక్కపల్లి మండలంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన మరడా రమేశ్‌బాబు (37), అదే గ్రామానికి చెందిన తలారి వెంకటేశ్వరమ్మ (31), మరికొందరు కలిసి గురువారం రాత్రి టాటా మ్యాజిక్‌లో సింహాచలం అప్పన్న దర్శనానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై గొడిచెర్ల వద్ద ఆగివున్న లారీని ఢీకొంది. వ్యాన్‌ను డ్రైవ్‌ చేస్తున్న రమేశ్‌బాబు, వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న తలారి సింహాచలం, మరడా అప్పలనాయుడు, గొట్టాపు నాగరాజు, మరడా నవీన్‌, మరడా మంగమ్మ తీవ్రంగా గాయపడ్డారు.  


పుట్టిన రోజునాడే విషాదం...యువకుడి మృతి

నక్కపల్లి ఇసుక ర్యాంపు సమీపాన వ్యాన్‌ను బైక్‌ ఢీకొనడంతో యానాంకు చెందిన జానా సమర్పణరావు కుమారుడు ఆనంద్‌ జయశేఖర్‌రెడ్డి (20) మృతిచెందాడు. ఎయిర్‌ఫోర్స్‌ విభాగానికి సంబంధించి విశాఖలో కోచింగ్‌ తీసుకుంటున్న జయశేఖర్‌రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకునేందుకు తన మేనల్లుడు రాజశేఖర్‌తో కలిసి బైక్‌పై యానాం బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా వున్న హైవే జంక్షన్‌ వద్ద పక్కనే ఆగివున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో జయశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ఆనంద్‌ తల్లి భవానీ, తండ్రి సమర్పణరావు, చెల్లి జ్యోతి అక్కడకు చేరుకున్నారు. పుట్టిన రోజు నాడే కుమారుడు తమకు దూరం కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.  


ఆటో నుంచి జారిపడి తాపీ మేస్ర్తీ మృతి

అచ్యుతాపురం మండలంలో ఆటో నుంచి జారిపడి ఒకరు మృతిచెందారు. యానాంకి చెందిన పోతాబత్తుల పోసయ్య (38) ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో నివాసం వుంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గురువారం పూడిమడకలో జరిగిన గ్రామదేవత గంటాలమ్మ పండగను పురస్కరించుకుని బంధువుల ఇంటికి వచ్చాడు. ఉత్సవం ముగిసిన తరువాత ఆటో ఎక్కి డ్రైవర్‌ పక్కన కూర్చుని అచ్యుతాపురం బయలుదేరాడు. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు వచ్చే సరికి పోసయ్య ఆటో నుంచి జారి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  

Updated Date - 2022-05-28T07:05:45+05:30 IST