‘చీటి’ంగ్‌!

ABN , First Publish Date - 2021-12-09T04:59:00+05:30 IST

జిల్లాలో చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ సంస్థలు, ట్రేడ్‌ కంపెనీలు, కోఆపరేటివ్‌ సొసైటీల మాటున ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. ఎక్కడో ఓ చోట ఈ మోసాలు జరుగుతున్నా... ప్రజల్లో మార్పు రావడం లేదు. అత్యధిక వడ్డీ వస్తుందని ఆశపడి డిపాజిట్లు చేస్తున్నారు. నిలువునా మోసపోతున్నారు. పిల్లల చదువులు, వివాహాలు, భవిష్యత్‌ అవసరాలకు ఉంచుకున్న నగదును డిపాజిట్ల రూపంలో చెల్లించి పోగొట్టుకుంటున్నారు.

‘చీటి’ంగ్‌!

- జిల్లాలో పెరుగుతున్న ఆర్థిక మోసాలు

-డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు

- నిలువుదోపిడీకి గురవుతున్న బాధితులు

- కానరాని రికవరీలు

(రణస్థలం)  

- 2017 నవంబరులో సంతకవిటి మండలంలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన ఇండిట్రేడ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు టంకాల శ్రీరామ్‌ బోర్డు తిప్పేశాడు. అధిక వడ్డీ ఆశచూపి ఖాతాదారులకు కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టాడు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యాధికులు ఉండడం విశేషం.

- అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కంపెనీలు జిల్లాలో వందల కోట్ల రూపాయలను డిపాజిట్లుగా వసూలు చేసి మోసం చేశాయి. ఖాతాదారులను చేర్పించిన ఏజెంట్లు నిలువునా మోసపోయారు. అందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

- గత ఏడాది పైడిభీమవరం గ్రామానికి చెందిన ఒక మహిళ అధిక వడ్డీ ఆశ చూపి.. చుట్టు పక్కల గ్రామాల్లో రూ.10కోట్లకుపైగా వసూలు చేసి పరారైంది. ఆమెపై పోలీసు కేసు నమోదైంది. కానీ, బాధితులకు నగదు తిరిగి అందలేదు.

- రణస్థలం మండల కేంద్రానికి చెందిన మరో ఇద్దరు చీటీల పేరుతో రూ.కోట్లలో వసూలు చేసి.. ప్రజలను మోసగించారు.  

- ఈ ఏడాది జూన్‌లో నరసన్నపేటకు చెందిన కోరాడ గణేష్‌ చీటీల పేరుతో రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. 37మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించగా.. ఇటీవల విచారణ మొదలైంది.

- గత నెల 26న ఎచ్చెర్లకు చెందిన మడ్డి నాగేశ్వరరావు సరికొత్త యాప్‌తో ఖాతాదారులను ఆకర్షించాడు. అత్యధిక వడ్డీ చెల్లిస్తానని ఆశచూపి వందలాది మంది బాధితుల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. కుటుంబంతో కలిసి ఉడాయించాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు.  

- చిరు వ్యాపారులు, కార్మికుల నుంచి రోజువారీ డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన ముద్ర కోఆపరేటివ్‌ సొసైటీ కంపెనీ కూడా పత్తా లేకుండా పోయింది. లక్షలాది రూపాయలు వసూలు చేసి శ్రమజీవులను నిలువునా దోచుకుంది.

... ఇలా జిల్లాలో చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ సంస్థలు, ట్రేడ్‌ కంపెనీలు, కోఆపరేటివ్‌ సొసైటీల మాటున ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. ఎక్కడో ఓ చోట ఈ మోసాలు జరుగుతున్నా... ప్రజల్లో మార్పు రావడం లేదు. అత్యధిక వడ్డీ వస్తుందని ఆశపడి డిపాజిట్లు చేస్తున్నారు. నిలువునా మోసపోతున్నారు. పిల్లల చదువులు, వివాహాలు, భవిష్యత్‌ అవసరాలకు ఉంచుకున్న నగదును డిపాజిట్ల రూపంలో చెల్లించి పోగొట్టుకుంటున్నారు. కొందరు ఉన్న ఇళ్లను కుదువపెట్టి మరీ చెల్లిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు పీఎఫ్‌, గ్రాడ్యూటీ సొమ్మును సైతం డ్రా చేసి పెట్టుబడిగా పెడుతున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు వచ్చిన నగదును డిపాజిట్లకే మళ్లిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన ఘటనల్లో ఎక్కువ మంది బాధితులు ఉద్యోగులు, విద్యాధికులు ఉండడం గమనార్హం. 


అనుమతి లేకుండా..

జిల్లాలో చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో అనుమతి ఉన్నది కొన్నింటికే. మిగతావి అన్నీ బోగస్‌. ప్రజల అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చిట్‌ఫండ్‌ నిర్వాహకులు నిలువునా మోసగిస్తున్నారు. చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం సంస్థ ఏర్పాటుకు రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి. నిర్దిష్ట ప్రమాణపత్రాలు సమర్పించి చిట్‌ఫండ్‌ సంస్థ నిర్వహించాలి. అనుమతించిన పరిమిత నగదు వరకే లావాదేవీలు సాగించాలి. దానికి మించి డిపాజిట్లు సేకరించకూడదు. చిట్‌ఫండ్‌ నిర్వాహకుడు మరో వ్యాపారం చేయకూడదన్న నిబంధన కూడా ఉంది. కానీ జిల్లాలో ఇవి అమలవుతున్న దాఖలాలు లేవు. స్థానికంగా పేరుండి, వ్యాపారాలు చేసేవారే చిట్‌ఫండ్‌ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌ఐసీలు, ఇతర బీమా సంస్థల్లో పనిచేస్తున్న వారు బినామీలతో నడుపుతున్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడి.. ప్రజలను దోచుకుంటున్నారు. మోసం జరిగాక ప్రభుత్వం, పోలీసులు స్పందిస్తున్నాయి. అప్పటికే ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ వంటి దర్యాప్తు సంస్థలకు కేసులను అప్పగిస్తున్నారు. ఏళ్ల తరబడి విచారణ సాగుతున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. జిల్లాలో ఇండిట్రేడ్‌తో పాటు చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ సంస్థల మోసాలకు సంబంధించి నిందితుల నుంచి ఎటువంటి రికవరీ జరగడం లేదు. అసలు జిల్లాలో రిజిస్టర్‌ చిట్‌ఫండ్‌ సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాటిలో లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? లోటుపాట్లు  విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే మోసాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. కానీ ఆ ప్రయత్నమే జరగడం లేదు. ఖాతాదారులు కూడా చిట్‌పండ్‌ నిర్వాహకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ రిజిస్టర్డ్‌ కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. నిర్వాహకుడి ఆరోగ్యం, కుటుంబ స్థితిగతులు, వ్యవహార శైలిని గమనించే డిపాజిట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 


అప్రమత్తంగా ఉండాలి

ఆర్థిక నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చీటీలు కట్టేటప్పుడు సంస్థ రిజిస్టర్‌ కంపెనీనా లేదా అన్నది చూసుకోవాలి. అత్యధిక వడ్డీ సాధ్యమేనా అన్నది ఆలోచించుకోవాలి. ప్రభుత్వ బీమా, పొదుపు సంస్థల్లోనే వీలైనంత వరకు డిపాజిట్లు పెట్టాలి. ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన పెంచాల్సిన అవసరముంది.

- ఎస్‌ఐ రాజేష్‌,  జేఆర్‌ పురం

Updated Date - 2021-12-09T04:59:00+05:30 IST