చెడ్డ అలవాట్లు వద్దు!

ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST

ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని కుమారుడికి దురలవాట్లు ఉండేవి. ఎలాగైనా తన కొడుకుని మార్చుకోవాలనే ఉద్దేశంతో ఒక తెలివైన వృద్ధుడి సహాయం కోరాడు...

చెడ్డ అలవాట్లు వద్దు!

ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని కుమారుడికి దురలవాట్లు ఉండేవి. ఎలాగైనా తన కొడుకుని మార్చుకోవాలనే ఉద్దేశంతో ఒక తెలివైన వృద్ధుడి సహాయం కోరాడు. ధనవంతుడి కోరిక మేరకు ఆ వృద్ధుడు ఇంటికొచ్చాడు. ‘అలా షికారుకు వెళ్లొద్దాం రా!’ అంటూ ఆ బాలుడిని తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ ఓ దారి వెంట నడుచుకుంటూ వెళుతున్నారు. ఒకచోట చిన్న మొక్కను చూపించి, దాన్ని పీకేయమన్నాడు వృద్ధుడు. ఆ బాలుడు తేలికగా పీకేశాడు. ఇంకొంత దూరం ముందుకెళ్లగానే పొదలాంటిది కనిపించింది. దాన్ని పీకేయమన్నాడు.


బాలుడు అలాగే పీకేశాడు. తిరిగి నడక ప్రారంభించారు. మరోచోట కొద్దిగా పెరిగిన మొక్క కనిపించింది. దాన్ని కూడా పీకేయమన్నాడు. బాలుడు కొద్దిగా కష్టపడి పీకేశాడు. ఇంకాస్త దూరం వెళ్లాక పెద్ద చెట్టు కనిపించింది. ‘దాన్ని కూడా పీకేయ్‌’ అన్నాడు వృద్ధుడు. ఎంత ప్రయత్నించినా బాలుడి వల్ల కాలేదు. అప్పుడు వృద్ధుడు నవ్వుతూ బాలుడి వంక చూస్తూ ‘అలవాట్లు కూడా అంతే! చెడ్డ అలవాట్లు నీలో పాతుకుపోతే, ఆ చెట్టులా తీసేయడం చాలా కష్టం’ అన్నాడు. అప్పటి నుంచి బాలుడు చెడ్డ అలవాట్లను మానుకుున్నాడు. తండ్రి చెప్పినట్టుగా మసలుకోవడం ప్రారంభించాడు.


Updated Date - 2020-07-08T05:30:00+05:30 IST