Britain PM Race : నా విజయావకాశాలు సన్నగిల్లాయి : రుషి సునక్

ABN , First Publish Date - 2022-07-29T19:07:52+05:30 IST

బ్రిటన్‌ (Britain)లోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా,

Britain PM Race : నా విజయావకాశాలు సన్నగిల్లాయి : రుషి సునక్

లండన్ : బ్రిటన్‌ (Britain)లోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ఆ దేశ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యేందుకు జరుగుతున్న పోరులో తాను వెనుకబడినట్లు రుషి సునక్ (Rishi Sunak) అంగీకరించారు. అయితే ప్రతి ఓటును సంపాదించేందుకు పోరాటాన్ని కొనసాగిస్తానని శపథం చేశారు. ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ (Liz Truss) ఇచ్చిన హామీ ఈ పరిస్థితికి దారి తీసింది. 


వ్యక్తిగత పన్నుల్లో కోతపై రుషి సునక్, లిజ్ ట్రుస్ పరస్పర వ్యతిరేకంగా మాట్లాడారు. రుషి సునక్ ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా వివరించి, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే వరకు వ్యక్తిగత పన్నుల్లో కోత విధించే ప్రసక్తే లేదని చెప్పారు. కానీ ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ తనను గెలిపిస్తే, ప్రధాన మంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే వ్యక్తిగత పన్నుల్లో కోతను విధిస్తానని హామీ ఇచ్చారు. 


వ్యక్తిగత పన్నుల్లో కోత విధించబోనని తాను చెప్పడం సార్వజనీనంగా ప్రజల ఆదరణకు నోచుకోలేదని రుషి సునక్ అంగీకరించారు. తన మాటలు తన విజయావకాశాలను ప్రభావితం చేసినప్పటికీ, నిజాయితీగా చేయవలసినది అదేనని చెప్పారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈశాన్య ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో గురువారం రాత్రి జరిగిన సభలో లిజ్ ట్రుస్ మాట్లాడినపుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత కనిపించింది. బ్రిటన్ పన్నుల విధానం చాలా సంక్లిష్టంగా ఉందని, కుటుంబాలకు అనుకూలంగా, న్యాయంగా ఉండేవిధంగా దీనిని సవరించాలని అన్నారు. దీనిని తాను పూర్తిగా సమీక్షిస్తానని చెప్పారు. 


డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలేస్ ప్రధాన మంత్రి అభ్యర్థి లిజ్ ట్రుస్‌కు మద్దతు ప్రకటించడంతో ఆమె విజయావకాశాలు మెరుగుపడ్డాయని బ్రిటన్ మీడియా చెప్తోంది. మంత్రి పదవికి రుషి సునక్ రాజీనామా చేసి, బోరిస్ జాన్సన్ పతనానికి దోహదపడటం చాలా తప్పు అని బెన్ వాలేస్ చెప్తున్నారు. 


లిజ్ ట్రుస్ బాగా ముందంజలో కనిపిస్తుండటంతో తన విజయావకాశాలను మెరుగుపరచుకోవడం కోసం రుషి కృషి చేస్తున్నారు. వీరిరువురు దేశవ్యాప్తంగా అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు దాదాపు 1,75,000 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఎన్నికల ఫలితాలను సెప్టెంబరు 5న ప్రకటిస్తారు. 


ఈ పోటీలో తాను వెనుకబడి ఉన్నట్లు పోల్స్ చెప్తున్నాయని తనకు తెలుసునని రుషి సునక్ చెప్పారు. ‘‘మీ అందరి మద్దతును కోరుతున్నాను. ప్రతి ఓటు కోసం నేను పోరాడతానని మీకు మాట ఇస్తున్నాను’’ అని చెప్పారు. లిజ్ ట్రుస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఖర్చులను తగ్గించకుండా పన్నుల్లో కోతలు విధించడం బాధ్యతాయుతమైన చర్య కాదని, అది కచ్చితంగా కన్జర్వేటివ్ విధానం కాదని అన్నారు. 


దీనిపై లిజ్ ట్రుస్ స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితి సాధారణంగా లేదన్నారు. జాతీయ బీమాలో పెంపును తొలగిస్తానని, కార్పొరేట్ పన్నులను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆమెకు మద్దతుదారులు పెరిగారు. 


Updated Date - 2022-07-29T19:07:52+05:30 IST