వృషభానికి కర్మక్రియలు

ABN , First Publish Date - 2022-02-10T06:54:32+05:30 IST

తన ఇంటనున్న జంట వృషభాలను కుటుంబ సభ్యులుగా భావించారా రైతు. ఎంతో అభిమానం చూపారు.

వృషభానికి కర్మక్రియలు

రామచంద్రాపురం, ఫిబ్రవరి 9: తన ఇంటనున్న జంట వృషభాలను కుటుంబ సభ్యులుగా భావించారా రైతు. ఎంతో అభిమానం చూపారు. వీటిలో ఒక ఎద్దు చనిపోగా.. బుధవారం శాస్త్రోక్తంగా కర్మక్రియలు జరిపించారు. ఈ ఘటన రామచంద్రాపురం మండలం చిటత్తూరులో చోటుచేసుకుంది. గ్రామంలోని రైతు శివషణ్ముగం పదేళ్లుగా జంట ఎద్దులను వ్యవసాయ పనులకు ఉపయోగించకుండా జల్లికట్టుకోసం పోషిస్తున్నారు. వీటికి పెద్దశివుడు, చిన్నశివుడని పేరు పెట్టారు. సంక్రాంతి సందర్భంగా జరిగే జల్లికట్టుకోసం తమిళనాడు, కర్ణాటకకూ వీటిని తీసుకెళ్లేవారు. ఇటీవల తమిళనాడువాసులు జల్లికట్టుకోసం రూ.5లక్షలకు విక్రయించమని కోరినా ఇవ్వలేదు. గత నెల 30న వెదురుకుప్పం మండలం చిన్నకోడుజనం గ్రామంలో జరిగిన జల్లికట్టుకు జంట ఎద్దులను తీసుకెళ్లారు. ఈ జల్లికట్టులో చిన్నశివుడు ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకుని వచ్చే క్రమంలో గ్రామ సమీపంలోని నీటిగుంటలో పడి మృతి చెందింది. అదే రోజు మేళతాలాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. 11వ రోజైన బుధవారం బంధువులతో కలిసి శాస్త్రోక్తంగా కర్మక్రియలు నిర్వహించారు. అన్నదానం చేశారు. చిన్నశివుడికి పందిరి ఏర్పాటుచేసి నివాళులర్పించారు. 

Updated Date - 2022-02-10T06:54:32+05:30 IST