రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం డీటీ మృతి

ABN , First Publish Date - 2022-05-21T06:41:49+05:30 IST

అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 16వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం డీటీ మృతి
ప్రమాదానికి గురైన వాహనం, మృతిచెందిన శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్‌ సతీశ్‌ (ఫైల్‌ ఫొటో)

మరో నలుగురు రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర గాయాలు

శంకరం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ పిల్లర్‌ను ఢీకొని బోల్తాపడిన వాహనం 


అనకాపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 16వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్‌ సతీశ్‌ (55) మృతిచెందగా, మరో నలుగురు రెవెన్యూ ఉద్యోగులు, డ్రైవర్‌ గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్‌ సతీశ్‌, రూరల్‌ తహసీల్దార్‌ వెంకటరావు, డిప్యూటీ తహసీల్దార్లు మస్కా శ్రీకాంత్‌, శ్రీహరిలు గురువారం రాత్రి 9.30 గంటలకు శ్రీకాకుళం నుంచి ఇన్నోవాలో విజయవాడ బయలుదేరారు. ఆనందపురం వద్ద ఆ మండల సర్వేయర్‌ ఉరిటి సూర్యభగవాన్‌ వాహనం ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం పెందుర్తి మీదుగా అర్ధరాత్రి 1.30 గంటలకు శంకరం వద్దకు చేరుకుంది. అక్కడ  జాతీయ రహదారి నుంచి సింగిల్‌ రోడ్డులోకి వెళ్లాల్సిన వాహనం మరో మార్గంలో దూసుకువెళ్లి నిర్మాణంలో ఉన్న కల్వర్టు పిల్లర్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎస్‌.సతీశ్‌ (55) తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు, జాతీయ రహదారి భద్రతా సిబ్బంది విశాఖపట్నంలోని ఆరిలోవలో గల అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ శ్రీకాకుళం రూరల్‌ తహసీల్దార్‌ వెంకటరావుతో పాటు ఇద్దరు డీటీలు శ్రీకాంత్‌, శ్రీహరి, సర్వేయర్‌ సూర్యభగవాన్‌, డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సునీల్‌, ట్రాఫిక్‌ సీఐ ప్రసాదరావు పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ నరసింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీశ్‌ మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌లో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్వాహకులు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. 

Updated Date - 2022-05-21T06:41:49+05:30 IST