ఎస్సీ కార్పొరేషన్‌లో రిక‘వర్రీ’

ABN , First Publish Date - 2022-08-07T06:28:48+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌లో రికవరీ రచ్చ కొనసాగుతోంది. వసూళ్లలో మాయాజాలం వెలుగుచూస్తోంది. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో కదిలిన అధికారులు రుణాలు పొందిన లబ్ధిదారులకు, హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోటీసులు ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

ఎస్సీ కార్పొరేషన్‌లో రిక‘వర్రీ’

బకాయిల వసూళ్లలో భారీ అవినీతి

ఎంత చెల్లించారో తెలియని పరిస్థితి

రూ.40లక్షల సొమ్ము ఎవరు కట్టారో కూడా చెప్పలేకపోతున్న అధికారులు

లబ్ధిదారుల పూర్తి వివరాలూ లేని వైనం

విచారణకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశం 

నేడోరేపో రంగంలోకి జాయింట్‌ కలెక్టర్‌ 

ఎస్సీ కార్పొరేషన్‌లో రికవరీ రచ్చ కొనసాగుతోంది. వసూళ్లలో మాయాజాలం వెలుగుచూస్తోంది. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో కదిలిన అధికారులు రుణాలు పొందిన లబ్ధిదారులకు, హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోటీసులు ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అన్నట్లుగా లబ్ధిదారులు అనేకమంది ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయానికి క్యూకట్టారు. తాము డబ్బులు చెల్లించామంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఆ మొత్తం కార్యాలయానికి జమకాలేదని చెప్పటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బకాయిల కోసం వెళ్లిన ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగి వసూలు చేసిన మొత్తం కార్యాలయ ఖాతాకు జమచేయలేదని అధికారులు గుర్తించారు. ఇలా వసూళ్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని లబ్ధిదారులు అంటున్నారు. 

ఒంగోలు నగరం, ఆగస్టు 6 : ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు పొందిన లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన బకాయిలపై అనిశ్చితి నెలకొంది. రికవరీ ఉద్యోగులు ఇటు లబ్ధిదారులను, అటు కార్పొరేషన్‌ను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఏ బకాయిదారుడు ఎంత చెల్లించాడు.. అందుకు సంబంధించిన రసీదులు వారికి కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చారా? ఇస్తే అవి ఒరిజనలా లేక రికవరీ కోసం వెళ్లిన ఉద్యోగులు ఇచ్చిన బోగస్‌వా? అన్న విషయాలను తేల్చేపనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. దీనిపై ఇప్పటివరకు కార్పొరేషన్‌ అధికారుల నుంచి స్పష్టత కరువైంది.


వసూలు కావాల్సింది రూ.18 కోట్లు

ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ను ఏమాత్రం పట్టించుకోకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన రుణాలను వసూలు చేయడంపై మాత్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల క్రితం  లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందజేశారు.  కార్పొరేషన్‌ ద్వారా కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ యూనిట్లు, టెంట్‌ హౌస్‌లు, మెడికల్‌ ఏజెన్సీలు, జిరాక్స్‌ సెంటర్లు వంటివి లబ్ధిదారులకు అందజేశారు.  వీటిని తిరిగి రాబట్టాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు లబ్ధిదా రులపై ఒత్తిడి పెంచారు. ఎప్పుడైతే  హామీదారులకు నోటీసులు పంపించారో వారు రుణగ్రహీతలపై ఒత్తిడి పెంచారు. రుణగ్రహీతలు కార్పొరేషన్‌ నుంచి వసూళ్లకు వచ్చిన మురళీమోహన్‌ అనే ఉద్యోగికి తాము ఉన్న బకాయిల్లో ఎంతో కొంత చెల్లించారు. కొంతమంది  అయితే మురళీ మోహన్‌కు ఫోన్‌పే ద్వారా పంపారు. అయితే అతను ఇచ్చిన రసీదులు సరైనవో కాదో ఇప్పటివరకు కార్పొరేషన్‌ అధికారులు ధ్రువీకరించలేక పోతున్నారు.


ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగికి రికవరీ బాధ్యతలా?

ఎస్సీ కార్పొరేషన్‌లో పరిస్థితి విడ్డూరంగా ఉంది. ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి కోట్ల రూపాయల బకాయిల వసూలు బాధ్యతలను అప్పగించడం ఆ శాఖ అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. పైగా మురళీమోహన్‌పై 2019లో ఎన్‌జీపాడు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. రుణం ఇప్పిస్తానని ఒక నిరుద్యోగి నుంచి డబ్బులు తీసుకుని కార్పొరేషన్‌ నుంచి రుణం అందకపోయేసరికి బాధితుడు ఎన్‌జీపాడులో కేసు పెట్టారు. ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తికి బకాయిల వసూలు బాధ్యత అప్పగించారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చి లబ్ధిదారుల ఇళ్లకు పంపించారు. ఇదే అదునుగా అతను వసూలు చేసిన సొమ్మును కార్యాలయానికి జమచేయకుండా సొంతానికి వాడేసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. మురళీమోహన్‌ ఒత్తిడిని తట్టుకోలేక అతని ఫోన్‌ పేకు డబ్బులు పంపిన వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉందని లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. 


