పోడు సాగుచేసుకుంటున్న రైతులందరికీ హక్కుపత్రాలు

ABN , First Publish Date - 2021-10-21T05:04:40+05:30 IST

ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటుకున్న రైతులందరికీ హక్కుపత్రాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏరాట్లు చేస్తోం దని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం కుమరం భీం వర్ధంతిని పురస్కరించుకుని కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పోడు సాగుచేసుకుంటున్న రైతులందరికీ హక్కుపత్రాలు
భీం విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి ఐకే రెడ్డి, భీం మనుమడు సోనేరావు

దళితబంధు తరహాలో గిరిజనబంధు

టీఆర్‌ఎస్‌ హయాంలోనే జోడేఘాట్‌లో అభివృద్ధి

భీం వర్ధంతి సభలో మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రజాదర్బార్‌ నిర్వహించాలని ఆదివాసీల నిరసన

కెరమెరి, అక్టోబరు 20: ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటుకున్న రైతులందరికీ హక్కుపత్రాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏరాట్లు చేస్తోం దని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం కుమరం భీం వర్ధంతిని పురస్కరించుకుని కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కుమరం భీం విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మినీదర్బార్‌లో మాట్లాడుతూ అడ వులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దళితబంధు తరహాలో గిరిజనబంధు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాతే జోడేఘాట్‌లో భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం రూ.25కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో రూ.18కోట్లు ఖర్చు కాగా మిగిలిన రూ.7కోట్లతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన పండుగలైన దండోరాకు ప్రతి గూడానికి రూ.10వేలు అందించనున్నట్లు తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం..

- ఎంపీ సోయం బాపూరావు

గిరిజన సమస్యల పరిష్కారానికి వేదికైన జోడేఘాట్‌లో సమస్యలు పరిష్క రించని పక్షంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమని ఎంపీ సోయంబాపూరావు అన్నారు. జోడేఘాట్‌ కుమరం భీం వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన దర్బార్‌లో మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక గిరిజన సెల్‌ను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. కుమరం భీం పోరాట ఫలితంగానే ఆదివాసులు పోడు వ్యవసాయం సాగు చేసుకుంటున్నారన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించకుంటే టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. జీవో నం.3ను సుప్రీం కోర్టు కొట్టివేసిందన్నారు. 

గిరిజనుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం..

- ఎమ్మెల్యే ఆత్రం సక్కు

గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పక్షాన ముందుండి పరి ష్కరిస్తామని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. అర్హులైన రైతులందరికీ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించేందుకు కృషిచేస్తానని అన్నారు. ధరణిలో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా తాత్కాలికంగా వాటిని నిలిపి వేశామన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు రెండు పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా త్వరలోనే నూతన పథకాన్ని అందిస్తామని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే జోడేఘాట్‌ రూపురేఖలు మారాయి

- ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాతే జోడేఘాట్‌ రూపురేఖలు మారాయని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ అన్నారు. హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు డబుల్‌ రోడ్డుతోపాటు జోడేఘాట్‌లో స్మృతివనం, మ్యూజియం, ఆర్చీలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివాసీ పల్లెల్లో ఆదివాసీ సర్పంచ్‌లతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బాండ్‌పై భీం విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.

పీవోను అడ్డుకున్న గిరిజనులు..

ఆదివాసుల నిరసన దెబ్బకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జోడేఘాట్‌లో మినీ దర్బార్‌ నిర్వహించారు. వాస్తవానికి ప్రతియేటా అశ్వయుజ పౌర్ణమిన జరిగే కుమరం భీం వర్ధంతిలో ప్రజాదర్బార్‌ నిర్వహించడం అనవాయితీ. అయితే రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా అధికార యంత్రాంగం దర్బార్‌ లను రద్దు చేసింది. ఈ సారి కొవిడ్‌ తీవ్రత తగ్గినందున దర్బార్‌ నిర్వహించాలని ఆదివాసీ సంఘాలు కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలకు విజ్ఞప్తి చేశారు. అయినా పెడచెవిన పెట్టి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో భగ్గుమన్న ఆదివాసీ నేతలు ఐటీడీఏ పీవో సహా అధికారులను, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఘెరావ్‌ చేశారు. నిరసనకు దిగడంతో నివాళులు అర్పించిన తరువాత మినీదర్బార్‌ పేరిట ఆది వాసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసులు మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్న సమస్యలకు సంబంధించి మంత్రికి ఏకరువు పెట్టారు. ఇంతవరకు అవి పరిష్కారం కాకపోవడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. సభా ప్రాంగణంలో భీం మనుమడు సోనేరావు ఎన్నడూ లేని రీతిలో వ్యతిరేక గళం వినిపించడంతో వేధికపై ఉన్న అధికార పార్టీ నేతలంతా ఖంగుతిన్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఎంపీ సోయం బాపూరావు కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేయడంతో ఆదివాసులు ప్రభుత్వం వ్యవహారం తీరు పట్ల సభలో కూడా నిరసన వ్యక్తం చేశారు. 

సూరు విగ్రహం ఏర్పాటు..

కుమరం భీం సమకాలికుడు కుమరం సూరు విగ్రహాన్ని బుధవారం జోడే ఘాట్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భీం మనుమడు సోనేరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో భవేష్‌ మిశ్ర, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:04:40+05:30 IST