పరీక్ష రాయడానికి వచ్చి..

ABN , First Publish Date - 2022-09-26T06:32:42+05:30 IST

పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి బైక్‌పై బయలుదేరిన విద్యార్థినిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

పరీక్ష రాయడానికి వచ్చి..
ముద్దాల కేశవి (ఫైల్‌ ఫోటో)

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

తండ్రికి తీవ్ర గాయాలు

అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే దుర్ఘటన


కూర్మన్నపాలెం, సెప్టెంబరు 25:

పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి బైక్‌పై బయలుదేరిన విద్యార్థినిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం కూర్మన్నపాలెంలో జరిగింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మట్టవానిపేట గ్రామానికి చెందిన రైతు ముద్దాల గోపాలరావు తన చిన్న కుమార్తె కేశవి (13)తో కలిసి శనివారం రాత్రి అగనంపూడి సమీపంలోని కొత్తూరులో వున్న బావమరిది పంగ సింహాచలం ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం కేశవికి ఆటోనగర్‌లోని బెటమిష్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వద్ద పీఎంవైఏఎస్‌ఏఎస్‌ఏఐ ఎంట్రన్స్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు ఉంది. దీంతో బావమరిది బైక్‌ తీసుకుని కేశవితో ఆటోనగర్‌కు బయలుదేరారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆటోను డ్రైవర్‌ షడన్‌గా నిలిపివేశాడు. దీంతో గోపాలరావు ఆటోను క్రాస్‌ చేసేందుకు బైక్‌ను కుడిపక్కకు తిప్పారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌ వెనక కూర్చున్న కేశవి రోడ్డుపై పడింది. లారీ చిన్నారి తలపైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. గోపాలరావుకు తీవ్ర గాయాలయ్యాయి. 


తండ్రి కళ్లముందే ఘోరం..

కాగా అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో తండ్రి  కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులకు కంటతడి తెప్పించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేశవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు, గోపాలరావును ఆస్పత్రికి తరలించారు. కేశవి కరవంజి ఏపీ మోడల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-26T06:32:42+05:30 IST