ఈడీల చేతిలో పావుగా ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగి

ఒక ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించటం వెనుక కార్పొరేషన్‌లో ఇప్పటివరకు ఈడీలుగా పనిచేసిన వారి స్వార్థం కూడా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈడీలు వారి అవినీతికి యథేచ్ఛగా సాగించేందుకు మురళీమోహన్‌ను పావుగా ఉపయోగించుకున్నారన్నది ప్రధాన విమర్శ. వాస్తవానికి మురళీమోహన్‌ చేసిన అక్రమాలు గతంలోనే రుజువయ్యాయి. పైగా ఎన్‌జీపాడు స్టేషన్‌లో కేసు నమోదైనప్పుడు ప్రభుత్వం అప్పట్లోనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. అయితే మురళీమోహన్‌ తనకు ఏమాత్రం నోటీసు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మరోసారి పరిశీలించాలంటూ అధికారులకు సూచించింది. అంతే ఏమాత్రం చర్యలు చేపట్టకుండా అతనిని ఇప్పటివరకూ కొనసాగిస్తూనే ఉన్నారు. కార్పొరేషన్‌లో రెగ్యులర్‌ ఉద్యోగులను కాదని కీలకమైన పనులు అతనితోనే చేయించుకుంటూ ఈడీలు పబ్బం గడుపుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈడీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈడీకి తన ఫోన్‌పే ద్వారా పలుమార్లు డబ్బులు పంపినట్లు మురళీమోహన్‌ స్వయంగా మీడియా సమావేశంలోనే ఆరోపించారు. 


రూ.40లక్షలు ఎవరు కట్టారో కూడా లెక్కలు లేవు..

ప్రస్తుతం కార్పొరేషన్‌కు సంబంధించి రికవరీ బ్యాంకు ఖాతాల్లో రూ.40లక్షల సొమ్ము ఉంది. అధికారులు మీ వద్దకు వచ్చే కార్పొరేషన్‌ ప్రతినిధికి కానీ, లేదా బ్యాంకు ఖాతాకు కానీ నేరుగా డబ్బులు జమచేయాలని ఖాతా నంబర్‌ను కూడా పత్రికా ముఖంగా లబ్ధిదారులకు తెలియజేశారు. బకాయిదారులు ఈ బ్యాంకు ఖాతాకు కూడా చెల్లించారు. ఏ బకాయిదారుడు ఎంత మొత్తం బ్యాంకు ఖాతాకు రుణం చెల్లించాడు అనే వివరాలు కూడా కార్పొరేషన్‌ అధికారుల వద్ద లేవు. బ్యాంకులో మాత్రం రూ.40లక్షల డబ్బు రికవరీ ఖాతాలో జమపడి ఉంది. బ్యాంకులో డబ్బులు చెల్లించినవారు తమ రసీదులు కార్పొరేషన్‌ కార్యాలయంలో చూపించాలంటూ అధికారులు ఇంతవరకూ ఏనాడూ కోరలేదు. 


రుణాలు రికవరీ అయ్యేనా...?

కార్పొరేషన్‌కు ప్రస్తుతం లబ్ధిదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు వారు చెల్లించిన డబ్బులకు లెక్కలు లేవు. వారు ఎంతకట్టారో.. కార్పొరేషన్‌కు ఎంత జమైందో కూడా తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. లబ్ధిదారుల వద్దకు వెళ్లి రుణాలు చెల్లించమంటే ముందు మేము కట్టిన వాటికి లెక్కలు చూపించండి అని అడిగే పరిస్థితి ఉంది. ఇలా కార్పొరేషన్‌లో రికవరీ అంతా గందరగోళంగా మారింది. రుణాలు పొందిన లబ్ధిదారుల పూర్తి వివరాలు కూడా కార్పొరేషన్‌ అధికారుల వద్ద లేవంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


విచారణాధికారిగా జేసీ

 కార్పొరేషన్‌లో రుణాల రికవరీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అందులో కార్పొరేషన్‌ కార్యాలయంలో అవినీతి, అక్రమాలను పూర్తిస్థాయిలో వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మురళీమోహన్‌తోపాటు కార్యాలయంలో ఇంకా అవినీతికి పాల్పడిన వారి బాగోతం కూడా బయటపడుతుందని భావిస్తున్నారు.


పాత ఈడీలకు కూడా నోటీసులు?

ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్‌లో ఈడీలుగా పనిచేసి వెళ్లిన వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రికవరీలో అక్రమాలకు పాల్పడిన మురళీమోహన్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించినా ఆ ఫైలును తొక్కిపెట్టినందుకు గతంలో పనిచేసిన ఈడీలకు కూడా నోటీసులు పంపించి విచారణకు హాజరుకావాలని కోరే అవకాశం ఉంది. అయితే వీరిలో కొందరు ఉద్యోగ విరమణ కూడా చేశారు.  


Updated Date - 2022-08-07T06:28:48+05:30 IST