అగ్గి పుడితే..అంతే!

ABN , First Publish Date - 2021-04-07T05:36:30+05:30 IST

...ఇలా జిల్లాలో ఏటా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. అంతే స్థాయిలో ఆస్తినష్టం సంభవిస్తోంది. వేసవి ముదురుతుండడం... ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎక్కడైనా చిన్నపాటి నిప్పు పుడుతున్నా... పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు వ్యాపించి భారీ నష్టాలకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి ప్రారంభంలోనే అగ్నిప్రమాదాలు పంజా విసురుతున్నాయి.

అగ్గి పుడితే..అంతే!
హిరమండలం: లోకొండలో కాలిపోతున్న జీడి,మామిడి తోటలు


జిల్లాలో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు

మూడు నెలల వ్యవధిలో 67 ఘటనలు

కోట్లాది రూపాయల ఆస్తి నష్టం

సరిపడా లేని అగ్నిమాపక వాహనాలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

అమలుకాని ఎన్‌ఎఫ్‌ఏసీ నిబంధనలు

నష్టపోతున్న బాధితులు

(మెళియాపుట్టి)

- మెళియాపుట్టి మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. వరికుప్పలు దగ్ధమయ్యాయి. కొత్తూరు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారమందించారు . అక్కడి నుంచి వాహనం వచ్చేలోగా వరి కుప్పలు మొత్తం కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక వాహనం సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా మీదుగా బాధిత గ్రామానికి చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

- నరసన్నపేట పాత బస్టాండ్‌ సమీపంలో నాలుగు రోజుల కిందట ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నిప్పులు ఎగసిపడ్డాయి. అదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో అక్కడ ఉన్న చెత్త, వ్యర్థాలకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో సమీపంలోని గృహోపకరణాల షాపునకు వ్యాపించడంతో నిమిషాల వ్యవధిలోనే దుకాణం కాలిపోయింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. 

- హిరమండలం మండలం లోకొండ గిరిజన గ్రామంలో గత నెలలో 150 ఎకరాల్లో జీడి, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. పోడు వ్యవసాయంలో భాగంగా నిప్పుపెట్టగా మంటలు వ్యాపించాయి. కొండ శిఖర ప్రాంతం కావడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఫలితంగా గిరిజనుల అటవీ ఉత్పత్తులైన కొండ చీపుర్లు, ఇతర పంటలు అగ్నికి ఆహుతయ్యాయి.

...ఇలా జిల్లాలో ఏటా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. అంతే స్థాయిలో ఆస్తినష్టం సంభవిస్తోంది. వేసవి ముదురుతుండడం... ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎక్కడైనా చిన్నపాటి నిప్పు పుడుతున్నా... పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు వ్యాపించి భారీ నష్టాలకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి ప్రారంభంలోనే అగ్నిప్రమాదాలు పంజా విసురుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు అగ్నిమాపక కార్యాలయాలు, వాహనాలు, సిబ్బంది జిల్లాలో లేకపోవడంతో ప్రమాదాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. గత ఏడాది 99 అగ్నిప్రమాదాలు సంభవించాయి. రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే 67 ప్రమాదాలు సంభవించాయి. కోటి 80 లక్షల ఆస్తి నష్టం జరిగింది. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 12 అగ్నిమాపక స్టేషన్లు, రెండు అవుట్‌ పోస్టులు ఉన్నాయి. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరు, పాలకొండ, రాజాంలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. పొందూరు, మందసలో అవుట్‌ పోస్టు ఫైర్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రతి 50 వేల మందికి ఒక ఫైర్‌స్టేషన్‌ ఉండాలని నిబంధన ఉంది. ఈ లెక్కన మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేయాలి. కానీ ఒక్క ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో మాత్రమే రెండు చొప్పున ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో అవుట్‌పోస్టు ఫైర్‌స్టేషన్లతో కలిపి రెండు చొప్పున ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున మాత్రమే  ఉన్నాయి. ప్రమాదాలు సంభవించే సమయంలో అగ్నిమాపక వాహనాలు సకాలంలో ఘటనాస్థలానికి చేరకపోవడం వల్ల బాధితులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గం భౌగోళికపరంగా పెద్దది. కొత్తూరులో ఉన్న వాహనం మెళియాపుట్టి, పాతపట్నం చేరుకోవాలంటే ఒడిశా దాటుకొని రావాలి. గంటల వ్యవధి పడుతోంది. పాతపట్నంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్న హామీ ఎప్పటి నుంచో ఉంది. కానీ కార్యరూపం దాల్చడం లేదు. 


 ఒడిశాపైనే ఆధారం

భారీ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఒడిశాపై ఆధారపడాల్సి వస్తోంది. సరిహద్దు మండలాలైన పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి అగ్నిమాపక శాఖ అధికారులు పక్కనే ఉన్న గజపతి, గంజాం జిల్లా అధికారులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఒడిశాలో పనిభారంతో ఉండే వారు ఒక్కోసారి వీలును బట్టి వాహనాలను పంపిస్తుంటారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు సైతం ఒడిశా సాయం కీలకమవుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్నిమాపక కార్యాలయాలు, వాహనాలు అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది. 


ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం

గత ఏడాది కంటే అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే అగ్నిప్రమాదాలపై అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించాం. కొత్త ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలున్నాయి. ఇందుకు సంబంధించి నివేదిక అందించాం.

-కృపావరం, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి





Updated Date - 2021-04-07T05:36:30+05:30 IST